విషమంగానే నర్సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి.. వెంటిలేటర్‌పైనే.


కమెడియన్ నర్సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నర్సింగ్ యాదవ్ కోమాలోకి వెళ్లడంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్సనందిస్తున్న సంగతి తెలిసిందే.

అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నర్సింగ్ యాదవ్‌ను హస్పిటల్‌కు తరలించాం. అప్పటి నుంచి ఆయన పరిస్థితి అలానే ఉంది అని భార్య చిత్రాయాదవ్ తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందుతున్నదని అన్నారు.

అయితే తన భర్త అరోగ్యంపై వస్తున్న రూమర్లను నమ్మెద్దు. ఆయన తలకు గాయం కాలేదు.

మధుమేహ వ్యాధితో బాధపడతున్న ఆయన ఊహించని విధంగా కోమాలోకి వెళ్లారు. అంతేగానీ ఆయన కిందపడి తలకు గాయమైనట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అని చిత్ర యాదవ్ మరోసారి స్పష్టం చేశారు.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన పలు చిత్రాల్లోనే కాకుండా ఇతర చిత్రాల్లో కూడా నర్సింగ్ యాదవ్ తనదైన నటనను ప్రదర్శించారు. ఆయన డైలాగ్ డెలీవరికి ఓ ప్రత్యేకత ఉంటుందనేది తెలుగు ప్రేక్షకుల అభిప్రాయం. అనారోగ్య కారణాల వల్ల ఆయన కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆరోగ్య పరిస్థితి క్షీణించి కోమాలోకి వెళ్లడం సినీ పరిశ్రమలోని తన సన్నిహితులను, ప్రేక్షకులను ఆవేదనకు గురిచేస్తున్నది.

స్వర్గీయ విజయనిర్మల దర్శకత్వం వహించిన హేమాహేమీలు చిత్రం ద్వారా చిత్ర సీమలోకి ప్రవేశించిన నర్సింగ్ యాదవ్.. అనతి కాలంలోనే మంచి పేరును సంపాదించుకొన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు వంద చిత్రాల్లో నటించారు. రాంగోపాల్ వర్మ రూపొందించిన క్షణక్షణం, మనీ, మనీ మనీ లాంటి చిత్రాల్లో మంచి ప్రేక్షకాదరణను సంపాదించుకొన్నారు. చిరంజీవి నటించిన టాగోర్, మహేష్ బాబు పోకిరి చిత్రాలు ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి.

About The Author