వినియోగదారులకు జియో మరో షాక్ !

న్యూఢిల్లీ: టెలికం రంగంలోకి అడుగుపెట్టి ఉచిత వాయిస్ కాల్స్‌తో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. గతేడాది చివర్లో ఉచితాన్ని ఎత్తివేసి షాకిచ్చింది. ఇప్పుడు అంతకుమించిన షాకిచ్చేందుకు సిద్ధమైంది. వైర్‌లెస్ డేటా టారిఫ్‌లను పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం రూ. 15గా ఉన్న ఒక జీబీ డేటా ధరను రూ. 20కి పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్‌కు లేఖ రాసింది. అయితే, వాయిస్ కాల్స్ ధరల విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయడం లేదని, ప్రస్తుతం ఉన్న వాటినే యథావిధిగా కొనసాగించనున్నట్టు ఆ లేఖలో పేర్కొంది. ప్రతిపాదిత డేటా ధరలను తక్షణమే కాకుండా ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో అమలు చేయాలని భావిస్తున్నట్టు ట్రాయ్‌కు తెలిపింది. పెరగనున్న డేటా చార్జీలు అన్ని టారిఫ్‌లకు వర్తిస్తాయని పేర్కొంది.

టెలికం సేవల్లోని టారిఫ్ సమస్యలపై స్పందించాల్సిందిగా ట్రాయ్ కోరిన నేపథ్యంలో జియో కన్సల్టేషన్ పేపర్‌ను సమర్పించింది. భారతీయ వినియోగదారులు సాధారణంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలు పొందాలనుకుంటారని, కాబట్టి పెరిగిన చార్జీలను రెండుమూడు విడతల్లో అమలు చేసే వెసులుబాటు కల్పించాలని ట్రాయ్‌ను కోరింది. ఒకసారి డేటా చార్జీలను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత అన్ని టారిఫ్‌లలోనూ, అన్ని సెగ్మెంట్లలోనూ అమలు చేస్తామని జియో తెలిపింది.

About The Author