తెలంగాణలో 12కి చేరిన కరోనా మృతులు…


రేపటి నుంచి కరోనా కేసులు తగ్గే అవకాశం

‘మర్కజ్‌’ లేకపోతే కరోనా రహిత రాష్ట్రంగా ఉండేది

ప్రెస్‌మీట్‌లో మంత్రి ఈటల

హైదరాబాద్‌: తెలంగాణ కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. నిన్న 49 పాజిటివ్‌ కేసులు రాగా.. ఈ రోజు 18 కేసులు నమోదైనట్టు తెలిపారు. ఈ రోజు వచ్చిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 471కి చేరిందన్నారు. వీరిలో 45 మంది డిశ్చార్జి కాగా.. 12 మంది మృతి చెందినట్టు వివరించారు. గురువారం సాయంత్రం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ”రేపు మరో 60 నుంచి 70 మంది డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉంది.మర్కజ్‌ కేసులు లేకపోయి ఉంటే ఇప్పటికే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా ఉండేది. రేపటి నుంచి ఈ కేసులు తగ్గే అవకాశం ఉంది. నిన్న 49 ఉంటే.. ఈ రోజు వచ్చినవి కేవలం 18 మాత్రమే. మొత్తం కేసుల్లో 385 మంది మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారు.. వారిని కలిసిన వ్యక్తులే ఉన్నారు”
”ఈ రోజు 665 నమూనాలను పరీక్షిస్తే కేవలం 18 మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును గౌరవించి ప్రజలందరూ 99శాతం నిజాయతీగా ఆచరించడం వల్లే కేసులు తగ్గాయి. లేకపోతే కొన్నివందల కేసులు పెరిగిపోయేవి. మర్కజ్‌ కేసులు రావడం.. లాక్‌డౌన్‌ పాటించడం రెండూ ఒకేసారి జరగడం వల్ల అధిగమించగలిగాం. చిన్న ఇంట్లో హోం క్వారంటైన్‌లో ఉన్నవారు మాకు చెప్పండి. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించండి. కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ఓపీ నిర్వహిస్తున్నాం”
”గాంధీ ఆస్పత్రిలో కరోనాపాజిటివ్‌ కేసులకు మాత్రమే చికిత్స ఉంటుంది. గాంధీ, చెస్ట్‌, కింగ్‌ కోఠి ఆస్పత్రుల్లో 414 మందికి చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న రోగులంతా ఈ నెల 22 వరకు కోలుకొనే అవకాశం ఉంది. వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సలహాలు, సూచనలు పాటించి ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నాం. ఎక్కడెక్కడ పాజిటివ్‌ కేసులు వచ్చాయో అక్కడ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.” అని ఈటల తెలిపారు.

About The Author