వీణావాణీలకు రాత సహాయకులు మహిళా శిశు సంక్షేమ శాఖ అభ్యర్థనకు విద్యాశాఖ అంగీకారం
అవిభక్త కవలలు వీణావాణీల తరఫున పదో తరగతి పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ ఇద్దరు రాత సహాయకులను (స్రైబ్స్) కేటాయించనుంది. స్త్రీ శిశు సంక్షేమశాఖ వినతి మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.వీణావాణీలు ఈ దఫా ఆంగ్ల మాధ్యమంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఇద్దరికీ బోర్డు వేర్వేరుగా హాల్ టికెట్లు కేటాయించింది. పరీక్ష రాసేందుకు సహాయకులను ఇస్తామని విద్యాశాఖ అధికారులు మొదట్లో ప్రతిపాదించగా, వారు నిరాకరించారు. సొంతంగా రాసేందుకే మొగ్గుచూపారు. ఒకేసారి ఇద్దరూ పరీక్ష రాయడానికి వీలుకాని పరిస్థితి ఉన్న కారణంగా సహాయకులను కేటాయించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్టేట్ హోం అధికారులు బుధవారం ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డిని కోరారు. అందుకు అంగీకరిస్తూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను సహాయకులుగా నియమించారు. సాధారణంగా ఉదయం 9.30 నుంచి 12.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అవిభక్త కవలలకు మాత్రం అరగంట అదనపు సమయం ఇస్తామని సత్యనారాయణరెడ్డి తెలిపారు. వీణావాణీలు తెలివైన విద్యార్థులని, పరీక్షల కోసం కొద్ది నెలలుగా బాగా చదువుతున్నారని యూసఫ్‌గూడలోని స్టేట్‌హోం సూపరింటెండెంట్ సఫియా తెలిపారు. వారికి స్టేట్‌హోం సమీపంలోని మధురానగర్ ప్రగతి స్కూల్‌లో పరీక్ష కేంద్రం కేటాయించినట్టు చెప్పారు. వారిని కేంద్రానికి తీసుకెళ్లేందుకు వీలుగా వాహనం సమకూర్చామన్నారు.
అక్కచెల్లెళ్లు ముగ్గురూ పది పరీక్షలకు..
వీణావాణీల సోదరి అంబిక కూడా వరంగల్ నర్సింహులపేటలోని ఆదర్శ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాయనుంది. ఒకే ఇంట్లో ముగ్గురు అక్కాచెళ్లెళ్లు పదో తరగతి పరీక్షలు రాస్తుండటం విశేషం.