మీడియా ఎప్పుడూ గ్రేటే. సేవలోనూ మాకు(మిడియా రంగం) మేమే సాటి.
తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంతో మీడియాని, మీడియా వ్యక్తులపై తక్కువ చేసేలా మాట్లాడే వారికోసమే ఈ పోస్ట్.
భజన చెయ్యడం మీడియా పని కాదు. లోపాలను ఎత్తి చూడపడమే మా పని. సద్విమర్శ చేయడమే పాత్రికేయుని వృత్తి. మా బలమే ఆలోచన. మా ఆయుధమే సరైన సూచన. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా విపత్కర పరిస్థితుల్లో ప్రజా శ్రేయస్సుకై పోరాడడమే మీడియా పని.
ప్రతి విపత్తులోనూ ప్రజలకు అండగా నిలిచింది. నిలిచేదీ మీడియానే. దివి సీమ ఉప్పెన నుంచి, నిన్న మొన్నటి సునామి వరకూ…. ఇప్పటి కరోనా విపత్తు వరకూ ముందుండి పోరాడిన వారిలో మీడియాదే ప్రముఖ స్థానం.
అంతెందుకు కేసీఆర్ తన ప్రెస్ మీట్లలో ఉదహరించే ప్రతి సంఘటనను వెలుగులోకి తెచ్చింది మీడియానే. కేసీఆర్ తాజా ప్రెస్ మీట్ లో చెప్పిన బీడీ లు చుట్టే మహిళ, కష్టకాలంలో ప్రభుత్వం అందించిన బియ్యాన్ని వేరొకరికి ఇవ్వండి అని చెప్పిన మరో మహిళ గొప్ప తనాన్ని వెలుగులోకి తెచ్చింది మా మీడియానే. ముందు ఇవి తెలుసుకోండి. మిడిమిడి జ్ఞానంతో పెద్ద పెద్ద పదాలతో కించపరచొద్దు.
ప్రతి అంశంపై ప్రతి రోజూ ఎంతోకొంత అవగాహన పెంపొందించుకునే ఏకైక వృత్తి మీడియాది.
కరోనా విపత్కర వేళ మీడియా లేకపోతే ఓ సారి ఊహించుకోండి. ఎక్కడ ఏం జరిగినా, క్షణాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ వార్తను ప్రపంచానికి చేర్చాలనే ఒకే ఒక లక్ష్యం తప్పా వేరొకటి మా మదిలో తట్టదు. ఇచ్చిన వార్త టీవీలో వచ్చిందంటే ఏదో తెలియని ఆనందం. అదో తుత్తి అంటూ సంబరపడిపోయే అల్ప సంతోషులం.
లక్షల్లో జీతాలు ఉండవు. ఉద్యోగ భద్రత అసలే ఉండదు. కుటుంబాల్లో ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినా నిత్యం ఏదో సాధించాలన్న తపనతో, హుషారుతో తిరిగే ప్రాణులం. మీడియా వాళ్లం.
తన ఇంట్లో చీకట్లు కమ్ముకున్నా, ఎదుటి వాడికోసం పాటుపడాలనే వారు ఎంతో మంది మా మీడియాలో కనిపిస్తునే ఉంటారు.
ఇంట్లో కూర్చుని ఎన్నైన చెబుతారనే వారిపై జాలి పడడం తప్పా చేసేదేమీ ఉండదు. ఎందుకంటే విపత్కర కాలంలో ప్రజల ఇబ్బందుల్ని అధికారులకు నేరుగా మాట్లాడగలిగే దమ్ము, ధైర్యం, అవకాశం ఉంటే ఏకైక శక్తులం. మేమే మీడియా వాళ్లమే. కరోనా వేళ కూడా ఎంతోమంది నేరుగా విలువైన సూచనల్ని అధికారులకు అందిస్తునే ఉంటాం. అలా వచ్చిన సూచనల ఫలితమే రైతుబజార్ల మార్పు, సోషల్ డిస్టెన్స్ కోసం గీచిన గడులు. రేషన్ షాపుల్లో టోకెన్ల సిస్టం.
కష్టకాలంలో మీడియా చేసే పనేంటో తెలుసుకోండి.
కష్ట కాలంలో నలుగురికి భోజనం పెట్టి ఫొటోలు దిగితేనే సేవగా మీరు భావించొచ్చు. తప్పులేదు. అది చాలా ముఖ్యం. ఉన్నతం. కానీ అంతకుమించి, అందరికి కనిపించని ఎన్నో గొప్ప పనులు చేస్తుంటారు మీడియా వాళ్లు.
మచ్చుకు కొన్ని…. కేన్సర్ వ్యాధితో బాధపడే వారికి లక్షల్లో ఖర్చు అయితే వారికి భరోసా కల్పిస్తూ, తనకుండే వ్యక్తిగత పరిచయాలతో వైద్యాన్ని అందించే ఎంతోమంది మహానుభావులున్నారు మా మీడియాలో.
అర్హతుండీ ఉద్యోగం రాని ఓ డ్రైవర్ కొడుక్కి తెలిసిన పెద్ద మనిషితో సిఫార్సు చేసి వారి కుటుంబాల్లో జీవితాంతం ఆకలినింపిన మహనీయులు ఉన్నారు మా పత్రికారంగంలో.
ఆరుగాలం శ్రమించి గిట్టుబాటు ధర రాక బిక్కబోయిన రైతన్నకు నేనున్నాను అంటూ మేలు చేసే మహోన్నత మిత్రులున్నారు మా మీడియాలో.
వందల వేల కిలోల బియ్యాన్ని సేకరిస్తూ రైస్ బకెట్ ఛాలెంజ్ అంటూ దేశ వ్యాప్త సంచలం సృష్టించింది ఓ మహిళా జర్నలిస్టు అని తెలుసుకోండి.
కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే అవ్వా,తాతల కష్టాలను తమ బాధ్యతగా మార్చుకున్న అన్నలున్నారు మా మీడియాలో.
అంతెందుకు రీల్ లైఫ్ లోనే హీరోలుగా ఉండే ఎంతోమందిని వారి స్థాయికి తగ్గట్టుగా సలహాలు ఇచ్చి రియల్ లైఫ్ హీరోలుగా మార్చేది కూడా మీడియానే.
సినిమా జర్నలిస్టుల్లోనూ అద్భుతాలు ఆవిష్కరించే కవులున్నారు. తమ కలాలతో నిత్యం సాంస్కృతిక, కళా వైభవాన్ని మన కల్లకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాండలికాల్లో చేయి తిరిగిన రాతగాళ్లూ ఉన్నారు. వీరిపై కూడా నీచంగా కామెంట్లు చేసే వారున్నారు. తక్కువగా మాట్లాడే వారూ ఉన్నారు. నిత్యం మీరు టీ షాపుల్లో, బార్బర్ సెలూన్ల దగ్గర ముద్దాడుతూ చదివే రాతలన్నీ వీరి రాసిన రాతలే అని గుర్తెరుగు.
లక్షలాది మంది మదిలో మెదిలే వ్యధలను, ఇబ్బందులను వారి తరపున మా గొంతుకగా వినిపించేవాడే జర్నలిస్టు. అది ముందు తెలుసుకోండి.
తప్పని ఈతి బాధలతో, తమకేం కావాలో తెలియని మధ్య తరగతి గొంతుకై నిలిచేదీ మేమే. అవును మేమే.
దేశ ప్రధాని అయినా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ప్రజా సేవకుడు అని తెలుసుకోండి. మీమీ భజనల్లో మేం భాగం కావాల్సిన పని మాకు లేదు. తప్పును, తప్పుగా… ఒప్పును ఒప్పుగా చెప్పే వారు మీడియాలో అన్ని చోట్లా ఉన్నారు.
నోట్ – పని చేసే సంస్థ ఆదేశాల మేరకు తప్పని సరి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో నచ్చని, పనికి మాలిన వార్తల్లో భాగస్వాములం అవుతాం తప్పదు.
చివరిగా… దమ్ము ధైర్యం ఉంటే మంచి మీడియా సంస్థను పెట్టండి. మీకు ఏ ఐడియాలజీ లేకుండా న్యూట్రల్ న్యూస్ ఛానెల్ ప్రారంభించండి. ఓ ప్రకటన ఇవ్వండి. దుమ్ము దులిపే నిఖార్సైన వార్తల్ని, పని చేసే వారికి మంచి జీతాన్ని, ప్రతి నెలా ఇస్తామని ప్రకటించండి. అది చేయలేకపోతే… సొల్లు మాటలు. పనికిరాని కామెంట్లు పెట్టకండి.
ఎందుకంటే పత్రిక, మీడియా రంగాల్లో చాలామంది గొప్ప వాళ్లు ఉన్నారు. మీకు కనిపించకపోవచ్చు. అంతే.
నమస్కారాలతో….
********************
Written by..
M.nagaraju, Senior journalist, Vishakhapatnam..
********************
యథాతథంగా copy, paste చేశాను. జర్నలిస్ట్స్ ను విమర్శించే వాళ్లకు కొంతైనా కనువిప్పు కలగాలని ఆశిస్తున్నాను.
— kp kumar, senior journalist, atp.
*********************