మనసున్న మారాజు ఈ పోలీసు…
*నిరుపేదలు గా ఉన్న పేదలను ఎంపిక చేసుకుంటారు…వారి కష్టాలను దగ్గరగా పరిశీలించి తెలుసుకుంటారు*… కావలసిన సాయాన్ని ఎవరు అందిస్తున్నారో కూడా తెలియకుండానే వారికి చేరవేస్తారు….ఎవరు సాయం చేశారో తెలియని ఆ నిరుపేదలు ఆ మహానుభావునికి మనస్సు లోనే మొక్కుకుంటారు.
ఒక అరటిపండు, బత్తాయి పండు ను రోగుల కిస్తూ డజను మందికి పైగా ఓ రాజకీయ పార్టీ తరఫున ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడాన్ని నెటిజన్లు తప్పు పట్టడం గమనించే ఉంటారు… లాక్ డౌన్ ప్రకటించిన రోజు నుంచి నేటి వరకూ సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి నిరుపేదలకు, మూగ జంతువులకు ప్రతిరోజు ఆహారాన్ని, నిత్యావసరాలను అందిస్తూ గుప్త దానం చేస్తున్న ఆ వ్యక్తి ఎవరని పరిశోధిస్తే…. చివరకు తేలిందేమంటే ఆ మనసున్న మారాజు ఓ పోలీసని! తిరుపతి క్రైం పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న ఎస్ ఐ “పూల సుధాకర్ బాబు” ఈయనకు పేదలంటే ప్రేమ…. డ్యూటీ అంటే ప్రాణం… 1983 లో కానిస్టేబుల్ గా డ్యూటీ లో చేరింది మొదలు ఉద్యోగానికి ఆలస్యంగా వెళ్లి ఎరగడు… బతికుండగానే జలగల్లా పట్టి పీల్చేసే పోలీసుల్ని చూసిన జనానికి…. సుధాకర్ బాబు లాంటి వారు ఉన్నారంటే ఆశ్చర్యమే మరి! మరో తొమ్మిది నెలల్లో రిటైర్ అవుతున్న సుధాకర్ బాబు ఇన్నేళ్ల సర్వీసులో స్టేషన్ కు వచ్చే వారి దగ్గర ‘టీ’ తాగి ఎరుగడు… అనంతపురం 4వ టౌన్ లో పని చేస్తుండగా ఆ ప్రాంతంలోని నిరుపేద మహిళలకు సరైన బట్టలు లేవని గ్రహించి …. మహిళలందరికీ చీరలు పంచిపెట్టారు… ప్రతి రోజూ నిద్రపోయే సమయానికి ఈరోజు నేను ఎవరికైనా ఉపయోగపడ్డానా? లేదా అని తల్చుకుని పడుకుంటానని సుధాకర్ బాబు అంటారు… మీకు ఎందుకు ఈ లక్షణాలు అలవడ్డాయని ప్రశ్నిస్తే… తనకు చదువు చెప్పిన గంగిరెడ్డి సార్ అంటారు…. విద్యార్థిగా ఉన్నప్పుడు ఏమి రా? పైకి చూస్తే మిద్దెలు, మేడలు కనిపిస్తాయి. కింది చూపుతో ఉంటే చెప్పులు కూడా లేని పేదలు కనిపిస్తారు…. ఎంత స్థాయిలో ఉన్న ఆ చూపు మాత్రం వీడకు…అని ఆయన చెప్పిన సందేశం ప్రతిరోజు తన చెవుల్లో రింగుమంటుందంటారు.
తిరుచానూరు కు చెందిన సుధాకర్ బాబు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు.1974లో తన సోదరికి రెండు నెలల వయసు ఉండగానే తండ్రి పోయాడని… అప్పటి నుంచి తన తల్లి ఐదు మంది సంతానాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిందంటారు… నివాసమున్న పూరిగుడిసెలో వర్షం పడుతుంటే బట్టలు అడ్డుపెట్టి తడవకుండా మా అమ్మ పిల్లల్ని కాపాడుకున్న దృశ్యం కళ్ళముందు కదలాడుతుంటుందని చెబుతారు. తినడానికి తిండి లేక ‘గంజి’ తాగి జీవించామని గుర్తు చేసుకుంటారు… పేదరికాన్ని అనుభవించిన తాను, తన తల్లి పడిన కష్టం మరొకరు పడకూడదనే లక్ష్యంతో… తన శక్తిమేరకు సుధాకరబాబు సాయం చేస్తున్నారు…. తన కుమారుడు, బావమరిది, బంధువులు, స్నేహితుల సహాయం తీసుకొని ఎన్నో ఏళ్లుగా కష్టజీవులకు సాయం చేస్తున్నారు…. లాక్ డౌన్ ప్రకటించిన రోజు నుంచి ఈరోజు వరకు తిరుపతి లోని పలు వీధులు పరిశీలించడం… ఆకలితో ఉన్న వారిని గుర్తించడం… వారి ఆకలి తీర్చడం నిరంతర కార్యక్రమంగా మార్చుకున్నారు…
భక్తులు లేకపోవడం వల్ల తిరుమలకు వెళ్ళే దారిలో కొండముచ్చులు (కోతులు) ఆకలితో అల్లాడుతూ ఉండడాన్ని గుర్తించిన ఈ పోలీసు మనసు తల్లడిల్లింది… కిలోల కొద్ది పండ్లు, ఫలాలను ఘాట్ రోడ్లో కి తీసుకెళ్లి ఆ మూగ జంతువుల ఆకలి తీర్చిన ధన్యజీవి…మన సుధాకర్ బాబు… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు చెప్పవచ్చు… అధికారంలో ఉన్నవారు, అంగబలం, అర్థబలం ఉన్నవారు చేసే సాయం చిన్నదైనా వారు పొందే ప్రచారం అంతా, ఇంతా కాదు… ప్రచారంలో లేని ఇలాంటి ప్రభావశీలురు …. సమాజంలో ఎంతోమంది ఉన్నారు…. సుధాకర్ బాబు ను మనం అభినందిద్దాం…. రిటైర్మెంట్ (9నెలలు) తర్వాత సమాజహితానికి సుధాకర్ బాబు జీవితం మరింతగా తోడ్పడాలని ఆశిద్దాం….
*కందారపు మురళి*
*ప్రధాన కార్యదర్శి*
*సిఐటియు*
*తిరుపతి*