మానవత్వానికి ప్రతిరూపం హరినారాయణా చార్యులు…


దవళ వస్త్రాలు, గుబురు గడ్డం, రుద్రాక్షలు, నుదిటిపై తిరునామం తో చూడగానే ఋషి పుంగవుణ్ణి తలపించే రూపం… కరోనా లాక్ డౌన్ మొదలైన రోజు నుంచి ఈ రోజు వరకు తనకున్న చిన్న కారులో పట్టినన్ని ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్ లు వేసుకుని తిరుపతికి ఓ మూలన ఉన్న మంగళం ఆర్టీవో కార్యాలయం నుంచి బయలుదేరి కనిపించిన వికలాంగులు, వృద్ధులు, అత్యంత దయనీయంగా ఉండే పేదల దగ్గరికి నేరుగా వెళ్తారు తానెవరో కూడా చెప్పరు… ఆహార పొట్లం, వాటర్ బాటిల్ అందించి… మరో అభాగ్యున్ని తిరుపతిలో వెతుక్కుంటూ వెళ్లిపోవడం ఇది ఈయన దినచర్య … ఈయన వెంట కెమెరామెన్ లు, వీడియో గ్రాఫర్ లు, వందిమాగధులు ఉండరు తాను అనుకున్న కార్యక్రమం నిశ్శబ్దంగా పూర్తి చేస్తుంటారు… *ఆయనే తాళ్లపాక హరినారాయణాచార్యులు*
కరోనా లాక్ డౌన్ ప్రకటించిన మరుసటి రోజు నుంచి ఉదయం 200 మందికి, మధ్యాహ్నం మూడు వందల మంది అభాగ్యులకు తన కుటుంబ సభ్యులతో వండించి, ఆహార పొట్లాలను కట్టించి స్వయంగా అందిస్తున్నారు… శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు హరి నారాయణాచార్యులకు ఈ పనులు కొత్తవి కావు… కొండపై బ్రహ్మోత్సవాల సందర్భంగా పరిశీలనకు వెళ్లిన నేను… తిరుమల మేదర్ మిట్ట ప్రాంతంలో భక్తులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో భోజనం చేస్తుంటే చూసి ఆశ్చర్యపోవడం నా వంతయింది… టిటిడి అందిస్తున్న అన్నదాన క్యాంటిన్ కాదు… ఏదైనా హోటల్ కూడా కాదు… ఎందుకింత జనం ఉన్నారు? ఏమిటి ? ఎవరు చేస్తున్నారు? ఈ కార్యక్రమం అంటే శ్రీవారి భక్తుడు అని సమాధానమిచ్చారు… లోపలికి వెళ్లి చూస్తే అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న తాళ్లపాక హరి కనిపించారు.. ఏమిటి నువ్వు ఇక్కడ అంటే మనమే నిర్వహిస్తున్నది మురళీ! అన్నాడు…2005వ సంవత్సరం ఆగస్టు 8 నుంచి క్రమం తప్పకుండా ఈ పని చేస్తున్నామని సమాధానం చెప్పాడు… అన్నట్టు…. హరినారాయణాచార్యులు నేను చిన్నప్పటి నుంచి కలిసి ఒకే తరగతి గదిలో చదువుకున్నాము… అప్పుడు నాకు తెలియదు హరి ప్రాధాన్యత… హరినారాయణాచార్యులు అన్నమయ్య మునిమనవడు 12వ తరానికి చెందినవారని… హరి వారి అన్నదమ్ములు ప్రతిరోజు తిరుమల వెంకన్న సుప్రభాత సేవలో పాల్గొని నాలుగు అన్నమయ్య గీతాలు పాడిన తర్వాతనే స్వామివారిని మేల్కొలుపుతారు… మధ్యాహ్నం కళ్యాణోత్సవంలో తాళ్లపాక వంశీకుడైన హరి తోనే స్వామివారికి కన్యాదానం చేయించి ఆ తర్వాతనే స్వామివారికి వివాహం జరుగుతుంది… రాత్రి ఏకాంతసేవలో పవళింపు సేవ సంకీర్తనం చేస్తూ ఉంటారు… ఇంత బిజీగా ఉన్నప్పటికీ హరినారాయణ చార్యులు తన సేవా గుణాన్ని విడిచిపెట్టకుండా పేదలకు వితరణ చేస్తుంటే నాకు మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది… హరి నారాయణాచార్యులు అందుబాటులో లేని రోజుల్లో ఆయన కుమారులు రామ్ చరణ్ దత్త, కృష్ణ ధీరజ్ దత్తలు ఈ పనుల్లో భాగస్వాములు అవుతుంటారు పై కార్యక్రమాలే కాదు ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి పిల్లలకు పుస్తకాలు, పలకలు, బలపాలు పంచడం … అన్నమాచార్య వర్ధంతి, జయంతి ఉత్సవాల సందర్భంగాను, తిరుమల బ్రహ్మోత్సవాలు, రథసప్తమి లాంటి సందర్భాల్లో అన్నమయ్య వంశీకులు అన్నదానం లాంటి కార్యక్రమాలు వందల మందికి సొంతంగా నిర్వహిస్తున్నారని తెలిసి ఆశ్చర్యం కలిగింది. తిరుపతి లోని పలు ప్రాంతాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ క్యాంపు కూడా నిర్వహించారని తెలిసింది…ధనుర్మాస ఉత్సవం సందర్భంగా తిరుపతి అన్నమయ్య సర్కిల్ నుంచి భజన బృందాలతో సంకీర్తనలు పెద్దఎత్తున చేస్తుంటారు… సేవ చేయాలన్న అకుంఠిత దీక్ష ఉంటే దానికి హద్దులు ఉండవు అనేందుకు హరినారాయణ చార్యులు ఒక ఉదాహరణ… సోషల్ మీడియాలో రెండు అరటిపండ్లు ఇస్తూ ‘బాన కడుపులు’ వేసుకుని ఫోటోలు పెట్టిన వారి ఘటన గుర్తొచ్చింది… ప్రచారంలో లేని ఇలాంటి ప్రభావశీలురు… ఎందరున్నారో?! అని అనిపించింది హరినారాయణాచార్యులను చూసి…. నా బాల్య స్నేహితుడు తాళ్ళపాక అన్నమాచార్యులు ముని మనవడు ‘హరి’ ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ….. *కందారపు మురళి, సిఐటియు ప్రధాన కార్యదర్శి సిఐటియు తిరుపతి*

About The Author