నిన్నటి వరకూ బిర్యానీ పంచిన చేతులు – నేడు కరోనా తో మృతి
గుంటూరు ఎప్పుడైనా వెళ్లారా? నాన్ వెజ్ ప్రియులైతే అక్కడ ఉన్న ఒక ప్రముఖ హోటల్ కు వెళ్లి ఉంటారు. ఇప్పుడు ఆ హోటల్ యజమాని లేరు. నిన్న చనిపోయారు. కారణం తెలిస్తే షాక్ తింటారు. ఆయన కరోనా కారణంగా చనిపోయారని నేడు ప్రభుత్వం ప్రకటించింది.
ఆయన ఢిల్లీ మర్కజ్ మీటింగ్ కు వెళ్లలేదు. అందువల్ల ఆయనపై ఎవరికి అనుమానం రాలేదు. కొద్ది రోజుల కిందట ఆయనకు జ్వరం వచ్చింది. మునిసిపాలిటీ మలేరియా డిపార్ట్ మెంట్ లో పని చేసే తన స్నేహితుడికి విషయం చెప్పాడు. అతను టెంపరేచర్ చూసి మందులు ఇచ్చాడు. జ్వరం తగ్గలేదు.
అతను అక్కడ నుంచి మంగళగిరి రోడ్డులో ఉన్న ఫీవర్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ చికిత్స చేసి పంపించారు.
తర్వాత ఒక ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వారికి అనుమానం వచ్చిందో ఏమో కానీ గుంటూరు జనరల్ ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు.
గుంటూరు జనరల్ ఆసుపత్రిలో సాధారణ పేషంట్ గా అతడిని చేర్చుకున్నారు. చికిత్స అందించారు. తర్వాత అనుమానం వచ్చి ఐసోలేషన్ వార్డులో చేర్చారు. అయితే విధి వక్రీకరించింది. మరణించాడు. మరణించిన తర్వాత తెలిసింది అతడికి వచ్చింది కరోనా అని. ఇప్పుడు ఏం చేయాలి?
ఆసుపత్రిలో చేరే వరకూ బిర్యానీ ప్యాకెట్లు ఎంతో మందికి పంపించాడు. ఇందులో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులు మొత్తం 11 మందిని ఇప్పటికే క్వారంటైన్ కు పంపారు. అతను నివాసం ఉండే శ్రీనివాసరావుపేట లో ఇప్పుడు ప్రజలు భయంతో ఉన్నారు.
అతను తిరిగిన అన్ని ఆసుపత్రులలోని వైద్యులకు, పేషంట్లకు ఇప్పుడు భయంగా ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎంత మందిని ట్రాక్ చేయాలి? ఎంత మందిని క్వారంటైన్ కు తరలించాలి? అతను ఏ రాజకీయ పార్టీలో లేడు. తన వ్యాపారం తప్ప మరొక అంశం జోలికి వెళ్లడు.
అయినా కరోనా వచ్చింది. ఢిల్లీ లోని మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో అతను సన్నిహితంగా ఉన్నాడేమో తెలియదు. అతను చాలా మంది స్నేహితులతో పేకాట ఆడేవాడు. ఇప్పుడు వారంతా భయపడుతున్నారు. మొదటి సారి ఆసుప్రతికి వెళ్లి వచ్చిన తర్వాత జ్వరం తగ్గిందని దాంతో అతను తదుపరి చికిత్స చేయించుకోవడానికి వెళ్లలేదని అంటున్నారు. అంతే కాకుండా లాక్ డౌన్ ఉన్నా ఇంటిపట్టున ఉండలేదు. ఎంతో మందితో కలిశాడు. వారంతా ఇప్పుడు భయం గుప్పిటిలో ఉన్నారు. గుంటూరు లో కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో జరిగిన విస్ఫోటనం ఇది.