వ్యాక్సిన్ వస్తేనే ప్రపంచ మనుగడ.. లేదంటే భవిష్యత్తు భయానకమే..
భూమండలం మొత్తం కరోనా వైరస్‌తో వణికిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. అందులో 1,30,000 మందికిపైగా మృతిచెందారు. ప్రాణాంతక వైరస్‌ను కట్టడిచేయడానికి ఇప్పటికే అన్ని దేశాలు లాక్‌డౌన్ పాటిస్తుండడంతో భూమ్మీద సగం జనాభా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రవాణా, వాణిజ్య, పారిశ్రామిక రంగాలతో పాటు ఎన్నో ఉపాధి రంగాలు మూతబడ్డాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులు పోయి సాధారణ జనజీవనం కొనసాగాలంటే కొవిడ్ 19కు వ్యాక్సిన్ కనుగొనడం ఒకటే మార్గమని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితిలో భాగస్వామ్యమైన సుమారు 50 అఫ్రికా దేశాలతో ఆంటోనియో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను నివారించాలంటే సరైన మందు కనుగొనడం ఒకటే మార్గమని చెప్పారు. దాని వల్ల లక్షల మంది జీవితాలతో పాటు లక్షల కోట్ల డబ్బును ఆదా చేయొచ్చని చెప్పారు. ‘కొవిడ్ 19కు సరైన వ్యాక్సిన్ కనుగొంటేనే ప్రపంచం తిరిగి కోలుకునే అవకాశం ఉంది’ అని అన్నారు. ఈ మందును త్వరగా కనుగొనాలని, అది విశ్వవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. 2020 చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ను కనుగొనాలని ఆశాభావం వ్యక్తంచేశారు.