తెలంగాణలో స్కూళ్లు, థియేటర్లు మూసివేత..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్ -19) భారత్‌లోనూ చాపకిందనీరులా విస్తరిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారి వ్యాప్తి కట్టడికి ముందస్తు చర్యలు చేపట్టింది. జనసందోహాలకు ప్రజలు దూరంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలను ఈ నెల 31 వరకు మూసివేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన ఉన్నతస్థాయి కమిటీ దేశంలో కరోనా ప్రభావం, పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించింది. అనంతరం రాష్ట్రంలో ఈ వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మాత్రం యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.