మాస్క్ లు రేట్లు పెంచి అమ్మితే కేసులు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం..


కరోనా భయంతో మాస్క్ లు, హ్యాండ్ శానిటైజర్లకు కొంతమంది కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది తెలంగాణ హైకోర్టు. మాస్క్ లను నిత్యావసరాల పరిధిలోకి తీసుకు రావాలని, వీటికి కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు పెట్టాలని సూచించింది. అపరిశుభ్రతే కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణం అవుతుందని కరోనా వైరస్ మురికివాడల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, మురికి వాడల్లోని పేదలకు రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా మాస్క్‌లు, శానిటైజర్లు ఇవ్వాలని, ఈ అంశాన్ని పరిశీలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కరోనా తెలంగాణలో ఉందంటూ వార్తలు వ్యాప్తి చెందడంతో మాస్కుల ధరలను భారీగా పెంచారు వ్యాపారులు. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని సొమ్ము చేసుకోవడానికి ఇదే అనువైన సమయంగా భావిస్తున్న వ్యాపారులు మాస్క్‌ల ధరలను ఆమాంతం పెంచేసి కృత్రిమ కొరత సృష్టించి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ విషయంపై ఓ పిల్ దాఖలు కావడంతో.. విచారణ చేపట్టిన ఇద్దరు జడ్జ్ ల బెంచ్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టిపెట్టిందని, మాస్క్ ల రేట్లు పెంచి అమ్ముతున్న 10షాపుల్ని సీజ్ చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది బెంచ్ కి తెలియజేశారు.

About The Author