ఎయిర్ ఫోర్స్ అపూర్వ గౌరవం.. కోవిడ్ ఆస్పత్రులపై పూల వర్షం
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19పై యుద్ధం చేస్తున్న యోధులు వారు. రోగులకు చికిత్స చేస్తూ.. వారి ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డేస్తున్నారు. నిరంతర పోరాటంలో 24 గంటలు పనిచేస్తున్న వారికి ఘనంగా వందన సమర్పణ చేస్తోంది యావత్ భారతం. వైద్య సిబ్బందికి ఎయిర్ఫోర్స్ ఇస్తున్న అపూర్వ గౌరవం ఇది. దేశ వ్యాప్తంగా కరోనా ఆస్పత్రులపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ పూలవర్షం కురిపించింది. విశాఖలో చెస్ట్, గీతం ఆస్పత్రి, హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ బలగాల సంయుక్త విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బందికి సంఘీభావంగా సముద్రతీరాల్లో నౌకలు నిలిపిన నేవీ తమ కృతజ్ఞతను చాటుకుంది.
*కరోనా వారియర్స్ కు ఆర్మీ సలాం*
ఎదురుగా శత్రువు ఉంటే ప్రాణాలకు తెగించి పోరాడే భారత ఆర్మీ… కనిపించని శత్రువుతో పోరాడుతున్న కరోనా వారియర్స్ కు సలాం చేసింది. కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులపై భారత వాయుసేన ఆర్మీ హెలికాఫ్టర్లు పూల వర్షాన్ని కురిపించాయి.
యుద్ధంలో గెలిచాక వీరుడా నీకు సలాం అని అందించే గౌరవాన్ని ఆర్మీ ఇప్పుడు వైద్యాధికారులు, సిబ్బందికి అరుదైన గౌరవాన్ని ఇవ్వటంపై వైద్య సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా ఆసుపత్రులపై ఈ కార్యక్రమాన్ని ఆర్మీ నిర్వహిస్తోంది.
కుటుంబ సభ్యులకు దూరంగా, తాము కూడా ప్రాణాంతక వైరస్ బారిన పడే అవకాశం ఉన్నా… వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. అలాంటి వారికి యావత్ భారతావని మేము మీకు అండగా ఉన్నాం అనే నైతిక స్థైర్యం ఇచ్చే ఈ కార్యక్రమంపై వైద్య సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశం మమ్మల్ని గుండెలకత్తుకుంటుంటే… ఇంకెన్నాళ్లైనా కరోనాపై తమ పోరాటం కొనసాగిస్తామని వైద్యసిబ్బంది, శానిటైజేషన్ సిబ్బంది ధీమాగా చెబుతున్నారు.