నిఖిల్‌ పెళ్ళికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలు…


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ కుమారుడు నిఖిల్‌ పెళ్ళికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. విచిత్రమేమిటంటే ఈ పెళ్ళికి సంబంధించి నిబంధనల మేరకు అనుమతి తీసుకున్నట్లు బయటపడింది. పకడ్బందీగా అన్ని పర్మిషన్లతోనే పెళ్ళి జరిగింది. పెళ్ళికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగర శివార్లలోని బిదాదిలో ఉన్న కుమారస్వామి ఫామ్‌హౌస్‌లో పెళ్ళికి రామనగర జిల్లా అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే పెళ్ళికి హజరయ్యే వ్యక్తులకు గరిష్ఠ పరిమితి విధించలేదు. 70 మంది వరకు బంధుమిత్రులు హాజరవుతారని అధికారులకు పెళ్ళివారు తెలిపారు. బెంగళూరు నుంచి బిదాది 30 కి.మీ దూరంలో ఉంది. దీంతో పెళ్ళి వేదికకు వెళ్ళేందుకు 42 కార్లకు అనుమతి ఇచ్చారు. కారులో ఇద్దరు ప్రయాణించవచ్చని ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయి. అలాగే కార్ల సంఖ్యను చెక్‌ చేసేందుకు నాలుగు చెక్‌పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే పెళ్ళిలో సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా చూసేందుకు ఇద్దరు అధికారులను కూడా నియమించినట్లు కర్ణాటక అధికారులు తెలిపారు.
అన్ని కరెక్ట్‌గా ఉన్నా.. సామాజిక మీడియాలో తిరుగుతున్న వీడియో, ఫోటోలను చూస్తే సామాజిక దూరం పాటించలేదని, మాస్క్‌లు వేసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. మాస్క్‌లు బహిరంగ ప్రదేశాల్లో వేసుకోవాలనేది నిబంధన. ఫామ్‌హౌస్‌ లోపల జరిగే పెళ్ళిలో మాస్క్‌ వేసుకోవాలన్న నిబంధన లేదు. ఇక సామాజిక దూరం.
పెళ్ళి తంతు జరిగిన వేదిక వద్ద సామాజిక దూరం పాటించలేదని అనిపిస్తున్నా… సెళ్ళి తంతు, వధూ వరులకు అక్షింతలు వేయడం వంటి సంప్రదాయాల సమయంలో సామాజిక దూరం పాటించడం కష్టం. మిగిలిన నోట్ల పాటించామని కుమారస్వామి అంటున్నారు. మాస్క్‌లు ధరించలేదని, సామాజిక దూరం పాటించలేదని సామాజిక మీడియాలో వస్తున్న ప్రశ్నలకు పెళ్ళివారు చెప్పే సమాధానం పెళ్ళికి అనుమతి ఇచ్చాక… పెళ్ళి తంతుపై ఆంక్షలెందుకు? సామాజిక దూరం పాటిస్తూ అక్షింతలు వేయాలంటే ఎలా?అని…
ఇక అధికారులు చెప్పే సమాధానం … పెళ్ళిలపై నిషేధం లేదు కదా? అయినా మాస్క్‌ల మాదిరి సామాజిక దూరం కూడా బహిరంగ ప్రాంతాల్లోనే కాని… ఇళ్ళలో కాదు కదా?
సో… ఆంక్షలు అమలు చేశారా లేదా అన్నది అధికారులు ఇచ్చే నివేదికను బట్టి ఉంటుంది.

About The Author