తెలుగు రాష్ట్రాలలో పది రెడ్ జోన్ జిల్లాలు…


దేశంలో కరోనా కేసులు 4వేలు దాటాయి. రోజుకు వందల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి సారించింది.దేశవ్యాప్తంగా 96 జిల్లాలను రెడ్ జిల్లాలుగా ప్రకటిస్తూ ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పది జిల్లాలున్నాయి.

తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను అత్యధిక కరోనా ప్రభావిత జిల్లాలుగా ప్రకటించింది కేంద్రం. ఇప్పటివరకు రాష్ట్రంలో 334 పాజిటివ్ కేసులు నమోదవగా కేవలం ఒక్క హైదరాబాద్ లోనే సగానికి పైగా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ జిల్లాలో 14 పాజిటివ్ కేసులున్నాయి

అయితే ఈ మూడు జిల్లాల్లో కరోనా ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావాలని సూచించింది.

అటు ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 252 కేసులు నమోదవగా ఇందులో నిజాముద్దీన్ ప్రార్థనలకు ముడిపడి ఉన్న కేసులే ఎక్కువ. అయితే ఏపీలో అధిక సంఖ్యలో కేసులు నమోదైన నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు.. ప్రకాశం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలను రెడ్ జిల్లాలుగా ప్రకటించింది కేంద్రం. అత్యధిక కరోనా ప్రబలించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది కేంద్రం. మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని గుర్తించి వారిని.. వారి కుటుంబసభ్యులను క్వారంటైన్ చేయాలని సూచించింది. లేదంటే కరోనాను కట్టడి చేయటం కష్టమని హెచ్చరించింది. అవసరమైతే లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేసి ఆంక్షలను పొడిగించాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం.

About The Author