ములుగు జిల్లాలోకి కరోనా వైరస్ రాకుండా సమ్మక్క-సారలమ్మ ప్రార్థన…


ములుగు జిల్లాలోకి కరోనా వైరస్ రాకుండా సమ్మక్క-సారలమ్మ తల్లులే చూడాలని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లాలో కరోనా వైరస్ కట్టడి, వలస కార్మికులకు ప్రభుత్వ సాయం, ధాన్యం కొనుగోళ్లపై నేడు ములుగు కలెక్టర్ కార్యాలయంలో ఆమె సమీక్షించారు.
ములుగు జిల్లాలో ఇప్పటి వరకు రెండు పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయని, వీరు కూడా పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. డిశ్చార్జి అయిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పరీక్షలు చేయగా నెగెటివ్ ఫలితాలు వచ్చినందున, ప్రస్తుతానికి ములుగు జిల్లాలో కేసులు లేవని, ఇది చాలా సంతోషకరమని, ఇలాగే ఉండేలా ఆ సమ్మక్క-సారలమ్మ తల్లులు చూడాలన్నారు.

కరోనా కట్టడి విషయంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల చాలా మంది వలస కూలీలకు ఉపాధి ఇబ్బంది అవుతుందని, వీరందరిని ఒక షెల్టర్ లో పెట్టి భోజన, వసతులు కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపుననుసరించి ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా పస్తులు ఉండొద్దని , వారికి రేషన్ బియ్యం, నిత్యావసరాలు, డబ్బులు పంపిణీ చేశామన్నారు.
లాక్ డౌన్ వల్ల రైతుల పంట కొనుగోళ్లలో కూడా ఇబ్బందులు రావడద్దని ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టి అక్కడే పంట తీసుకుంటున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రైతులకు గోనె సంచుల సమస్య లేకుండా వారే గోనె సంచి తెచ్చుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కట్టిస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో రైతు బాగుండాలని కోరుకునే సిఎం కేసిఆర్ గారు రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినందున రైతులు ఎక్కడా ఇబ్బంది పడవద్దని కోరారు. దీనికి ముందు ములుగు, పల్సల్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సీతక్క, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

About The Author