అలా అనొద్దు ప్లీజ్.. కరోనా వైరస్‌పై భారత్‌కు చైనా రిక్వెస్ట్..!


న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న నోవెల్ కరోనా వైరస్‌ను ”చైనా వైరస్” అని పిలవొద్దంటూ భారత్‌కు చైనా విజ్ఞప్తి చేసింది. అలా పిలవడం వల్ల చైనా ప్రతిష్టకు భంగం వాటిల్లుందనీ… అంతర్జాతీయ సహకారానికి హానికలిగించే అవకాశం ఉందని అభ్యర్థించింది. ఈ మేరకు మంగళవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ నిన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ”చైనా వైరస్” అనే పదాన్ని ఉపయోగిస్తూ ”సంకుచిత స్వభావాన్ని” చాటుకోవడాన్ని భారత్ ”వ్యతిరేకిస్తుందని” ఆశిస్తున్నట్టు వాంగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.కరోనా వైరస్‌ను ”చైనా వైరస్” అంటూ అమెరికా అధ్యక్షుడు ఇటీవల పదే పదే పేర్కొన్న నేపథ్యంలో చైనా ఈ మేరకు విన్నవించడం గమనార్హం. కొవిడ్-19గా పిలుస్తున్న కరోనా వైరస్ మొదటిసారి డిసెంబర్‌లో సెంట్రల్ చైనా నగరం వుహాన్‌లో బయటపడిన సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజుల తర్వాత చైనా స్పందిస్తూ… ఈ వైరస్ తొలుత సెంట్రల్ చైనాలో కనిపించినప్పటికీ, దాని పుట్టుక అక్కడేనని చెప్పేందుకు ఆధారాలు లేవంటూ చెప్పుకొచ్చింది. అనంతరం చైనా దౌత్యవేత్తలు సైతం దీన్ని ”చైనా వైరస్” అనొద్దంటూ ప్రపంచ వ్యాప్త ప్రచారంతో ఆయా ప్రభుత్వాలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కాగా భారత్‌లో కోవిడ్-19 విజృంభిస్తుండడంపై వాంగ్ యీ తన సానుభూతి, సంఘీభావం వ్యక్తం చేశారు. ”మా అనుభవాలను భారత్‌తో పంచుకునేందుకు, మా సామర్థ్యం మేర సహకారం అందించేందుకు, వైద్య సదుపాయాలు అందించేలా భారత్‌కు దారులు తెరిచేందుకు చైనా సిద్ధంగా ఉంది..” అని వాంగ్ యీ ఈ సందర్భంగా జైశంకర్‌కు స్పష్టం చేశారు. కాగా చైనా పంపిన సంఘీభావ సందేశంపైనా, భారత్‌కు వైద్య పరికరాలకు తోడ్పాటు అందిస్తామని చెప్పడంపైనా జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

About The Author