కర్నూలు జిల్లా లో కేసులను ప్రభుత్వం దాచిపెడుతోంది…? మాజి మంత్రి భూమా అఖిల ప్రియ ఆరోపణ…
కరోనా కేసులకు సంబంధించి కర్నూలు జిల్లాలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుంది. వాస్తవాలు చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 332 కరోనా కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మరణాలు కూడా తొమ్మిది సంభవించాయి. నిన్న ఒక్కరోజే 40 కేసులు వచ్చాయని ప్రకటించారు. కానీ మా లెక్కల ప్రకారం వందకు పైగా కేసులు ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం ఈ విషయంలో వాస్తవాలు వెల్లడించకపోతే పెను ముప్పు తప్పదు. ప్రభుత్వం నిజం చెప్పకపోతే ఆ బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. వాస్తవాలు వెల్లడిస్తే ప్రభుత్వం బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. తప్పుడు లెక్కలతో ఎందుకు మోసం చేస్తున్నారు? వాస్తవాలు చెబితే ప్రజలు కరోనా వ్యాప్తి చెందకుండా సహకరిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలు వచ్చి బస చేసి కరోనా కేసుల సంఖ్య తగ్గించాలి. గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం లోనే ఉండి పరిస్థితిని చక్కదిద్ది ప్రజలకు అండగా నిలిచారు. అదే స్ఫూర్తితో సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో బస చేసి చక్కదిద్దాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యే లకు బాధ్యత లేదు. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారు. వీరికి పాలనపట్ల చిత్తశుద్ధి లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ముఖ్యమంత్రి మాటలు వింటే అంతా గందరగోళంగా ఉంది. ఏ మాత్రం స్పష్టత లేని మాటలు. కరోనాతో కలిపి ప్రయాణం చేస్తామంటూ పత్రిక ముఖంగా చెప్పడం ఎలాంటి సందేశం చేస్తున్నారో అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా లేరనే చెప్పవచ్చు. తన మాట తనకే అర్థం కాదు. సమస్య పట్ల అవగాహన లేదు. కనీసం ప్రభుత్వంలో అధికారులకు కూడా అర్థం కాని విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందడానికి ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలే. కర్నూలు కేసుల విషయంలో వాస్తవాలు వెల్లడించకపోతే తామే ఆ బాధ్యత తీసుకుంటాము.
#IndiaFightsCorona
#StayHomeSaveLives