బాయ్ ఫ్రెండ్ ను కలవాలి పంపించండి..పోలీసులను కోరిన యువతి
కరోనా వ్యాప్తిని నిరోధానికి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. దీంతో పోలీసులంతా భద్రతా చర్యల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్ పోలీసులకు ఓ విచిత్రమైన కేసు వచ్చింది. తనకు బాయ్ ఫ్రెండ్ ను చూడాలని ఉందని, అతని దగ్గరకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ యువతి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.
అంబర్ పేటకు చెందిన ఓ యువకుడు, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నివాసం ఉంటున్న ఓ యువతి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రోజు ఆ యువకుడు, ఆమె దగ్గరకు రావడంతో… చుట్టుపక్కల వారు పట్టుకుని, యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు తమ బిడ్డను యువకుడు వేధిస్తున్నాడంటూ పోలీసు కేసు పెట్టారు. పోలీసులు అతన్ని విచారించారు. అయితే ఆమెపై తనకు ప్రేమ లేదని.. ఆ విషయాన్ని స్పష్టం చేసేందుకే వచ్చానని చెప్పాడు. దీంతో అతన్ని హెచ్చరించిన పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు.
ఆ తర్వాత అతని ప్రియురాలు పోలీసుల దగ్గరకు వచ్చింది. తాను యువకుడిని కలవాల్సిందేనని పట్టుబట్టి కూర్చుంది. తనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, స్టేషన్ లోనే బైఠాయించింది. ఉన్నతాధికారులు… ఆమెకు లాక్ డౌన్ నిబంధనల గురించి వివరించి… సర్దిచెప్పి ఇంటికి పంపించారు.