జరుగుతున్న కథ పెద్దది..కానీ, అందరూ చదవాలి,
*జరుగుతున్న కథ పెద్దది..కానీ, అందరూ చదవాలి,
*మిగతా అందరికీ పంచాలి..*
*మనందరికీ కనువిప్పు కలగాలి.*
ఒక సూక్ష్మ జీవి.. కంటికి కనపడదు. దాన్ని చూసిన వాళ్లెవరూ లేరు. అయినా న్యూయార్క్‌లోని ఒక వెయిటర్, బెంగళూరులోని కూలి, తెలంగాణలోని మొక్కజొన్న రైతు, కువైట్‌లోని సెలూన్ వర్కర్ దాంతో యుద్ధం చేస్తున్నారు. బతుకుని కోల్పోతున్నారు. నిశ్శబ్దంగా అన్నీ కుప్పకూలి పోతున్నాయి.
ఎక్కడో చైనాలో వచ్చింది.. మనకేం కాదులే అనుకున్నాం. చైనా వాళ్లు ఏం చేసినా ఓవర్ యాక్షన్ అనుకున్నాం. తమ దేశానికే గోడ కట్టుకున్న మొండివాళ్లు, వైరస్‌ని కూడా అంతే మొండిగా తరిమేశారు. అది ప్రపంచం మీదికి వచ్చి పడింది. ఇదేదో చిన్న విషయం అనుకున్నాం, కానీ ఇటలీ ఒక పెద్ద యుద్ధమే చేస్తోంది. ఎంత పెద్ద యుద్ధమంటే.. 80 ఏళ్లు పైబడిన వాళ్లు చచ్చినా ఫర్వాలేదనుకునే యుద్ధం.
ప్రపంచంలోని అన్ని రాజకీయాలు పక్కకెళ్లిపోయాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఎవరికీ ఆలోచన లేదు. సిరియా సంక్షోభంపైన వార్తలు లేవు. ఇరాన్ రాజకీయాలు మానేసి, ప్రజల్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది. జిహాద్ అని అరిచేవాళ్లు కూడా ఈ కొత్త శత్రువుకి భయపడుతున్నారు. పాకిస్తాన్‌కి ఇపుడిపుడే అర్థమవుతూ ఉంది. తాలిబన్లు కూడా చర్చల గురించి మాట్లాడడం లేదు.
ప్రపంచ యుద్ధాలప్పుడు కూడా ఇంత సంక్షోభం లేదు. దేశాలకి దేశాలే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవడం ఎప్పుడూ జరగలేదు. పార్కుల్లో మనుషులు లేరు, ఆలయాలు ఖాళీ, థియేటర్లు లేవు. మనుషులందరినీ కలిపే సంబరాలు, ఉత్సవాలు లేనేలేవు. తిరుమలలో క్యూలైన్లు లేవు. వెళితే దర్శనం అయిపోతుంది.. కానీ, వెళ్లాలంటేనే భయం.
ఎక్కడో ఉందనుకుంటే, మన ఊరికి కూడా వచ్చేసింది. అమెరికాలోని జాక్సన్‌విల్లీలో 20 కేసులు నమోదయ్యాయి. ఆ ఊరికీ నాకూ ఏ సంబంధం లేదు, ఒకప్పుడు. కానీ ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు. విన్నప్పటి నుంచి టెన్షన్.
ఇది నా ఒక్కడి బాధ కాదు, ప్రపంచమంతటి బాధ. న్యూయార్క్‌లో ఆంక్షలు పెడితే నూజివీడులోని వందలాది మంది తల్లిదండ్రులు నిద్రపోరు. కాలిఫోర్నియాలో కరోనా వస్తే కరీంనగర్‌లోని ఒక తల్లి దుఃఖిస్తుంది. ప్రపంచం చిన్నదైపోయిందని సంతోషపడ్డాం, కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడేం జరిగినా దుఃఖించాల్సిందే.
ఈ విషపు గాలి మనుషుల్ని ఆర్థికంగా నరికేయడం ప్రారంభించింది. కోళ్ల రైతు దివాళా దశలో ఉన్నాడు. స్కిన్‌లెస్ చికెన్ కిలో 60 రూపాయలకే హైదరాబాద్‌లో అమ్ముతున్నారు. కొనేవాళ్లు లేరు. ఊళ్లలో ఊరికే ఇచ్చినా తీసుకునే వాళ్లు లేరు. దీని మీద ఆధారపడిన లక్షలాది మంది బతుకులు ధ్వంసమై పోతున్నాయి.
కరోనా వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకున్నట్టు, ఆర్థిక మాంద్యం కూడా అంటువ్యాధే. రోడ్డు మీద చికెన్ పకోడి అమ్మేవాడి దగ్గరి నుంచి రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ అమ్మేవాడి వరకు బాధితులే. కోళ్లదాణాకి డిమాండ్ లేకపోవడంతో మొక్కజొన్న రైతు కష్టాల్లో ఉన్నాడు.
షూటింగ్‌లు ఆగిపోయే సరికి దేశ వ్యాప్తంగా లక్షలాది మంది సినీ కార్మికులు రోడ్డునపడ్డారు. రోడ్డు మీద మనుషులు లేకపోయే సరికి ఆటో డ్రైవర్ పెళ్లాం, పిల్లలు పస్తులుంటున్నారు. కిరాయి కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయిస్తారు. కిస్తు కట్టకపోతే ఆటో లాక్కుంటారు. ఆకలి ఆత్మహత్యల్ని పెంచుతుంది. నేరస్తుల్ని చేస్తుంది.
వ్యాపారాలు లేకపోతే జీఎస్టీ ఆదాయం రాదు. డబ్బులు లేకపోతే ప్రభుత్వాలు సరిగ్గా నడవవు. ఆ భారం ఉద్యోగులు మోయాలి. కరోనా వల్ల దెబ్బతినే ప్రధాన రంగం మీడియా. అసలే అంతంత మాత్రంగా ఉన్న మీడియాకి యాడ్ రెవెన్యూ తగ్గిపోతుంది. అరకొర జీతాలకి బదులు పూర్తిగా ఇవ్వడం మానేస్తారు.
బెంగళూరులో పనులు దొరక్క కొన్ని వేల మంది రాయలసీమ వలస కూలీలు తిరిగి పల్లెలు చేరుకుంటున్నారు. కరోనా ప్రభావం ఇంకొద్ది రోజులు కొనసాగినా.. హైదరాబాద్‌లో ఉన్న వేలాది మంది ఒరిస్సా, యూపీ కార్మికులు ఇళ్లకు వెళ్లిపోతారు. ఈ విధ్వంసం సూక్ష్మంగా జరిగిపోతూ ఉంది.
ఆయుధాలతో అందరినీ వణికించే అమెరికా కూడా కరోనాకి వణికిపోతూ ఉంది. ఎందుకంటే అది సూక్ష్మజీవి. ఎంత పెద్దవాళ్లైనా దానికి లెక్కలేదు. ట్రంప్ కూడా రోజుకి పదిసార్లు చేతులు కడుక్కుని ముఖం దగ్గరికి చేతులు రాకుండా చూసుకుంటూ ఉన్నాడు.
తనంతటి వాడు లేడు అనుకున్నప్పుడు, మనిషికి తానేంటో ప్రకృతి చూపిస్తూ ఉంటుంది. మనం బాగుండాలి, కానీ మనం మాత్రమే బాగుండాలి అంటే ప్రకృతి ఒప్పుకోదు. ఈ భూమి అందరిదీ. మనిషి రాతకోతలు నేర్చుకుని తనది అని రిజిస్టర్ చేయించుకుంటున్నాడు.
గూడు ఎక్కడ కట్టుకోవాలో తెలియక, పిచ్చిదానిలా తిరిగే ఒక పిచ్చుకకి కూడా ఈ భూమ్మీద హక్కుంది. దానికి రియల్ ఎస్టేట్ తెలియకపోవచ్చు. మనం రోడ్ల కోసం చెట్లు నరుకుతున్నప్పుడు.. వేలాది పక్షిపిల్లలు గొంతు ఎండేలా ఏడ్చి, చచ్చిపోయి ఉంటాయి. ఒక చీమని లేదా ఉడతని కూడా దాని బతుకు దాన్ని బతకనివ్వాలి.. లేకపోతే మనల్ని బతకనివ్వని జీవులు భూమ్మీద పుడుతాయి.
*అందుకే, ప్రకృతిని బ్రతుకనివ్వండి,*
*అది మనల్ని బ్రతుకనిస్తుంది.* ?