పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించారు.


కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ప్రకటించిన తరువాత హైదరాబాద్ లో వున్న పరిస్థితులను స్వయంగా పర్యటించి తెలుసుకున్నారు.
మొదటగా ప్రగతి భవన్ నుండి బుద్ధభవన్‌కూ వెళ్తుండగా దారిలో రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న కార్మికులను పలుకరించారు. వారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన కార్మికులు. వారు ఉప్పల్ వరకు వెళ్ళడానికి తన సిబ్బందికి చెప్పి వాహనాన్ని ఏర్పాటు చేశారు.
అదేవిధంగా అక్కడే కనిపించిన బీహార్ కు చెందిన ఓ కార్మికుడు, తాను అనాథను అని, తనకు చూసుకోవడానికి ఎవరూ లేరని మంత్రికి చెప్పిన వెంటనే, జీహెచ్ఎంసి నైట్ షెల్టెర్‌లో అతనికి బస ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసి అదనపు కమిషనర్ శంకరయ్యను ఆదేశించారు.
– తరువాత బుద్ధ భవన్‌లో ఉన్న విపత్తు నిర్వహణ కార్యాలయాన్ని సందర్శించారు. హైదరాబాద్ మహానగరంలో డిజాస్టర్ రెస్పాన్స్ టీములు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపైన డైరెక్టర్, ఎన్ ఫోర్స్ మెంట్ & డిజాస్టర్ మెనెజ్మెంట్ విశ్వజీత్ ను అడిగి తెలుసుకున్నారు. అక్కడే కంట్రోల్ రూమ్ లో వున్న సిబ్బందిని వారి రోజువారీ పని గురించి వాకబు చేశారు. మంత్రితో మేయర్ శ్రీ. బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు.
జీహెచ్ఎంసి కేంద్ర కార్యాలయంలో వున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా మంత్రి సందర్శించారు. వివిధ సమస్యలపైన కంట్రోల్ రూంకు వస్తున్న ఫిర్యాదులను. కమీషనర్, జీహెచ్ఎంసి మరియు కలెక్టర్ హైదరాబాద్ లను అడిగి తెలుసుకున్నారు. ఈ సెంటర్ లో వున్న సిబ్బందికి మంత్రి వివిధ సూచనలను చేశారు. వివిధ సమస్యలపైన వచ్చే కాల్స్ ను మానవతా దృక్పథం తో స్పందించాలని సూచించారు.
గోల్నాకలో వున్న జీహెచ్ఎంసి నైట్ షెల్టర్ ను మంత్రి సందర్శించారు. అక్కడ ఉన్నవారికి అందుబాటులో ఉన్న వసతులను అడిగి తెలుసుకున్నారు. నైట్ షెల్టర్ లో వున్న అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులు, మరియు వికలాంగులకు ఆసరా పెన్షన్లు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని ఆదేశించారు.
అక్కడ పక్కనే ఉన్న కాలనీలో పర్యటించి కాలనీలోని ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మరియు ఇంటిలో నుండి ఎవరు బయటకు రావద్దని, ఎవరూ భయపడవద్దని, ప్రభుత్వం అందరికి అండగా ఉంటుందని చెప్పారు.
డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు నిరంతరం చేపడుతున్న క్రిమి సంహరక స్ప్రే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ఎర్రగడ్డలో పర్యవేక్షించారు. మంత్రి వెంట విశ్వజీత్, డైరెక్టర్ ఎన్ ఫోర్స్ మెంట్ & డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నారు

About The Author