బయటకొస్తే కఠిన చర్యలు తప్పవు
* ప్రజలను హెచ్చరిస్తున్న ఎమ్మెల్యే, కమిషనర్
* 144 సెక్షన్ అమలులో ఉంది
* నిత్యావసర వస్తువుల హోమ్ డెలివరీ
* మరో పది కూరగాయల విక్రయ కేంద్రాలు
* సంఘటితంగా కరోనా మహమ్మారిని తరిమికొడదాం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు చేసిన లాక్ డౌన్ కు ప్రజలందరు సహకరించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరిషా లు ప్రజలను హెచ్చరించారు. ఎమ్మెల్యే, కమిషనర్ లు బుధవారం నగరాల్లో విస్తృతంగా పర్యటించి కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ దుకాణాలు మూయించారు. రైతు బజార్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడడంతో పోలీసులతో కలసి వారిని చెదరగొట్టారు. గురువారం నుండి ఎస్వీయు స్టేడియంలో కూరగాయలు విక్రయించుకోవాలని సూచించారు. ప్రజలు కూరగాయల కోసం ఒక చోట గుమికూడి ఉండకుండా ఇందిరా మైదానం, హరికృష్ణ మైదానం, డి.బి.ఆర్ రోడ్డు, ఆర్.సి.రోడ్డులో ని తుడా కాంప్లెక్స్ ప్రాంతం తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.