ఎట్టకేలకు కుటుంబ సభ్యులతో జ్యోతి…
కర్నూలు – చైనాలోని వుహాన్‌లో చిక్కుకున్న కర్నూలు యువతి అన్నెం జ్యోతి ఎట్టకేలకు తన కుటుంబ సభ్యుల వద్దకు చేరింది… గత 15 రోజుల క్రితం ఢిల్లీ చేరుకున్న జ్యోతిని కరోనా అనుమానంతో మానేసర్ లో ఐసోలేషన్ వార్డులో ప్రత్యేకంగా చికిత్స తీసుకుంది.. ఆమెకు ఎటువంటి వైరస్ లేకపోయినప్పటికీ చైనా నుంచి రావడంతో భారత్ ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యగా 14 రోజులు పాటు ఆమెను ఐసోలేషన్ లో ఉంచింది.. నేటి ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న జ్యోతి అక్కడి నుంచి తన స్వగ్రామమైన కర్నూలుకు బయలుదేరి వెళ్లింది. కాగా, కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చైనాలోని వూహాన్ లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని వివిధ పరిణామాల మధ్య ఇండియాకు తీసుకొచ్చారు. చైనాలోని చిక్కుకున్న భారతీయులను స్వదేశం చేర్చేందుకు మొదట రెండు ఎయిరిండియా విమానాలు అక్కడకు వెళ్లాయి. కానీ.. జ్యోతిని తీసుకొచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ఆమెకు కరోనా వైరస్ సోకిన లక్షణాలు ఉన్నాయని అందుకే ఆమెను తీసుకురావడం లేదని విమాన సిబ్బంది తెలిపారు. దీంతో కుంటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే తనకు స్వల్ప జ్వరం మాత్రమే వచ్చిందని.. కరోనా సోకలేదని, తనను వెంటనే భారత్‌కు చేర్చాలని ఆమె సెల్ఫీ వీడియోలో భారత ప్రభుత్వాన్ని కోరింది. అటు ఆమె తల్లిదండ్రులు, కాబోయే భర్త అమరనాథ్ రెడ్డి కూడా భారత అధికారులను అభ్యర్థించారు. మరోవైపు వివాహం కూడా వాయిదా పడింది. చివరకు వూహాన్ చేరిన ఎయిరిండియా విమానం ఇతర భారతీయులతో పాటు అన్నెం జ్యోతిని కూడా ఇండియాకు తీసుకొని వచ్చారు. ఇటీవలే సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన జ్యోతి ట్రైనింగ్ కోసం చైనాలోని వూహాన్ నగరానికి వెళ్లింది. అదే సమయంలో కరోనా వైరస్ విజృంభించడంతో ఆమె అక్కడే చిక్కుకుపోయింది. గత నెల 26వ తేదీ బుధవారం విమానంలో భారత్‌కు వచ్చిన జ్యోతి కి ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందించారు. ఆమెలో కరోనా వైరస్ లక్షణాలు లేకపోవడంతో స్వస్థలానికి పంపారు.