కేసీఆర్‌తో తమిళనాడు మంత్రులు భేటీ
హైదరాబాద్: తాగునీటి అవసరాల కోసం తమిళనాడుకు నీరిచ్చేందుకు సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించారు. తమిళనాడు మంత్రులు వేలుమణి, జయకుమార్‌తో పాటు అధికారుల బృందం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమైంది. చెన్నైలో తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని నీరు విడుదలకు చొరవ తీసుకోవాలని కోరింది. తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఫోన్‌లో ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడుకు తాగునీరిచ్చి సహకరిద్దామని.. నీరు ఎక్కడి నుంచి ఇవ్వొచ్చనే విషయాలపై ఇరువురూ చర్చించారు. పొరుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల విషయంలో సానుభూతి, సహనశీలతతో వ్యవహరించాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
నీరు ఇవ్వాలని కోరుతూ తనతో పాటు ఏపీ సీఎంకు అధికారిక ప్రతిపాదన పంపాలని తమిళనాడు మంత్రులకు కేసీఆర్ సూచించారు. తమిళనాడు తాగునీటి సమస్యను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించానని..లోక్‌సభలోనూ తెరాస ఎంపీలు చెన్నై తాగునీటి అంశాన్ని లేవనెత్తినట్లు ఆయన గుర్తు చేశారు. భారతీయుడిగా, పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తమిళనాడుకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కేసీఆర్ తమిళనాడు మంత్రులకు హామీ ఇచ్చారు. ప్రతిపాదన అందాక మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణులు సమావేశమై నీటి సరఫరా కోసం నివేదిక సిద్ధం చేయాలని.. ఏకాభిప్రాయంతో తుదినిర్ణయానికి రావాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్రాలు పరస్పరం ఎలా సహకరించుకోగలవో ఈ పరిణామం ద్వారా దేశానికి తెలపాలని, ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. తాగునీటి అంశంపై తమిళనాడు మంత్రులు ఇప్పటికే ఏపీ సీఎం జగన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.