తారా చౌదరిపై క్రిమినల్ కేసు.
నటి తారా చౌదరి మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రకాశం జిల్లా పామూరు ఎస్సైపై సంచలన ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎస్సైను దుర్భాషలాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ పెట్టినందుకు తారా చౌదరితో పాటూ.. ఆమె భర్త రాజ్‌కుమార్‌లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వ్యవహారంపై పామూరు సీఐ ఏఎస్ రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు. పామూరులో ఉంటున్న తారా చౌదరి.. స్థానిక ఎస్పై చంద్రశేఖర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. లాక్డౌన్ సమయంలో అకారణంగా తన భర్తను కొట్టి.. అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. తన కుమారుడు మెడిసిన్, నిత్యావసరాలు తెచ్చేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త రాజ్‌కుమార్‌ను ఎస్సై కొట్టారని.. నాటుసారా తాగాడని, రవాణా చేస్తున్నాడని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన భర్తకు బ్రీత్ ఎనలైజ్ టెస్టులు చేయాలన్నారు. ఎస్సై చంద్రశేఖర్ కావాలనే తన భర్తను టార్గెట్ చేశారని.. 20 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ అయ్యారని.. ఆయన పామూరులో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు తారా చౌదరి. తాను లాక్డౌన్ సమయంలో ప్రజల సమస్యల్ని ఎస్సైకు వివరించామని.. ఆ కోపంతోనే తన భర్తను టార్గెట్ చేశారని తారా చౌదరి ఆరోపించారు. తన భర్త ఒంటిపై గాయాలను మీడియాకు చూయించారు. అయితే ఆమె చేసిన ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు చెబుతున్నారు.