ప్రేమించాడు.. పెళ్ళి అన్నాడు.. మోసంచేశాడు..


ప్రేమించాడు.. పెళ్ళి అన్నాడు.. మోసంచేశాడు..
ప్రేమికుడిపై స్వలింగ ప్రేమికుడి ఫిర్యాదు..

‘ఫేస్‌బుక్‌లో అతనితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పబ్బులు, క్లబ్బులు, సినిమాలు, షికార్లు తిరిగాం. ఏడాది క్రితం నిశ్చితార్థం కూడా చేసుకున్నాం. గోవాకు వెళ్లాం. ఇన్నాళ్లు కలిసి తిరిగిన అతడు పది రోజుల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడిపై కేసులు నమోదు చేయాల’ంటూ ఓ స్వలింగ సంపర్కుడు (గే) పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల సమీపంలోని న్యూ షాపూర్‌నగర్‌లో నివసించే మద్దంగుల శ్రీను అలియాస్‌ లక్కీరాయ్‌ (26)కు 2017 మార్చిలో ఫేస్‌బుక్‌ ద్వారా అత్తాపూర్‌కు చెందిన మహ్మద్‌ ఫిరోజుద్దీన్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఒకరోజు ఫిరోజుద్దీన్‌ తన ప్రేమ వ్యక్తపరిచాడు. కొద్ది రోజుల తరువాత అతడి ప్రేమను లక్కీరాయ్‌ అంగీకరించాడు. 2018 జులై 8న ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత గోవాకు వెళ్లారు. గతేడాది వాలంటైన్స్‌ డే నాడు పెళ్లి గురించి శ్రీను ప్రస్తావించగా.. అందుకు ఫిరోజుద్దీన్‌ అంగీకరించాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను, స్నేహితులను ఫిరోజుద్దీన్‌ పరిచయం చేశాడు. 2019 మార్చిలో ఫిరోజుద్దీన్‌ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటోను చూసి శ్రీను నిలదీయగా.. ఉత్తదేనని అతడు నమ్మించాడు. అతడి స్నేహితులూ అదే విషయం చెప్పారు. ఈ నెల 14న ఓ యువతిని ఫిరోజుద్దీన్‌ పెళ్లి చేసుకున్నాడని.. ఈ విషయం తనకు ఈ నెల 18న తెలిసిందని పంజాగుట్ట పోలీసులకు శ్రీను గురువారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిరోజుద్దీన్‌పై పంజాగుట్ట పోలీసులు ఐపీసీ సెక్షన్లు 417, 420 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

About The Author