కరోనా జాతీయ విపత్తు-కేంద్రం ప్రకటన..


కరోనా విజృంభణను తట్టుకుని నిలిచేందుకు ప్రపంచ దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్‌ దీన్ని ‘జాతీయ విపత్తు’గా ప్రకటించింది. విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలను, ఈత కొలనులను ఈ నెలాఖరు వరకు మూసెయ్యాలని పలు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. పార్లమెంటు ప్రాంగణంలోకి సందర్శకులను నిషేధించారు. సుప్రీంకోర్టులోనూ ముందు జాగ్రత్తగా మరిన్ని ఆంక్షలు విధించారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారికి అంత్యక్రియలు నిర్వహించడంలో ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అమెరికా జాతీయ ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలు మినహా అమెరికా అంతటికీ వైరస్‌ వ్యాపించడంతో అరుదైన రీతిలో దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లినవారి నుంచే ఇప్పుడు ఎక్కువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. స్పెయిన్‌లో ఒక్కరోజులో 1500 మంది కరోనా బారినపడ్డారు. ఇరాన్‌లో ప్రాణనష్టం మరింత పెరిగింది. కరోనాపై పోరుకు ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేయడానికి సార్క్‌ కూటమి దేశాల నేతలు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ చొరవ మేరకు దీనిని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తామూ పాల్గొంటున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది.

About The Author