కరోనాపై గెలిచి తీరుతం.. కేసీఆర్
-కొవిడ్‌పై పోరులో దేశమంతా ఏకతాటిపై..
-ప్రధాని అండగా నిలువడంతో మనోధైర్యం
-వైరస్ నియంత్రణలో లాక్‌డౌన్ ఉపయోగకరం
-పీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్
కరోనాపై జరిగే యుద్ధంలో భారతదేశం తప్పక గెలిచి తీరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో దేశమంతా ఏకతాటిపై నిలిచిందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరముందని చెప్పారు. ఈ పోరాటంలో రాష్ర్టాలకు కేంద్రం నుంచి తగిన మద్దతు లభిస్తున్నదని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ శనివారం అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగుగంటలపాటు సాగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనాపై పోరులో కేంద్రం రాష్ర్టాలకు అండగా నిలువడం తమకు మనోధైర్యాన్ని ఇస్తున్నదని చెప్పారు. కరోనాను భారతదేశం ఎంతో గొప్పగా ఎదుర్కొంటున్నదని అంతర్జాతీయ పత్రికలు కూడా మెచ్చుకుంటున్నాయని తెలిపారు. లాక్‌డౌన్‌ను మరో రెండువారాలు పొడిగించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. ప్రధానికి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ సమయంలో అటు రైతులు నష్టపోకుండా, ఇటు నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని, ఇందుకోసం రెండు రంగాలకు ఉపయోగపడే విధంగా ఫుడ్‌ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడిచేలా చూడాలని అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా కోట్ల టన్నుల పంటలు పండాయని, వీటిని సేకరించడం ప్రస్తుతం ప్రభుత్వాల ముందున్న కర్తవ్యమని చెప్పారు. సేకరించిన ధాన్యాన్ని నిల్వచేసేందుకు స్థలం లేదని, అందువల్ల ప్రజలకు మూడు నెలలకు సరిపోయే ఆహారధాన్యాలను ముందుగానే ఇచ్చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. తద్వారా ఎఫ్‌సీఐ గోదాములలో ఉన్న నిల్వలు ఖాళీ అవుతాయని, అప్పుడు కొత్తగా వచ్చే పంటలను వాటిలో నిల్వచేయవచ్చని పేర్కొన్నారు.
ధాన్యం సొమ్ము వచ్చే దాకా ఆగాలి
రైతులు మార్కెట్లో ఒకేసారి జమ కాకుండా ఉండేందుకు తెలంగాణలో గ్రామాల్లోనే 6,849 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని ప్రధానితో సీఎం చెప్పారు. ఒక్క ధాన్యం సేకరణ కోసమే ప్రభుత్వం రూ.25వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చిందని తెలిపారు. గ్రామాల్లోనే పంటలు కొని, రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని, మరోవైపు సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అందిస్తున్నామని చెప్పారు. ఎఫ్‌సీఐ నుంచి తిరిగి డబ్బులు రావడానికి నాలుగైదు నెలల సమయం పడుతున్నదని, అప్పటివరకు బ్యాంకులు బకాయిల చెల్లింపుకోసం ఒత్తిడి తేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
హెలికాప్టర్ మనీతో వెసులుబాటు
1918లో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, 2008 లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అప్పుడు సకాలంలో స్పందించి సరైన చర్యలు తీసుకోవడం వల్ల కోలుకోగలిగామని అన్నారు. ఇప్పుడు వచ్చిన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ఆర్థిక విధానం అవసరమని చెప్పారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాన్ని ఆర్‌బీఐ అనుసరించాలంటూ ‘హెలికాప్టర్ మనీ’ని ప్రవేశపెట్టాలని సూచించారు. దీనివల్ల రాష్ర్టాలకు, నిధులు సమకూర్చే సంస్థలకు వెసులుబాటు లభిస్తుందని, ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడవచ్చని తెలిపారు. జీఎస్డీపీలో 5 శాతం నిధులను క్వాంటిటేటివ్ ఈజింగ్ (క్యూఈ) విధానం ద్వారా విడుదల చేయవచ్చని చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులకోసం, ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడం కోసం ఒక వ్యూహాన్ని ఖరారుచేసి అమలుచేసేందుకు ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని సీఎం సూచించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ఉన్నారు.