అమెరికాలో ఉంటే బతికేవాడిని కాదేమో.. గాంధీలో సేవలు అనిర్వచనీయం..


కరోనాను జయించిన వృద్ధుడి మనోగతం కూతురిని చూసేందుకు అమెరికా వెళ్లొచ్చిన వృద్ధ దంపతుల్లో భర్తకు కరోనా సోకినప్పటికీ కోలుకున్నారు. 70 ఏండ్ల వయస్సులో మహమ్మారి బారినుంచి బయటపడటం, ప్రభు త్వం చేపట్టిన చర్యల ఫలితమేనని ప్రశంసించారు. గాంధీ దవాఖానలో సేవలను కొనియాడిన ఆయన, తెలంగాణ ప్రభుత్వం తనకు పునర్జన్మనిచ్చిందని కితాబిచ్చారు. అమెరికాలో వైరస్‌ విజృంభణను, హైదరాబాద్‌లో చికిత్సను ప్రత్యక్షంగా చూసిన ఆయన తన మనోగతాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకొన్నారు. ‘గత ఏడాది చివరలో అమెరికాకు వెళ్లాం. అక్కడ క్రమంగా కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువైంది. అసలే దేశంకాని దేశం. కాలు బయటపెట్టలేని పరిస్థితి. అతికష్టంగా మూడునెలలు గడిపాం. ఇక ఒక్కక్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. చావైనా,బతుకైనా మా దేశంలోనే అనుకున్నాం. మార్చి 13న హైదరాబాద్‌కు చేరుకున్నాం. వారం తర్వాత జ్వరం రావడంతో 104కు ఫోన్‌చేయగా వైద్యసిబ్బంది వచ్చి పరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అంతకుముందు అమెరికాలో కరోనా బారినపడ్డ వృద్ధుల మరణాలను గమనించిన నేను, విపరీతమైన ఆందోళనకు గురయ్యా. అలాంటి విపత్కర పరిస్థితిని తట్టుకొనే సత్తా రాష్ర్టానికి ఉందా అనే సందేహం చుట్టుముట్టింది. లేకపోతే మరణం తప్పదనే ఆలోచనలతోనే కుంగిపోయా. ఆ ఆలోచనల మధ్య గాంధీ దవాఖానలోకి అడుగుపెట్టా. అక్కడ నా ఊహకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. చికిత్స పొందుతున్న బాధితుల్లో ఏ ఒక్కరిలోనూ దిగులు కనిపించలేదు. కరోనాను జయిస్తామనే నమ్మకం వారి కండ్లలో కొట్టొచ్చినట్టు కనిపించటంతో ఆశ్చర్యానికి గురయ్యా. రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న చికిత్సావిధానమే దీనికి కారణమని తర్వాత అర్థమయ్యింది. అప్పుడే నాకు సైతం బతుకుతాననే విశ్వాసం కలిగింది. మానసికంగా బలంగా ఉండేందుకు ఇచ్చిన కౌన్సెలింగ్‌ చాలా ఉపయోగపడింది. ఒక్కోసారి తినేందుకు ఇంట్లో సైతం అన్నీ వేళకు సమకూరవు. కానీ గాంధీలో అల్పాహారం, భోజనం, స్నాక్స్‌ ఒక్కక్షణం ఆలస్యం కాకుండా రోగులకు అందిస్తున్నారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది సేవలను ఎంతపొగిడినా తక్కువే. నిద్రాహారాలు లేకుండా శ్రమిస్తున్నారు. ఎట్టకేలకు కరోనాను జయించి ఈ నెల 22న డిశ్చార్జి అయ్యాను. 70 ఏండ్ల వయసులోనూ కరోనా మహమ్మారి నుంచి బయటపడేసిన తెలంగాణ ప్రభుత్వం నాకు పునర్జన్మనిచ్చింది’అని ఆయన వివరించారు.

About The Author