88 మంది మెడికల్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా బాబా సాహెబ్‌ అంబెద్కర్‌ ఆసుపత్రిలో పని చేసే వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు సహా 39 మందికి కరోనా వైరస్‌కు సంబంధించి లక్షణాలు ఉన్నట్ల అనుమానం రావటంతో క్వారంటైన్‌కు తరలించారు. ఇక వారికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 30 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ ఆసుప‌త్రిలో వైద్యులు, మెడికల్‌ సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 58 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో స‌ద‌రు ఆసుప‌త్రిని తాత్కాలికంగా మూసివేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. (872కు చేరిన కరోనా మృతుల సంఖ్య)

ఇక రెండు ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలిన మెడికల్‌ సిబ్బంది సంఖ్య 88కి చేరింది. అదే విధంగా ఏప్రిల్‌ రెండోవారంలో ఇద్దరు వ్యక్తులకు గుండె సంబంధిత చికిత్స అందించిన అనంతరం మాక్స్‌ ఆసుపత్రికి చెందిన 39 మంది మెడికల్‌ సిబ్బందితో పాటు డాక్టర్లు, నర్స్‌లు కూడా స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. కార్డియో-న్యూరో సమస్యతో వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకటంతో ఏయిమ్స్‌ ఆసుపత్రిలోని కార్డియో-న్యూరో సెంటర్‌కి చెందిన 30 మంది ఆరోగ్య కార్యకర్తలు స్వీయ నిర్భందంలోకి వెళ్లారు

భారత్‌లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 27,892కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా మృతి చెందినవారి సంఖ్య 872కు చేరిందని ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. దేశంలో యాక్టివ్‌ కరోనా కేసులు 20,835 కాగా, 6,185 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు.

About The Author