ఇంటర్ క్యాస్ట్ వివాహాం చేసుకుంటే..ప్రభుత్వం సంచలన నిర్ణయం…
కులాంతర, మతాంతర వివాహం చేసుకునేవారు దేశంలోని అనేక ప్రాంతాల్లో బహిష్కరణ బెదిరింపులను ఎదుర్కొంటున్న సమయంలో, కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారికి సురక్షితమైన వసతి కల్పించడానికి ‘సేఫ్ హోమ్స్’ తెరవడానికి సన్నద్ధమవుతోంది. అన్ని జిల్లాల్లో ఇటువంటి సురక్షితమైన గృహాలను తెరిచే కార్యక్రమానికి సామాజిక న్యాయ శాఖ నాంది పలికింది.
కేరళ సామాజిక న్యాయ శాఖ మంత్రి కెకె శైలాజా మాట్లాడుతూ.. ‘సేఫ్ హోమ్స్’ ఏర్పాటు దిశగా పనులు ప్రారంభమయ్యాయని..ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ వివాహాలు చేసుకున్న జంటలు.. ఒక సంవత్సరం ఆ గృహాల్లో ఉండొచ్చని తెలిపారు. సదరు జంటలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు మంత్రి తెలిపారు. ఆయా జంటలు జనరల్ కేటగిరిలో ఉండి, లక్ష రూపాయల కన్నా తక్కువ వార్షిక ఆదాయాన్ని కలిగి ఉంటే.. వారికి స్వయం ఉపాధి కోసం 30,000 రూపాయల ఆర్థిక సహాయం చేయనుంది ప్రభుత్వం. ఒకవేళ జంటలో ఒకరు షెడ్యూల్డ్ కుల వర్గానికి చెందినవారైతే వారికి రూ .75 వేల సహాయం అందించనున్నారు.