క్వారంటైన్ లో ఉండకపోతే .. జైలు, 5కోట్ల 56 లక్షలు ఫైన్…
కరోనా వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ అంటే మనవాళ్ళకెందుకో మహా చిరాకు. ఎంత వద్దన్నా ఎలాగోలా బైటికి వచ్చేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. అదే కెనడాలో అయితే లాక్ డౌన్ సంగతి ఎలా వున్నా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సిన వాళ్ళు బయట కనబడితే మన కరెన్సీలో చెప్పాలంటే మూడు కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల 56 లక్షల వరకు ఫైన్ విధించడంతో పాటు మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తారు. కరోనా నియంత్రణలో కెనడా ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చి 25 నుంచి అమలులోకి తెచ్చింది. విదేశాల నుంచి వచ్చిన ఎవరైనా సరే రెండు వారాలు బయట కనిపిస్తే ఈ ఫైన్, జైలు రెండూ ఖాయం. విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్ళల్లో వుంటున్నారా లేదా అని చూసేందుకు కెనడా పబ్లిక్ ఏజెన్సీ, పోలీస్ శాఖకు ఆ వివరాలు అందచేస్తుంది. పోలీసులు ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆ ఇల్లు చెక్ చేసి వాళ్ళు లోపల ఉన్నారా లేదా అని పరిశీలిస్తారు. ఒకవేళ ఇంట్లో లేకపోతే రెండో ప్రత్యామ్నాయం లేకుండా వారు ఎక్కడ వున్నారో పట్టుకుని అటునుంచి అటే నేరుగా జైలుకి తీసుకెళతారు. ఈ చట్టం గురించి విమానాశ్రయంలోనే ముందుగా చెప్పి కాగితం మీద అంగీకారపత్రం తీసుకునిగానీ వదిలిపెట్టరు.