అమృతది తప్పా..? మారుతీరావుది తప్పా..?

దాదాపు రెండేళ్ళ తరువాత మరోసారి
మూడు పేర్లు రాష్ట్రమంతా గుర్తుకు వచ్చాయి
ఒకటి మారుతీరావు..రెండు అమృత..మూడు ప్రణయ్
.
నేడు మారుతీరావు ఆత్మహత్య(లేక హత్య)
ప్రజలకి ప్రేమికులకి తల్లిదండ్రులకి ఖచ్చితంగా
ఒక కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను.
.
నాడు అమృత భర్తని(ప్రణయ్)చంపిన
మారుతీరావుని హీరోగా దాదాపు 90% సమర్ధించారు.
కారణం అక్కడ అమృత కూతురిగా ఒక మోసగత్తెగా
తండ్రి హంతకుడిగా మారడానికి కారణమైన వ్యక్తిగా
చూశారు తప్ప అమృత అంతరంగాన్ని చూడలేదు.
.
ఎక్కువమంది ఈ హత్యని ముఖ్యంగా
మారుతీరావుని సమర్ధించడానికి కారణం
ఒక హిందూ అమ్మాయి(అమృత)ఒక క్రిస్టియన్
అబ్బాయిని(ప్రణయ్)పెళ్ళి చేసుకున్నాడనే.
కానీ పైకి అందరూ ఇచ్చిన బిల్డ్ అప్ ఏంటంటే..
అంత అల్లారుముద్దుగా పెంచిన తండ్రిని ఆమె
అంత దారుణంగా ఎలా మోసం చేస్తుంది..?
ఏ తండ్రికైనా బాధే కదా అని అన్నారు..
.
Yes నిజంగా బాదే..
.
కానీ ఆ బాధ ప్రేమగా మారి..
వారి జీవితంలో ఎదగడానికి
సహాయం చేసి ఉంటే నేడు
రెండు కుటుంబాలు సంతోషంగా ఉండేవి.
.
పోనీ వారు మీ ఆస్తిని కానీ
మరొకటి కాని ఆశించలేదు..
త్వరలో అమెరికా వెళ్ళి
సెటిల్ అవ్వలనుకున్నారు.
కానీ తండ్రి ప్రేమ కాస్త సంఘం కోసం
తన కులం కోసం ద్వేషంగా మారింది.
.
నేను దాదాపు అమృత మాట్లాడిన
అన్ని ఇంటర్వ్యూలు చూశాను.
తను ప్రణయ్ వారి భవిష్యత్తు కోసం
ఎన్ని కలలు కన్నారో విని బాధ వేసింది.
.
నాడు కొందరు
అమృతది పైత్యం అన్నారు
కొందరు వ్యామోహం అన్నారు
కొందరు వొళ్ళు కొవ్వు అన్నారు.
కొందరు ప్రణయ్ చనిపోయిన
ఏడాదిలోపే ఇంకొకడిని చేసుకుంటుంది
ఛాలెంజ్ అని కూడా అన్నారు.
ఇంకొందరు మొగుడు పోయాడు కదా
ఇక తండ్రి ఆస్తి కోసం ఆరు నెలల్లో
వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అన్నారు.
.
కానీ వారికి పెళ్లై రెండేళ్ళు..
ప్రణయ్ పోయి సంవత్సరం 7 నెలలు అవుతుంది.
పైన చెప్పిన ఒక్కటి జరగలేదు కదా..
నేడు తండ్రి చనిపోయినా కూడా
ఆమెకు ఏమాత్రం చలనం లేదంటే
కారణం ఆమె అనుభవించిన వ్యధ.
తనతో క్షణం కిందట ఉన్న తన
జీవిత భాగస్వామి తమముందే
అత్యంత దారుణంగా గిలాగిలా
కొట్టుకుంటూ చనిపోవడం.
అలాంటి సంఘటన నుండి
ప్రాణంగా ప్రేమించిన ఎవరైనా
అమృత లాగే ఉంటారని నా అభిప్రాయం.
.
తండ్రి తమని పెళ్ళికి ముందు
ఎంతగా వేధించాడో ఎంతగా
బెదిరించాడో అవన్నీ తనకే తెలుసు.
తనకు మాత్రమే తెలుసు.
అవన్నీ ఇంటర్వ్యూలలో ఆమె చెప్పింది.
.
నాన్న నాకు ప్రణయ్ తప్ప
ఎవరిని పెళ్ళి చేసుకోలేను..
దయచేసి మమ్మల్ని వదిలేయండని
అమృత దాదాపు రెండేళ్ళు చెప్పిందట
(అప్పటికే మారుతీరావు పెళ్ళి ప్రయత్నాలు
మొదలు పెడితే అమృత చెప్పిన మాట)
మీకు ఇష్టం లేకపోతే మేము సెటిల్
అయ్యాక పెళ్ళి చేసుకొని మీకు
కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాము.
మమ్మల్ని వదిలేయండని బ్రతిమాలినా
బలవంతంగా పెళ్ళి చేస్తున్నాడని తెలిసి
ఆఘమేఘాల మీద వారిద్దరూ హైదరాబాదులోని
ఆర్యసమాజ్ మందిరంలో పెళ్ళి చేసుకున్నారు.
.
కానీ మనం ఇక్కడ కూర్చొని
పెదరాయడుల్లా మొత్తం
అమృతదే తప్పని తీర్పులు ఇచ్చేస్తాం.
.
తండ్రి ఒక టైం పెట్టో లేక కాస్త అబ్బాయిపై
నిఘా పెట్టి మంచివాడా కాదా లేక నా బిడ్డ
అంటే నిజంగా ప్రేమ ఉందా లేక ఇతను
కేవలం నా ఆస్తికోసమా ప్రేమ అంటున్నాడా
అనే కోణంలో అలోచించి ఉంటే
వీరి కథ నిజంగా అద్భుతంగా ఉండేది.
అంత డబ్బు ఉన్న మారుతీరావుకి
ఇలా కనుక్కోవడం పెద్ద విషయమే కాదు.
.
ఆయనకు ప్రణయ్ అనే అబ్బాయి నచ్చలేదు
ముఖ్యంగా అబ్బాయి కులం నచ్చలేదు.
పరువు పరువు అనుకున్నాడు..చంపేశాడు.
.
ఇప్పుడు మారుతీరావుకి ఏమైంది..?
ఆయన ఏమి సాధించాడు..?
అంత ఆస్తి ఉండి కూడా
జీవితం మధ్యలోనే అంతం అయ్యింది.
.
కనీసం ఒక తండ్రిగా తన కూతురు
దగ్గర ప్రేమని అభిమానాన్ని
పొందలేక ఒక దుర్మార్గపు తండ్రిగా
ఆమె మనసులో ఉండిపోయాడు.
.
ఇక అమృత తన తండ్రిని టీవీలలో
అతను అని సంభోదించినా లేక పట్టనట్టు
మాట్లాడినా ఆమెకి జరిగిన నష్టం
అన్యాయంపైనే ఆమె ఇప్పటికి తన
ప్రణయ్ హత్యే కళ్ళముందు ఉన్నట్టు
అదే దిగులు అదే ఆవేదనలో
ఉన్నట్టు అందుకే అలా
మాట్లాడిందని నేను భావిస్తున్నాను
*
ఏమైనా ఈ ఉదంతం
తల్లిదండ్రులకి ఆడపిల్లలకి
మగపిల్లలకి ముఖ్యంగా ప్రేమించి
పెళ్ళి చేసుకునే ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం.
*
ఇక నేను పూర్తిగా అమృతని
సమర్ధిస్తూ రాసినట్టు అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే ఇది సమర్ధింపు కాదు..
బాధితుల పక్షంలో బాధితుల కోణంలో
అలోచించి వారి స్థానంలో నేను ఉంటే
ఎలా ఉండేది ఏమి చేసేవాళ్ళం అని
ఊహించి రాస్తున్న రాతలు మాత్రమే.
న్యాయస్థానం కూడా ఇలాగే చేస్తుంది.

The Other Side Of The Coin
*
ఇక ప్రణయ్ హత్యపై
నా పూర్తీస్థాయి అభిప్రాయం
అతని హత్య జరిగినప్పుడే రాశాను…

అవి మళ్ళి ఒకసారి ఇక్కడ ఇస్తున్నాను.
ఓపిక ఉన్నవాళ్ళు చదువుకోవచ్చు..

1

కులం కోసం సొంత పిల్లలనే చంపేసే మీరు అసలు మనుషులేనా..??
********************************************************************
నేను తరచూ ఒకమాట అంటూ ఉంటాను..
భారదేశంలో కులం పిచ్చి మరో వందేళ్ళయినా పోదు అని..
చాలామంది అలా ఏమి లేదని,
ఇప్పుడు ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని అంటుంటారు.
.
మీరు చూసే మార్పు నాలికపై వచ్చే మాటలద్వారా చెప్పే మార్పా ??
లేక హృదయ అంతరంగంలో కూడా మార్పుని చూసి చెపుతున్నారా ??
లేక Facebook Whatsapp లలో విపరీతంగా షేర్స్ చేసి
తాము కులాలకి అతీతం అంటూ కేవలం రాతల ద్వారా కనిపించే మార్పా..??
.
ఇక విషయానికి వస్తే..
.
పరువు హత్యలు..
.
ఒకరిని చంపడంలో ఎంత గొప్ప పేరు పెట్టారో చుడండి..
పేరు తగ్గట్టే తమ పరువుకి భంగం కలిగించించారని చంపడం.
పరువు హత్యలు అనేదానికంటే దానిని “కుల హత్యలు” అని
ఎందుకు పెట్టలేదో అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను.
పేరుకి పరువు హత్యలు కానీ..
వారికి లోలోన మన కులం నా కులం వారిని పెళ్ళి చేసుకోలేదని
తద్వారా తన వంశం తన పరువు పోయిందని..
తన బంధువుల్లో తమ కుటుంబం తల ఎత్తుకోలేకపోయిందనే తపన
ఎక్కువగా అనిపించి ఎక్కువగా ఈ రకం హత్యలు చేయిస్తున్నారు.
.
ఇలా చంపితే మీ కడుపున పుట్టిన వారికి మీరు గొప్ప పని చేసారని..
లేక ఇలా మీరు చంపడం వల్ల మీరు అనుకునే మీ కులంవారు
మిమ్మల్ని చాలా గొప్పగా కీర్తిస్తారని అనుకుంటున్నారా..??
మీ భ్రమ కానీ..
.
అసలు మాది నిజమైన ప్రేమ వివాహం అంటూ..
యువతీయువకులు తమ వివాహ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు..
కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడాలతో తమ
సంతానాన్ని ద్వేషించే దుర్మార్గానికి కొత్త పేరు “పరువు హత్య”
.
ఏప్రిల్‌ 2011లో సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు మార్కండేయ కట్జూ,
జ్ఞాన్‌ సుధా మిశ్రాతో కూడిన ధర్మాసనం పరువు పేరుతో హత్యలను
వ్యవస్థీకరించిన ఖాప్‌ పంచాయితీ లను తీవ్రంగా నిరసించింది.
ఉత్తర భారతంలో ఖాప్‌ పంచా యితీలు, దక్షిణాన తమిళ నాడులో
కట్ట పంచాయితీలు క్రూరమైన ఆదేశాలు ఇవ్వడం చెల్లవని వారిని
కఠినంగా శిక్షించాలని ధర్మాసనం పేర్కొన్నది.
2014లో ఖాప్‌ పంచాయితీలవలె షరియత్‌ కోర్టులు మఫ్తి లేదా
ఖాజీ తీర్పులకు కూడా చట్టబద్ధత లేదని, ఈ ఆదేశాల ఆధారంగా జరిగే
పరువు హత్యలను నివారించే బాధ్యత రెవెన్యూ పోలీసు అధికారులకు ఉందని వివరించింది.
.
మచ్చుకు కొన్ని పరువు హత్యలు.
.
కరీంనగర్ జిల్లాలో హుస్నాబాదులో 5 నవంబర్ 2013 లో
షరీఫుద్దీన్ తన సొంత కుమార్తె వేరే మతానికి చెందిన
వ్యక్తిని ప్రేమించిందని తన కుమార్తెను హతమార్చినా…
.
యాదాద్రి జిల్లాలో ఏప్రిల్ 2017 లో
నరేష్ స్వాతీలు ప్రేమ వివాహాన్ని స్వాతి తండ్రి
శ్రీనివాస్ రెడ్డి అల్లుడు నరేష్ ని చంపి తన పొలంలోనే కాల్చేసినా..
ఆపై భర్త కన్పించ స్వాతి కూడా ఆత్మహత్య చేసుకున్నా..
.
వేములవాడలో అక్టోబర్ 5th 2017
ప్రేమ పెళ్లి చేసుకుందని మేనకోడలిని,
ఆమె భర్తని హతమార్చిన సొంత మేనమామలు హతమర్చినా..
.
గుంటూరు జిల్లాలోని గోగులమూడికి చెందిన దీప్తి
కనిపెంచిన తన తల్లిదండ్రుల చేతలతోనే 22 మర్చి 2014 లో
దీప్తి మెడకు చున్నీతో గొంతు బిగించి చంపినా..
.
ఆదిలాబాదులో 23 జూన్ 2016 నాడు
చౌహాన్ లక్ష్మణ్ తన పెద్ద కుమార్తె అఖిల మెడకు
చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసినా..
.
తమిళనాడులోని తిరుప్పూరు జిల్లాలో
చిన్నసామి కుమార్తె కౌసల్య కులాంతర వివాహం చేసుకుందని
ప్రేమికుడిని అమ్మాయి తల్లిదండ్రులు కిరాయి గూండాలతో
13 మర్చి 2016 నాడు హత్య చేయించినా..
.
ఇక రెండు రోజుల కిందటి మిర్యాలగూడ ప్రణయ్ ఉదంతం
మొత్తం యావత్ దేశాన్ని మరోసారి కుల పిచ్చి ఎలా ఉంటుందో తెలియజెప్పింది.
వారిరువురు చూడ చక్కగా ఉన్నారని తండ్రికే కుళ్ళు వచ్చిందో..
లేక దేవుడే వారి ప్రేమ అనురాగాలని చూడలేక ఇలా చేసాడో
తెలియదు కానీ మొత్తానికి నెల తప్పిన ఆ యువతి
జీవితాన్ని ఆమె సగాన్ని సొంత తండ్రే చిదిమేసాడు.
.
మొత్తానికి ఈ ఘటనలు అన్నీ చుస్తే..
వీరికి కడుపుతీపి కంటే తమకు తమ
కుల పిచ్చే ఎక్కువ ప్రాధాన్యత అని చెప్పేశారు.
.
అయితే ఒక్క తమిళనాడులో జరిగిన పరువు హత్య
విషయంలో మాత్రమే ఇప్పటికి శిక్షలు విధించారు.
మొత్తం ఈ కేసులో సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా
పరువు హత్యల కేసులో ఆరుగురికి ఉరిశిక్ష విధించింది.
తన ప్రియుడిని చంపించిన తండ్రికి రెండు ఉరిశిక్షలు విధించింది.
.
ఇక ఈ పిచ్చికి గల కారణాలు విశ్లేషిస్తే..
.
పైన చెప్పినట్టు..
ఇది కేవలం సంఘంలో తమ కుటుంబం తల ఎత్తుకోలేదని
అనే అభద్రతాభయంలో ఎక్కువగా ఈ పనులు చేస్తుంటారు.
.
పరువు హత్యలు చేసిన ప్రతి ఒక్కరూ
జైల్లో కూర్చొని చిప్పకూడు తింటూ..
ఎందుకు ఇలా చేశానా అనుకుంటూ ఉన్నారు..??
ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఏమి వచ్చింది..??
ఇలా చేస్తే పోలీసులకి దొరుకుతారని తెలుసు.
లోకం ఛీ కొడుతుందని తెలుసు..
ఇలా చంపితే నీకేమైనా పరం వీర చక్ర అవార్డు పొందావా ??
లేక గొప్పగా కీర్తిస్తారని అని అనుకున్న
నీ కులవర్గం కనీసం ఇప్పుడు నీతో జైలుకి వచ్చిందా ??
పోనీ కూతురు మీద ప్రేమతో చేసావని అందామంటే..
ఆ కూతురే నిన్ను ఉరి తీయమని అంతగా
అసహ్యించుకుంటుంటే నువ్వు బ్రతికి ఏమి లాభం..?
.
ఇక తల్లిదండ్రుల 25 ఏళ్ళ ప్రేమకి,
పెంపకానికి ప్రేమకు ఏమి గుర్తింపు లేదా ??
.
తప్పకుండా ఉంది..
కానీ నూరేళ్ళ జీవితంలో..
తల్లిదండ్రుల ప్రేమ పెంపకం 25 ఏళ్ళ వరకు ఉంటే..
మిగతా 75 ఏళ్ళ తప్పకుండా భర్తతోనే ఉంటుందిగా..
ఆ విషయాన్నీ నిజాన్ని తల్లిదండ్రులు ఆడపిల్లల విషయంలో
ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది.
ఎందుకంటే సృష్టి ధర్మాన్ని మనం మార్చలేము.
తల్లిదండ్రులు తన పిల్లలని ఎంత ప్రేమించినా..
పెళ్ళి అయ్యాకా ఆడపిల్ల అయినా మగపిల్లాడు అయినా
తమ భర్త/భార్య విషయంలో ఎక్కువ ప్రాధాన్యత తల్లిదండ్రులని కూడా
ఎదిరించే తత్వం ఎందుకు వస్తుందో మీకు మీ విషయంలో తెలియదా పేరెంట్స్ ??
అలాగే మీ పిల్లలు కూడా తప్పకుండా వారి
జీవిత భాగస్వామి మీద ప్రేమ రాకుండా ఎలా ఉంటుంది..
దానిని మీరు ఎలా ఆపగలరు..??
అయితే ఆ ప్రేమ నిజమైందా లేక ఆకర్షణా అనేది మాత్రమే
మనం దగ్గర ఉండి తేల్చి మనకు నమ్మకం కుదిరితే గౌరవంగా
దగ్గరఉండి పెళ్ళి చేయడం మన విలువని పెంచుకున్నవారం అవుతాము.
.
కొందరు యువకులు
చిల్లర చిల్లరగా తిరిగి అమ్మాయిలని ఆస్తి కోసం పడేసి ఆపై
పెళ్ళి చేసుకొని రెండేళ్ళకి వదిలేసే రకాలు ఉన్నారు..
పొంగు చల్లారాక యువతీయువకులు పెళ్ళి చేసుకొని..
విడిపోయిన సందర్భాలు కూడా ఎన్నో..
.
అలా జులాయిగా తిరిగే వాళ్ళతో నా కూతురు
ఇబ్బంది పడుతుంది అని భయపడే తల్లిదండ్రుల కోణం
వారి ఆవేదన ఆలోచించదగినదే..కానీ హత్య చేయడం అంతిమం కాదుగా.
అలాంటి యువకుల నిజ స్వరూపం కూతురికి తెలియజెప్పి
తనని కాపాడుకోవాలి కానీ దానికి చంపడమే విరుగుడు కాదుగా..
.
అయితే ఈ పరువు హత్యల విషయంలో ఒక భిన్నమైన కోణం ఉంది.
.
యువతీ యువకులు చెడు అలవాట్లతోనో
లేక డబ్బుకోసమో యువతులని పడేసి పెళ్ళిళ్ళు చేసుకోలేదు.
లేక తల్లిదండ్రులు భావిస్తున్నట్టు కూతురిని రాచి రాంపాన పెట్టలేదు.
వారు తమ భార్యతో భర్తతో ఇరువురూ అత్యంత ప్రేమతో..
అన్యోన్యంగా ఉంటుండగా వారి తల్లిదండ్రులే యముడిపాత్ర
ధరించడం తమ పిల్లల జీవితాలని అంతం చేయడం అత్యంత హేయం.
వారికి వారి బిడ్డ క్షేమం ప్రేమకంటే కులమే సంఘంలో పేరే ముఖ్యం అయ్యింది.
.
కానీయండి..
మన సమాజంలో కులం కంపుని అణువణువునా నింపుకొని
బయటకు మాత్రం మంచి చొక్కా ప్యాంటు వేసుకొని..
మంచి సెంటు కొట్టుకొని..ఆరు ఏడు అంకెల కారులో తిరుగుతూ..
గొప్ప ఇల్లులో ఉంటున్నంత మాత్రాన మీరు గొప్పకులం అయిపోదు.
.
కులం అనేది మన గుణంలో మన ప్రవర్తనలో
మన విశాల హృదయంలో ఉంటుంది..
అది కూడా చెట్టంత పిల్లలని చేతలరా చంపే
పాశావిస ఆటవిక సమాజంలో ఉన్న మీకు ఈ చట్టాలు
శిక్షలు వేయకపోయినా దేవుడు అనేవాడు ఉంటే
తప్పక వేయాల్సిన శిక్ష వేస్తాడు..
.
కాకపోతే నావైపు నుండి ఒక చిన్న విన్నపం..
ఇలా మీలాంటి కుల పిచ్చగాళ్ళు అందరూ ఒకచోట ఉంటే మాకు సంతోషం.
మీలాంటి వాళ్ళకి మిగతావారు అందరూ చాలా దూరంగా ఉంటాము..!!
.
ఇక సోషల్ మీడియాలో..
ఈ కులం పిచ్చి గురించి మద్దతుగా..
చంపిన తండ్రికి మద్దతుగా రాసిన దారుణమైన వ్యాఖ్యలకి
నేను చాలా దూరంగా ఉంటాను..
ఎందుకంటే చంపించిన తండ్రికంటే వీరు మరింత ప్రమాదకరం కాబట్టి.

2

వీటికి మీ దగ్గర సమాధానం ఉందా ??
***********************************
మనిషి సంఘజీవి..
సంఘంలో జరిగే ప్రతి అంశం
ఎంతో కొంత తనపై ప్రభావం చూపిస్తుంది.
అయితే దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనేది
ఆ వ్యక్తి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.
ఆ విచక్షణ జ్ఞానం లోపించినప్పుడు మనిషి పశువు
లేక మూర్ఖుడు లేక ఉన్మాది లేక సైకో లేదా శాడిస్టు ఇలా
పేరు ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేస్తాడు.
.
మిర్యాలగూడ మారుతీరావు తన కూతురి విషయంలో
గర్భవతి అని తెలిసి..ఆ గర్భం తీయమని డాక్టర్ పై ఒత్తిడి కూడా తెచ్చాడు.
ఇక లాభం లేదని తెలిసి జూలై నుండి చంపించాలని
స్కెచ్ వేసి ఏకంగా గుజరాత్ హోంమంత్రి చంపించిన
Batch తోనే మాట్లాడి కోటి రూపాయల బేరం
మాట్లాడి కూతురి భర్తని కిరాతంగా లేపేసాడు.
సంఘంలో తన పరువు(?) పోయిందని కులం తక్కువవాడిని చేసుకుందని
తను ఈ హత్య చేశానని పోలీసుల ఎదుట మారుతీరావు ఒప్పుకున్నాడు.
.
అలాగే మరో రెండు మూడు
సంఘటనలు ఈవారంలోనే జరిగాయి.
కొన్ని అనుమాదాస్పదంగా జరిగాయి.
మరికొన్ని పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నాయి.
.
అయితే మారుతీరావులాంటి ఘటన జరిగి 48 గంటలు జరక్కుండానే
మరో మారుతీరావు హైదరాబాదు ఎర్రగడ్డ వద్ద ప్రత్యక్షం అయ్యాడు.
మరో మటన్ కత్తి పట్టుకొని గొంతు వరకు మందుతాగి మరీ
ఇరవైఏళ్ళు కనిపెంచిన కన్న కూతురిని చేయి సగానికి
నరికేసి ఆపై మొహం మీద సగ భాగం నరికేశాడు..
.
ఇక విషయంలోకి వెళితే..
.
ఇక్కడ నాలుగు అంశాలు చెప్పాలనుకుంటున్నాను.

మొదటిది-పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర
——————————-
తల్లిదండ్రులు కడుపు కట్టుకొని తమ సర్వస్వం అర్పించి
కేవలం తమ పిల్లల కోసమే బ్రతికే తల్లిదండ్రులు 90% మంది
వారి ప్రేమని కొలవలేము వారి ఋణం తీర్చుకోలేము.
.
మరి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ..
ఒకరి ప్రేమలో ఉన్నదని మీకు తప్పకుండా కొన్ని సంకేతాలు తెలిసే ఉంటాయి..
ఒకవేళ మీకు తెలిసిఉన్నా వాటిని సరిదిద్దుకోకుండా..
మీరు నిర్లక్ష్యం చేసి అంతా అయిపోయాక తేరుకొని ప్రయోజనం ఎందుకు..??
ఈ ప్రేమ వ్యవహారాల్లో అంతో ఇంత తల్లిదండ్రుల లోపం లేక తప్పు ఉంటుంది.
అది ఒప్పుకోవడానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు..
ముందు దానికి నిజాయితీగా మీరు సమాధానం చెపితే
ఆపై మీకు వారి సమస్యకు పరిష్కారం లభిస్తుంది..

ఎందుకు ఇంత ఘంటాపథంగా చెపుతున్నాను అంటే..
ప్రేమ రాహిత్యం వల్లే పిల్లలు యవ్వనంలో తొందరగా ప్రేమలో పడతారు.
ఇది నామాట కాదు..మానసిక విశ్లేషకులు చెప్పేమాట.
.
దీని గురించి మరింత లోతుగా చర్చిద్దాం.
.
అసలు మీ అమ్మాయి అబ్బాయితో చిన్నప్పటినుండి
ఎలాంటి అనుబంధం ఉన్నదో మీ పిల్లలతో మీరు
ఎంత సమయం గడిపారో మీ గుండెల మీద చెయ్యి
వేసుకొని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది.
పిల్లలు కోరుకునే ఆశించే ప్రేమ తల్లిదండ్రుల నుండి
దొరకనప్పుడు వారితో సమయం గడిపేవారు లేక వారి భావాలని
గౌరవించేవారు లేనప్పుడు అప్పుడు బయట నుండి పిల్లలు
ప్రేమని ఆశిస్తారు..సరిగ్గా ఆ సమయంలో కాలేజి స్కూల్ లో
అలాంటి పిల్లలు దగ్గరైతే దానికి వారు పెట్టుకునే పేరే “ప్రేమ”
ఆ వయసుకి వారికి తెలియదు..అది ప్రేమ ఆకర్షణ అని..
.
తల్లిదండ్రులతో పిల్లలు సరైన అనుబంధం
ఉన్న పిల్లలు ప్రతి విషయం పంచుకునే పిల్లలు
తల్లిదండ్రుల ఆశయాలకి వారి మర్యాదకు భంగం కలిగిస్తుందని
ఆలోచించే పిల్లలు ఎవరూ అసలు ఇలాంటి తొక్కలో ప్రేమలు
సరైన వయసు రాకుండా చేసే ప్రేమ పైత్యం యవ్వరాలు చేయరు.
జీవితంలో ఎదగకుండా అసలు అలాంటి పనులు చేయరు.
అది లేకనే కదా అట్టాంటి పనులు చేసేది.
అందులో రెండో ఆలోచనకి ఆస్కారం లేదు.
.
కానీ మీ పిల్లలకి అలాంటి అవకాశం కల్పించింది ఎవరు..??
దీని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు..??
.
ఎప్పుడైతే నీ పిల్లలు
దారి తప్పుతున్నారు అనే విషయం గాలి సోకినప్పుడే
నువ్వు అలెర్ట్ అవ్వాలి..వారికి జీవితం పట్ల
భవిష్యత్తు పట్ల సరైన అవగాహన కల్పించాలి.
వారి లక్ష్యం ఏంటో చిన్నప్పటినుండి నూరిపోయాలి.
అసలు తల్లిదండ్రులకి అంత తీరిక ఎక్కడిది..??
.
వారు చేర్పించిన నారాయణ చైతన్యలో చేరాలి
కళ్ళ అద్దాలు వచ్చేంతలా వారికి నచ్చినా నచ్చకున్నా చదవాలి.
ఆపై పెద్ద చదువు చదివిందని చెప్పుకోవడానికి
పెద్ద ఉద్యోగం చేస్తుందని చెప్పడానికి ఉద్యోగం చేయాలి.
ఆపై తల్లిదండ్రులు చూపినవారిని అమ్మాయి
అబ్బాయికి నచ్చినా నచ్చకున్నా పెళ్ళి చేయాలి.
అప్పుడు తల్లిదండ్రులు ఆనందిస్తారు.
వారి ఆశయం నెరవేరినట్టేగా..అంతేగా చెప్పేది.
మరి ఇప్పుడు అలా తమ ప్రేమని చంపుకొని
తల్లిదండ్రుల మాట విని పెళ్ళిళ్ళు చేసుకున్నవారు అందరూ
సంతోషంగా ఉన్నారా మనసుకు నచ్చినవారిని చేసుకోలేదని
ప్రతిరోజూ గుర్తు తెచ్చుకుంటూ జీవచ్చవాలుగా బ్రతుకుతున్నారా
అనేది వారి అంతరాత్మకి మాత్రమే తెలిసిన విషయం..
ఇది మరో కోణం..జస్ట్ గుర్తు చేస్తున్నాను..
.
కానీ తల్లిదండ్రుల లక్ష్యం అంతా సంపాదనకి
లేక మీ షికార్లకి మీ ఎదుగుదలకి మీ పరువుకి ఇచ్చిన
శ్రద్ద సమయంలో అందులో కేవలం పదిశాతం నీ పిలల్లకి
ఇచ్చి ఉంటే ఖచ్చితంగా నీ పిల్లలు నీ ఇంటినుండి బయటకు కాలు పెట్టరు.
ఇక ఇప్పుడు ఉన్న హై టెక్నాలజీ కాలంలో
పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇచ్చి మీ ఇష్టం అని రోడ్డు మీదకి వదిలేశారు.
వారు కాలేజీకి వెలుతున్నారా లేక పార్కుకు వెలుతున్నారా ??
లేక సినిమాకు వెలుతున్నారా ఇవేమీ మీకు అక్కరలేదు.
వాటికి మీ దగ్గర సమాధానం ఉందా..??
.
అసలు నీ పెంపకంలో లోపం పెట్టుకొని ఎవరో కారణం
అని నిందించి ఎవరినో చేసుకుంటే వారిని చంపి
లేదా నీ కూతురిని చంపి నీ కొంప వారి కొంపని కొల్లేరు చేయడం
దానికి పాతికేళ్ళ కన్న ప్రేమ అని పేరు పెట్టద్దు.
ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే..
ప్రేమ ఎప్పుడూ పగని చావుని కోరుకోదు.
అది కన్నవాళ్ళ విషయంలో అసలు కోరుకోదు.
పిల్లలు తల్లిదండ్రులని కోపంతో ఆస్తికోసం లేక
మరో కోణంలో చంపిన ఉదంతాలు ఉన్నాయి కానీ..
పిల్లలకి ఎంత నష్టం కష్టం వచ్చినా తల్లిదండ్రులు
కడుపులో పెట్టుకొని చూసే తల్లిదండ్రులు ఈ లోకంలో ఎందఱో..
.
“ఎంత ప్రేమగా పెంచాను..
ఎంత గొప్పగా పెంచాను..
నా పరువు మొత్తం పోయింది..
నా పిల్ల లేచిపోయింది..
వేరే కులం వాడిని చేసుకుంది..”అంటారు కానీ..
అసలు నీ పిల్లలు ఎందుకు అలా చేసారని..
మీ సైడ్ నుండి ఏదైనా లోపం ఉందాని ఒక్కరూ చెప్పరు
.
రెండు-సామజిక అంశాల పాత్ర
———————–
మిర్యాలగూడ-ఎర్రగడ్డ ఈ రెండు ఘటనలలో
వారి తండ్రులు చెప్పిన మాట ఏంటంటే..
మాకు సంఘంలో మా బంధువుల్లో తల ఎత్తుకోలేకపోయాము
అతను మా కులం కాదు అనే భావన వారు ఇప్పటికే వ్యక్తం చేశారు.
.
అంటే వారికి వారికి వారి పిల్లల నూరేళ్ళ జీవితం,
ప్రాణం కంటే చుట్టూ ఉన్న నలుగురికోసం మాత్రమే బ్రతుకుతున్నారు.
మనదేశంలో ఈ జాడ్యం మరింత ఎక్కువగా ఉంది.
నీ సొంత నిర్ణయం లేకుండా నలుగురికోసం బ్రతికే
బ్రతుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే..
.
మీ పిల్లల జీవితానికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు
ముందుగా దానిని పరిస్థితులు Top To Bottom అవలోకనం చేసుకోవాలి.
సమస్య పరిష్కారం చేయాలంటే ఏమేమి అడ్డంకులు ఉన్నాయి..?
వాటిని ఎలా తొలగించాలి అనేది ఆలోచన లేదు..
ఎదో ఒకటి చేయాలి..ఏమి చేయాలో తెలియదు..
చేసెయ్యాలి..అంతే..చంపడమే దారి.
ప్రపంచంలో ఉన్న ఎన్నో సమస్యలు అన్నీ చంపడంతోనే
సాధ్యం అవుతాయి అంటే స్మశానాలు తప్ప ఎక్కడా మనిషి ఉండడు..
.
ముఖ్యంగా మనిషిలోని వికృత కోణం
మారుతీరావు ఉదంతం తరువాత బయటకు వచ్చింది.
మారుతీరావుని సమర్ధిస్తారా లేక అతని కూతురిని సమర్ధిస్తారా అని
పుబ్లిక్ పోల్ పెట్టి మారుతీరావుని హీరో చేశారు.
ఎందఱో గొప్పగా మారుతీరావు తండ్రికోణంలో గొప్పగా రాశారు.
అలా లేచిపోతే అయన తలఎత్తుకోలేదు కాబట్టి
అయన చంపడం కరెక్ట్ అంటూ మారుతీరావుని 70శాతం
సమర్ధించడం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.
.
అంటే మారుతీరావులాగా ప్రతి తల్లిదండ్రులు
మీ మీ పిల్లలు ఎవరైనా ఇలా ప్రేమ వివాహాలు లేక
ఎదిరించి పెళ్ళి చేసుకుంటే వెంటనే లేపేయండి.
ఎలా లేపెయ్యాలంటే కిరాయి హంతకులతో
ముక్కలు ముక్కలుగా నరకండి అని ఇండైరెక్ట్ గా పిలుపునిచ్చారు..
పాపం నిన్న ఎర్రగడ్డలో కూతురిని చంపిన తండ్రి
తానూ కోటి రూపాయలు సుపారి ఇచ్చి హత్య చేయించలేక
ఆయనే ఒక వందపెట్టి మటన్ కత్తి కొనుక్కొని కూతురిని నరికాడు..
ఈసారి మరికొంతమంది మారుతీరావులని ఇలాగే తయారుచేసి
మీకు మటన్ కత్తి కొనుక్కునే స్థాయి లేకపోతే అది కూడా మేమే కొనిస్తాం
మీ పిల్లని మాత్రం వదలద్దు తప్పకుండా ముక్కలు చేయాల్సిందే అని
పిలుపుఇచ్చేలా మన చుట్టూ ఉన్న ప్రజలు సమాజం తయారు అయ్యింది.
ఇదే మనిషిలోని వికృతం..
దీనినే సమస్యని అన్ని కోణాల్లో చూడలేని అవగాహన లేమి అంటారు..
ఎంతసేపు తండ్రి కోణం చూస్తారు తప్ప
నీ పిల్లలు ఎందుకు అలా చేశారో
దానికిగల కారణాలు విశ్లేషించుకోరు.
తప్పులేదు..ఎవరి భావాలు ఆలోచనలు వారివి.
అసలు మనకు ఏమి కావాలో ఏది సరైనదో కూడా
మనకు తెలియనప్పుడు మనం ఇలాగేకదా ప్రవర్తిస్తాం.
కానీ అలా వాస్తవాలు అన్నీ వైపులనుండి మనం చేసే
ప్రచారంవల్ల ఎంతమంది మారుతీరావులని మనకు
తెలియకుండానే నిద్ర లేపుతున్నమో వారికి తెలియదు.
ఎంతమంది ప్రణయ్ లు ఎంతమంది సందీప్ మాధవిలు
స్వయంగా వారి తల్లిదండ్రుల కత్తివేటుకు బలి అవ్వాలో చెప్పండి.?
.
ఇవన్నీ వాస్తవాలు..
ఎవరు నమ్మినా నమ్మకున్నా జరిగాయి
ఇకముందు జరుగుతాయి కూడా..
.
మూడోది-పిల్లలు ఎందుకు లేచిపోతున్నారు..??
——————————-
పైన చెప్పినట్టు..
ముఖ్యంగా తమ పిల్లలపట్ల
తల్లిదండ్రుల మానిటర్ లేకపోవడం
పిల్లల వయసు ప్రభావం..
ఆపై జీవితానికి వారికి ఒక లక్ష్యం లేకపోవడం..
లవర్ ఉండడం అనేది ఒక పెద్ద ఫ్యాషన్ గా
వారి చుట్టూ ఉన్న Frds చెప్పడం..
వారికి ఆల్రెడీ లవర్ లు ఉండడంతో
ఇదేమి తప్పు కాదు అనే భావన వారిలో రావడం.
.
ఆరోతరగతి నుండి పదో తరగతిలోనే ప్రేమలు పుడుతుంటే
వాళ్ళని ప్రేమ అని చెప్పాలా ?? ఒళ్ళు కొవ్వు కాకపోతే..??
Of course వాళ్ళకి అది కొవ్వు అని అది
ఆకర్షణ అని కూడా తెలుసుకునే వయసు వారిది కాదు..
మరి అలాంటి వయసులో తల్లిదండ్రులు ఎలా ఉండాలి..??
ఎలాంటి స్నేహితుడి పాత్ర పోషించాలి..?
కేవలం డబ్బు సంపాదిస్తే సరిపోతుందా ??
.
తమ ప్రేమని గుర్తించి మేము సెటిల్ అయ్యాక
పెళ్ళి చేస్తామని కొందరి విషయంలో మాట ఇచ్చినా
ఆలోపే బలవంతంగా దేశం తరలించడం లేక
వేరేవారికి ఇచ్చి పెళ్ళి చేయడం లేక తల్లిదండ్రులు
బ్లాక్ మెయిల్ చేయడంతో కొందరు పిల్లలు ప్రేమించావారికి
దూరం అయ్యి వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.
ఇలాంటి కొన్ని ఘటనలు కొందరిలో అభద్రతాభావం వచ్చి
ఏమైనా సరే త్వరగా పెళ్ళి చేసుకోవాల్సిందే అని
తొందరపడి పాతికేళ్ళలోపే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.
.
తల్లిదండ్రులు నిజంగా పాతికేళ్ళవరకు పెళ్ళి చేయము.
మీరు సెటిల్ అయ్యాక అప్పుడు పెళ్ళి చేస్తాం అని
తల్లిదండ్రులు..పెద్దల..పోలీసుల సమక్షంలో మాట ఇచ్చి
ఆపై ఆమాట మీద నిలబడి పెళ్ళిళ్ళు చేస్తే అటు
ప్రేమించినవారికి ఇటు తల్లిదండ్రులకి ఉన్న
ఈ అంతర్యుద్ధం ఈ కడుపుకోతని..
పరువు సమస్యని కొంతవరకు అరికట్టవచ్చు.
ఈలోపు తల్లిదండ్రులు వెధవపని చేస్తే అప్పుడు వారికి
ఈ సామాజిక కుల అంశాలు అడ్డు వస్తున్నట్టే..
వారికి పిల్లల ప్రేమ కంటే వారికి
ఈ రెండు అంశాలే ముఖ్యం అని అర్ధం అయినట్టేగా..
.
మరి ఇక అక్కడ తల్లిదండ్రులకి తమ పిల్లలపైన
అపారమైన “ప్రేమ” ఉంటుందనే దానికి అవకాశం ఎక్కడ ఉంది..??
.
నాలుగోది-సమాజం..మాధ్యమాల పాత్ర
**************************************
దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఆరేళ్ళ వయసుకే తూనీగా తూనీగా అంటూ పాడుకుంటూ
ఎదిగే ప్రేమ సినిమాలు తీసి ప్రజల యువత మీద వదిలే
ఈ సమాజంలో పిల్లలు అలాగే ఉండాలని..
అదే నిజమైన ప్రేమ అని నమ్మే 90 శాతం యువత
మగపిల్లలు అందరూ తాము ఉదయ్ కిరణ్ లా ఒక తరుణ్ లా భావిస్తారు.
అమ్మాయిలు ఒక శ్రీయలా ఒక ఆర్తీఅగర్వాల్ లా అనుకుంటే..
ఎవడు మాత్రం ఏమి చేస్తాం..?
అది కేవలం రెండున్నగంటల సినిమా అని
జీవితం నూరేళ్ళు ఉంటుందని చెప్పేది ఎవడు..?
ఆ దిశగా చర్చలు చేసి పిల్లలకి అర్ధం అయ్యి చెప్పేది ఎవడు ??
.
ఇక సామజిక మాధ్యమాలలో..
సినిమాలు..హీరో హీరోయిన్స్ బట్టలు శరీర ప్రదర్శనకి
వారి డైలాగ్స్ ఇచ్చిన ప్రాధాన్యత జీవితంమీద ఎందుకు ఇవ్వరు..?
దీనిపై ఎవరు ఎందుకు మాట్లాడరు..??
ఆ సమయంలో హీరో హీరోయిన్స్ మీద సినిమామీద చర్చలు చేసి
అద్భుతంగా మాట్లాడి సినిమా గురించి పెట్టిన చర్చలో
తమ జీవిత లక్ష్యంపైన వారానికి ఒక అరగంట మాట్లాడినా
పిల్లలకి కొంతలో కొంతైనా మేలు జరుగుతుంది.
అబ్బే అవేమి చేయరు..ప్రచారం చేయరు..
చెడుని కీర్తిస్తూ దానిని ప్రచారం చేస్తూ..
దానిపై చర్చలు చేస్తే పిల్లలు అదే నిజం అనుకుంటారు.
అదే ఫాలో అవ్వాలని అనుకుంటారు..
రైలు ఇంజెన్ ఎలా వెళుతుందో వెనక బోగీలు
అలాగే వస్తాయనే కనీస పరిజ్ఞానం ఉంటే ఇది అర్ధం అవుతుంది.
.
ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది.
మారుతీరావు కుమార్తె నిండా ఇరవై ఏళ్ళు లేవు.
ఆ అమ్మాయి మాట్లాడిన కొన్ని అంశాల్లో ఆమెలో
చాలా మానసిక దృఢత్వం కనిపిస్తుంది.
కొన్ని అంశాల్లో చాలా బేలతనం కనిపిస్తుంది.
కారణం ఆమెలో వయసుకి తగ్గ పరిపక్వత లేనితనం.
ఏది నిజం ఏది అబద్దం ఆమెకు జీవితం నేర్పలేదు.
నేర్పే పెద్దలు అవకాశం ఇచ్చి ఎదిగి పడేలోపు..
తండ్రే కాలయముడు అయ్యాడు.
ఆమెను మరింత అఘాదంలోకి నేట్టేసాడు.
ఇప్పుడు రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
.
తప్పెవరిది అంటే..ఎవరూ సమాధానం చెప్పలేరు..
.
కారణం ఈ ప్రపంచంలో ఎవరికివారు కరెక్ట్..
ఒసామా బిన్ లాడెన్ కూడా తన వారికోసం
అమెరికాపైకి విమానాలు పంపి చంపించాను అన్నాడు.
ఆయన్ను ఫాలో అయ్యేవారు అందరు లాడెన్ ను దేవుడు అన్నారు.
అది నాణానికి ఒకవైపు..
కానీ ప్రపంచానికి లాడెన్ ఒక ఉగ్రవాది..
వాడిని చంపల్సిందే..కారణం అమాయకుల ప్రాణాలు తీశాడు.
ఇది నాణానికి మరోవైపు..ఎవరికీ వారు కరెక్ట్ అని చెప్పడమే నా ఉద్దేశ్యం.
కానీ ఆ కరెక్ట్ అనేది ప్రాణాలు తీసి చేయాలనీ అంటే పైన చెప్పినట్టు
మన ప్రపంచంలో మనుషులు లేకుండా స్మశానాలు మాత్రమే ఉంటాయి.
.
ఇక మారుతీరావుపైన ఇలాంటి
హత్యల మీద పదే పదే మీడియా చేసే హడావుడి
వారి ఆరాటం వారి సంబరం చెప్పనలవికానిది..
వారికి ఎందుకు జరిగింది అనే అలా జరగకుండా ఉండాలంటే
ఏమి చెయ్యాలి అనే కోణంలో కంటే ఇలా చంపాడు అలా చంపాడు
అని ఒక విధంగా మరికొంతమందిని ప్రేరేపిస్తూరు.
సమాజంలో అత్యంత బాధ్యత నిర్వర్తించాల్సిన మీడియా
ఆ బాధ్యతని విస్మరించి తన TRP(కాసుల కక్కుర్తికోసం)రేటింగ్స్ కోసం
పదే పదే అదే చూపడం వికృతానికి పరాకాష్ట.
.
ఇక Facebook Whatsapp లలో
మారుతీరావులాంటి వారు మరింతమంది రావాలని
ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నవారిని లేక
పరువు పోయిందని భావించేవారందరిని
ఇలాగే నరకమని సందేశాలు ఇస్తూ..
అలా చేస్తేనే వారు హీరోలు అనేలా రాయడం
అసలు ఏమని చెప్పాలో కూడా అర్ధం కాలేదు.
.
అలాగే పిల్లల చేసిన తొందరపాటుకి
ఊరిలో తలఎత్తుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న
ఉదంతాలు కూడా మన సమాజంలో ఉన్నాయి.
అసలు ఒకరి కోసం ఒకరు ఏమనుకుంటారో అని
వారికోసం బ్రతకడం మానేయండి దయచేసి.
ఇది మీ జీవితం మీరు మీ పిల్లలకి సంబంధించిన విషయం.
వాడెవడో ఏమో ఎదో అనుకుంటాడని మీరు చనిపోవడం ఎందుకు..??
మీ జీవితం మీ ఇష్టం..వాడు మీకు అన్నం పెడతారా??
లేక రోజూ వాళ్ళు మీ గురించే చర్చించుకుంటూ ఉంటారా??
.
అంతిమంగా చెప్పేది ఏంటంటే..
.
ఈ ప్రేమ..
ఆకర్షణ..
పరువు..
కులం..
ఈ నాలుగు అంశాలకి సంబంధించిన నిర్వచనాలు
ముందు సరిగ్గా తెలిస్తే ఆపై మనం ఏమైనా చర్చించవచ్చు.
అది కూడా ఈ నాలుగు అంశాలు ఎవరివారు ఒకవైపే
అలోచిస్తూ “పెదరాయుడు-పాపారాయుడు” తీర్పులు ఇస్తున్నారు.
దానికి మీ పిల్లే పిల్లాడే ఇలా చేస్తే ఊరుకుంటారా అనే ప్రశ్నలు వేయకండి.
.
అలా నన్ను అడిగేతే కూడా
నా దగ్గర సమాధానం ఉంది.
నేను పక్కా ప్రాక్టికల్ మనిషిని..
Yes..
నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు..
వారు రేప్పొద్దున్న ఇలా అపరిపక్వత పనులు చేస్తే..
ముందుగా నా పెంపకాన్ని నేను తప్పుపడతాను..
నా పెంపకం సరిగా లేదు ఒప్పుకుంటాను…
నా తప్పుకి వేరేవాళ్ళని బలి పెట్టను.
మొదటి తప్పటడుగు వద్దే నేను మేల్కొంటాను.
వారిని లక్ష్యంవైపు నడిపించకుండా వారు వేసిన
తప్పటడుగుకి నాకు నేను ఆత్మవిమర్శ చేసుకుంటాను..
పూర్తిగా దారి తప్పకుండా మరింత జాగ్రత్త పడతాను.
అయినా తప్పటడుగులు వేస్తె వారికి నిజం ఏంటో
అబద్దం ఏంటో ప్రాక్టికల్ గా తెలియజెపుతాను..
అయినా వారు తప్పుచేసి వెళ్ళిపోతే..
వారి ఖర్మ అని నీళ్ళు వదిలేసుకుంటాను..
ఆపై వారికి జీవితంలో కష్టం నష్టం అన్యాయం జరిగినా
వారిని నా ప్రాణం ఉన్నంతవరకు
చేతనైనంతవరకు నా కడుపులో పెట్టుకొని
చూసుకుంటాను తప్ప వారిని అంతం మొందించను.
ఇది నా తండ్రి ప్రేమ…ఇది పూర్తిగా నా కోణం.
.
కానీ దయచేసి నిజం నిజంగా మాట్లాడండి.
తెలిసి తెలియని మాటలు రాసి..
మరింతమంది మారుతీరావులని..
మరింతమంది మనోహరాచారిలని మీ మాటల ద్వారా
మీ రాతల ద్వారా సమాజంలో ప్రచారం చేయకండి..
మీ రాతల ద్వారా మీకు స్వయంతృప్తి పొందుతారేమో కానీ
రెండు కుటుంబాలని లేక రెండు ప్రాణాలని మాత్రం
నిస్సందేహంగా పరోక్షంగా మటన్ కత్తితో చంపించకండి.

3

తండ్రి మారుతీరావు కోణం చూశాము..అర్ధం చేసుకున్నాం..
మరి అమ్మాయి కోణం ఎలా ఉంటుందో Anjali గారి మాటల్లో చూద్దాం
********************************************************************
ఆలోచించడానికి మనసు..
ఒప్పుకోవడానికి అహం లేని జ్ణానం ఉంటే ఆలోచించండి..
ఒక హంతకుడ్నో ,రేపిస్టునో ఉగ్రవాదినో,
స్మగ్లర్నో చంపడానికి కూడా చట్టాలు న్యాయవిచారణ చేస్తాయి..
అలాంటి కేసుల్లో కూడా మరణదండన అనేది చాలా అరుదు.
.
అలాంటిది కన్నాం..పెంచాం..బట్టలిచ్చాం..భోగాలిచ్చాం..
కాబట్టి మాకు నచ్చితే ఇస్తాం..నచ్చితే చేస్తాం..
కాదంటే కడుపున పుట్టిన బిడ్డల్ని నరుకుతాం అనే
పశువుల్ని ఏమనాలో నాకు అర్థం కాదు..
.
పిల్లల్ని కన్నారా..??
పుల్లల్ని కన్నారా..??
కుదిరితే ఇంటి చూరులో పెడతాం..
బెడిసి కొడితే పొయ్యిలో పెడతాం అనడానికి..??
.
కన్నాం అంటే జంతువులు కూడా కంటాయి..
పెంచాం అంటే మనిషి పుట్టక పుట్టాక అదో గొప్ప విషయమా?
ఆ పిల్లలే పెద్దయ్యాక ముది వయసు తలితండ్రులని
చూసుకోకపోతే ఇదే సమాజం దుమ్మెత్తి పోయదా..
ఎందుకంటే..మనిషిగా అది బాధ్యత..
అంత మాత్రాన ఎదిగిన బిడ్డలకి తమ ఇష్టా ఇష్టాలుంటాయి..
ఆవి తప్పు అని అనిపిస్తే చెప్పడం వరకు న్యాయమే..
కేవలం తల్లితండ్రుల అభిప్రాయాలకు విరుద్ధం
కాబట్టి చంపాలనుకోవడం ఎక్కడి న్యాయం..??
.
కూతురనగానే మరీ కర్కశ న్యాయాలు..
వీళ్ళ ఇంటికి అలంకారాలు..ఇంటి పరువుకి ఊత కర్రలు..
అవసరానికి పనికొచ్చే వస్తువులు..
నాన్నదో..సోదరుడిదో..మొగుడిదో..కొడుకుదో
ఇష్టానికి అనుగుణంగా నడుచుకుని
బ్రతుకుబండి లాగించాల్సిన బానిసలు..
ఇలాంటి ఆలోచనలున్నవాళ్ళే ఒక ఆడపిల్ల తన
ఇష్టానుసారం పెళ్ళి చేసుకుందనగానే దాన్ని
నరకడం రైటని న్యాయమూర్తుల్లా అందరూ తీర్పులు..
పరువుకంటే కూతురెక్కువ కాదని తీర్మానాలు..
వీటికి దిక్కుమాలిన చదువులెందుకు…??
అసలు గడప దాటనివ్వడమే తప్పు అని
అణువణువునా పెంచుకున్న అహంకారాల ఘీంకారాలు.
.
మొగుడు ఏ గుడిసెలోనో దూరినప్పుడో..
ఏ రెండో సంసారమెట్టేసినప్పుడో..
కుదిరినప్పుడల్లా నాలుగు కరెన్సీ నోట్లతో
హైటెక్ సుఖాల్ని రిసార్టుల్లో కొనుకున్నపప్పుడో..
కొడుకు ఆడపిల్లల వెంటపడి వేధించినప్పుడొ..
ఒంటరిగా దొరికితే జంతువులా అనుభవించినప్పుడో..
పదిమంది ఆడోళ్ళతొ రాసలీలల ఫోటోలు
పబ్లిగ్గా తెలిసినా పోని పరువులు తమ కూతురు
తనకు నచ్చిన వాడిని చేసుకుంటే పోతుంది..కదా ??
.
ఎవడో రాస్తాడు..
“మా కులం లో మగాళ్ళు లేరా..??
ఆ తక్కువ కులపోడ్ని చేసుకోవడానికి అని..??
దానికి ఒళ్ళు బలుపని అడ్డమయిన బూతులు మాట్లాడతారు..
ఇంకో ఆడపిల్లని అసహ్యకరమయిన
పదజాలంతో దూషించడానికి ఎవరిచ్చారధికారం..??
వీళ్ళ నాలుకలు తెగ్గొయ్యద్దా..??
నీ కులంలో అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడం
లేదు కనుక ఏ పిల్లా తనకి నచ్చిన వాడిని చేసుకోకూడదా..??
తనేమన్నా అంగడి సరుకా మీ అవసరాలకు తగ్గట్టు నడవడానికి..??
.
తక్కువ కులపోడ్ని చేసుకుందని అందరూ
చులకనగా మాట్లాడితే ఆ తండ్రి ఏం చేస్తాడని తొక్కలో డయలాగులు..??
ఏం..నా కూతురు కూడా ఒక మనిషే..
మనసుకి నచ్చిన వాడిని చేసుకుంటానన్నాక ఇంకెవడికో ఎలా చేస్తాం..??
అది వ్యభిచారమవుతుంది కాని కాపురం ఎలా అవుతుందని
ఎదురు ప్రశ్న వేసే సత్తా మీకుంటే ఎవడు మిమ్మల్ని నిలదీసేది..??
.
ఈ సమాజంలో రోజూ జరిగే ఎన్నో
అనర్థాలకు కారణాలయ్యే మగ వాళ్ళెందరు లేరు.??
వాళ్ళందరు ఎవరో ఒకరికి కొడుకులే..
వీళ్ళు చేసే దరిద్రపు పనులకు పరువులు
పోతాయని వాళ్ళని తెగ నరికే తల్లితండ్రులెందరు..??
నీచాతి నీచమయిన హేయమయిన కేసుల్లో కూడా..
నా కొడుకిలాంటి వాడే..ఇలాంటి జంతువుకి
శిక్ష పడాల్సిందే అని సాక్స్యాలిచ్చే వాళ్ళెంతమంది..?
.
జూదరి..
వ్యసనపరుదు..
స్త్రీలోలుడు..
పొగరుబోతు..
తాగుబోతు..
ఎన్ని ఉన్నా వాడు చావగానే
వాడి అంత్యక్రియలు సరిగా చేయకపోతే..
ఛీ..ఎంత తప్పుడోడయినా కొడుకు చస్తే చూడ్డానికి రాని
వీళ్ళు మనుషులేనాని మాట్లాడే వెన్నెముక మిస్సయిన వాళ్ళందరు
ఆడపిల్ల అడుగడుగులో వీళ్ళ పరువులు పడున్నాయని అనుకుంటే..
జన్మనిచ్చే జాతిని వస్తువులా తప్ప..
లేదా దేవతని రాయిలా చూడటం తప్ప మనిషిలా
చూడటం చేతకాని దరిద్రుల్ని పుట్టించే దౌర్భాగ్యం ఆడపిల్లదే..
.
ఆడజాతిని బలిపశువుని చేసి
నరికే కసాయికి జన్మ నిచ్చే ఖర్మ ఆడదానిది.
లేకపోతే ఇంతమంది పశువులు నోళ్ళేసుకుని కనిపెంచిన వాడికంటే..
వాడెక్కువయ్యాడా వీడెక్కువయ్యాడా దానికి అని
బూతులు మాట్లాడుతున్నారంటే ఏంటర్థం..??
అమ్మంటే వీడ్ని కనడానికి వీడి నాన్నకో వస్తువు..
.
వారంటే వీడి మగతనానికి రుజువిచ్చే వస్తువు..
కూతురంటే వీడి అధికార బలానికి
అహంకారపు బలుపుకి అద్దం పట్టే వస్తువు..
ఇంట్లో ఆడది వీడికి మాత్రం పనికొచ్చే వస్తువు..
బయటి ఆడది ఎవడికయినా పనికొచ్చే వస్తువు.
.
ఈ మనస్తత్వాలు..
ఈ బలుపులు ఉన్నవాళ్ళు..
గమనించారో లేదో..
కుళ్ళు వాసన కొడుతూనే ఉంటారు.
ఆడోళ్ళని గడప లోపల పెడితే పరువులుంటాయనే వాళ్ళే..
.
అవకాశం దొరికితే ఏ ఇంటి ఆడపిల్లనయినా
వీధిలోకి లాగి బజారుదాన్ని చేస్తారు..
లేకపోతే..అతి పురాతన వృత్తిగా
వేశ్యావృత్తి పరిగణించబడేదే కాదు..
నిజంగా మగాడయితే మొదట
తాను మనిషని గుర్తుంచుకుంటాడు..
తనకి జన్మనిచ్చే అమ్మ మనిషని గుర్తిస్తాడు..
ఏ ఆడదయినా తన లాంటి మనిషే అని మరిచిపోడు.
మనిషని మరిచిపోయి మగాడిగా మాత్రమే
బ్రతికే వాడికి జంతువుకి తేడా ఏముంది..??
.
నిజానికి నిజంగా సత్తా ఉండి వెన్ను
విరుచుకుని బ్రతక గలిగే దమ్ము ఉంటే..
తప్పులన్నీ ఆడవాళ్ళకి అంటగట్టి మగవాళ్ళకి
జంతునీతి అంటగట్టి బ్రతికేస్తారు..By Anjali Gerri

About The Author