చానల్ లైసెన్స్ నిబంధనలలో మార్పు?


శాటిలైట్ టీవీ చానల్స్, టెలిపోర్ట్స్, వీడియో న్యూస్ ఏజెన్సీస్ లైసెన్స్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ భావిస్తున్నది. అందుకు అనుగుణంగా ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటిమీద మే 15లోగా అభిప్రాయాలు వెల్లడించాలని కోరింది. నిజానికి ఇప్పుడున్న లైసెన్సింగ్ నిబంధనలు దాదాపు పదేళ్ల కిందట రూపొందించినవి కావటంతో మారిన పరిస్థితులను, ఈ మధ్య కాలంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తాజాగా కొన్ని మార్పులు ప్రతిపాదించినట్టు స్పష్టంగా కనబడుతోంది. అయితే, కేంద్ర హోం శాఖకు మరిన్ని అధికారాలు కట్టబెట్టటం ద్వారా ఏ చానల్ లైసెన్స్ నైనా చాలా సులువుగా రద్దు చేసే అవకాశం ఇచ్చింది. ఇది రాజకీయ కక్ష సాధింపులకే ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా అనేక లోపాలను సవరించే ప్రయత్నం చేయకపోవటం కూడా స్పష్జంగా కనబడుతోంది.

నెట్ వర్త్ లో మార్పు లేదు

న్యూస్ చానల్ ప్రారంభించాలంటే రూ. 20 కోట్ల నెట్ వర్త్ ఉండాలనే నిబంధనలో ఎలాంటి మార్పూ లేదు. పదేళ్ళ కిందట ఈ నిబంధన వచ్చింది. అంతకు ముందు రూ. 3 కోట్లు మాత్రమే ఉండేది. ఆ నిబంధన కింద సివిఆర్, తులసి, వి6, ఎబిసి చానల్స్ ఆఖరిసారిగా లైసెన్సులు తీసుకున్నాయి. ఆ తరువాత కాలంలో రూ. 20 కోట్ల నెట్ వర్త్ నిబంధన కింద 10టీవీ, 6టీవీ, 6టీవీ తెలంగాణ మాత్రమే లైసెన్స్ తీసుకున్నాయి. ఎవరైనా రెండో న్యూస్ చానల్ తీసుకుంటే అదనంగా రూ. 5 కోట్లు చూపిస్తే సరిపోతుంది. 6టీవీ కూడా అదే విధంగా రూ. 25 కోట్లు చూపించి రెండు లైసెన్సులు తీసుకుంది. నాన్ న్యూస్ చానల్ అయితే రూ. 5 కోట్ల నెట్ వర్త్ ఉండాలి. ప్రతి అదనపు నాన్ న్యూస్ చానల్ కు 2.5 కోట్ల చొప్పున నెట్ వర్త్ కలుపుకుంటూ పోవాలి.

నిజానికి నాన్-న్యూస్ చానల్స్ లో జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ పెట్టటానికి చాలా ఎక్కువ ఖర్చవుతుంది. అయినాసరే, వాటికి నెట్ వర్త్ తక్కువగానే నిర్ణయించారు. అదే సమయంలో అంశాలవారీ (ఆరోగ్యం, విద్య వగైరా) చానల్స్ కు తక్కువ ఖర్చవుతుంది. అందువలన ఈ విభాగం ఒకటి ఏర్పాటు చేసి తక్కువ నెట్ వర్త్ పెట్టి ఉండాల్సింది. దానివలన ఇలాంటివి మరిన్ని చానల్స్ రావటానికి సానుకూల పరిస్థితి ఏర్పడేది.

అదే విధంగాఈ సారి కూడా న్యూస్, నాన్-న్యూస్ చానల్స్ నిర్వచనాన్ని నిర్దిష్టంగా చెప్పటంలో మంత్రిత్వశాఖ విఫలమైంది. నాన్-న్యూస్ చానల్ కనీసం ఒక నిమిషం కూడా వార్తలు ప్రసారం చేయకూడదని, న్యూస్ చానల్ మాత్రం నూటికి నూరుశాతం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ప్రసారం చేసుకున్నా అభ్యంతరం లేదని చెబుతూ వస్తోంది. దీనివలన అనేక ఎంటర్టైన్మెంట్ చానల్స్ కూడా న్యూస్ చానల్స్ విభాగం కిందికి వచ్చాయి. ఉదాహరణకు జెమినీ మ్యూజిక్ అనే చానల్ కు న్యూస్ చానల్ లైసెన్స్ ఉంది. అందువలన ప్రభుత్వం దగ్గర ఉన్న న్యూస్ చానల్ లెక్కకూ, వాస్తవంగా ఉన్న న్యూస్ చానల్ లెక్కకూ ఎక్కడా పొంతనలేదు.

లైసెన్సుల లీజు మీద నిఘా ఏదీ ?

నెట్ వర్త్ నిబంధన ఒక్కసారిగా భారంగా మారిపోవటంతో గడిచిన పదేళ్ళ కాలంలో లైసెన్సులు లీజుకు తీసుకోవటం బాగా పెరిగిపోయింది. నేరుగా లీజుకివ్వటాన్ని నిషేధించినా అడ్దదారుల్లో అవకాశం ఉండనే ఉంది. ఒక చానల్ లో టైమ్ స్లాట్ కొనుక్కోవటం వ్యాపారంలో భాగం కాబట్టి లీజుకు బదులుగా రోజుకు 23 గంటల 55 నిమిషాల చొప్పున టైమ్ స్లాట్ కొనుక్కున్నట్టు ఒప్పందం చేసుకుంటున్నారు. ఇంకోవైపు లైసెన్స్ తీసుకున్నవాళ్ళు కచ్చితంగా చానల్ నడిపితీరాలన్న నిబంధన పెట్టి, ఏడాది లోగా చానల్ నడపకపోతే జప్తు చేసేలా ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ తీసుకుంటున్నది. అందువలన లైసెన్సును ఖాళీగా ఉంచకుండా, కాపాడుకోవటానికైనా ఎవరో ఒకరికి లీజు కివ్వాలని చానల్ యజమానులు భావిస్తున్నారు. ఈ ధోరణి కూడా లీజు వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది.

అయితే, ఈసారి కూడా లైసెన్సుల లీజు వ్యాపారం మీద నిఘా పెంచటంలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ విఫలమైంది. సాధారణంగా లీజుకు తీసుకునేవారు తెర మీద తమ లోగో ప్రదర్శించాలని కోరుకుంటారు. అందువలన లైసెన్స్ యజమాని చేత లోగో మార్పిడికి దరఖాస్తు చేయిస్తారు. అది తమ బ్రాండ్ గా ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయించినప్పటికీ నిరభ్యంతర పత్రం ఇవ్వటం ద్వారా లోగో మార్పుకు వీలు కల్పిస్తారు. దీన్ని అడ్డుకోవటానికి ఇప్పటి నిబంధనలలో ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు. లైసెన్స్ దారుని పేరు మీదనే ట్రేడ్ మార్క్ ఉండాలన్న నిబంధన విధించటంలో విఫలమైంది. నిరభ్యంతర పత్రం ఉంటే మార్పుకోసం దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పింది. దీనివలన లీజు వ్యాపారాన్ని మరింతగా ప్రోత్సహించినట్టవుతున్నది.

కొన్ని చానల్స్ తాము లైసెన్స్ పొందిన పేరు కాకుండా మరో పేరు ప్రదర్శించటం కూడా తమ దృష్టికి వచ్చినట్టు ఈ ముసాయిదా మార్గదర్శకాలలో మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇది రకరకాలుగా జరుగుతోంది. ఉదాహరణకు టిటిడి వారు ముందుగా ప్రారంభించిన చానల్ పేరు లైసెన్స్ పరంగా శ్రీవెంకటేశ్వర. కానీ లోగో మాత్రం శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ అని, సంక్షిప్తంగా ఎస్వీబిసి అని ఉంటుంది. టీవీ9 గ్రూప్ తన సంస్కృతి చానల్ ను టీవీ1 గా మార్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని రాజకీయ కారణాల వల్ల దాన్ని జై తెలంగాణ గా చెప్పుకోవటం కోసం టీవీ1, జై తెలంగాణ పేర్లను మార్చి మార్చి చూపింది. కానీ మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో మాత్రం టీవీ1 గానే కొనసాగింది.

మరికొంతమంది లీజు దారులు అసలు ట్రేద్ మార్క్ సరిగా కనబడకుండా కింద ఎక్కడో వాటర్ మార్క్ లా వేసి తమ ట్రేడ్ మార్క్ ప్రదర్శిస్తూ రావటం కూడా ఈ మధ్యకాలంలో చూశాం. తులసి లైసెన్స్ తీసుకున్న స్నేహ, సత్కార్ లైసెన్స్ తీసుకున్న పూజ టీవీ, వార్త లైసెన్స్ తీసుకున్న నెంబర్1 న్యూస్, ఆంధ్రప్రభవారి యువర్ న్యూస్ లైసెన్స్ వాడుకున్న భారత్ టుడే అలాగే చేశాయి. మొన్నటివరకు ఎపి 24X7, అంతకు ముందు 6 టీవీ కూడా ఇదే బాటలో నడిచాయి. అయితే, ఈ విషయంలో ఫిర్యాదులు అందుకున్న మంత్రిత్వశాఖ ఈ తాజా మార్గదర్శకాలలో ఆ విషయాన్ని ప్రస్తావించింది. లైసెన్స్ జారీ అయిన పేరు, లోగో తప్ప మరొకటి కనబడకూడదని స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో పేరు మార్పు విషయంలో ఉదారంగా ఉండబోతున్నట్టు పరోక్షంగా చెప్పటం అంటే లీజులను అడ్డుకోబోవటం లేదనే అర్థం చేసుకోవాలి.

నీరుగారిన బ్యాంక్ గ్యారెంటీ నిబంధన

ఎవరైనా లైసెన్స్ తీసుకొని చానల్ నడపకపోతే వాళ్లమీద చర్యలు తీసుకోవటానికి మాత్రం ఏర్పాట్లు చేసింది. నిజానికి పదేళ్ళ క్రితమే ఈ నిబంధన ఉంది. లైసెన్స్ తీసుకున్న ఏడాదిలోగా చానల్ ప్రసారాలు అందుబాటులోకి తీసుకురాలేకపోతే ఆ చానల్ రద్దు చేసేలా నిబంధనలు రూపొందించింది. అందుకు గాను న్యూస్ చానల్ అయితే రూ. 2 కోట్లు, నాన్- న్యూస్ చానల్ అయితే కోటి రూపాయలు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి. చానల్ ప్రారంభం కాకపోతే అ మొత్తాన్ని జప్తు చేస్తారు. ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకోవటం కోసం కొద్దిరోజులు నడిపి మళ్ళీ మూసెయ్యకుండా ఇప్పుడు కొత్త నిబంధన చేర్చారు. 90 రోజులపాటు చానల్ ప్రసారం కాకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని చెబుతున్నారు.

అయితే, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు అలాంటి చానల్ యజమానులు ఇంకో పద్ధతి ఎంచుకున్నారు. అతి తక్కువ బాండ్ విడ్త్ తో చానల్ అప్ లింక్ చేస్తున్నారు. రెండు మూడు గంటల కార్యక్రమాలను ఒక డివిడి లో ఎక్కించి తిప్పి తిప్పి అవే ప్రసారం చేస్తున్నారు. ఎలాగూ ఎమ్మెస్వోలు పనిగట్టుకొని ఉచితంగా డౌన్ లింక్ చేసి ప్రసారం చెయ్యరు కాబట్టి ప్రేక్షకులకు ఆ చానల్ కనబడదు. కనబడినా ఆ మసకబారిన దృశ్యాలు చూడలేం. కానీ సాంకేతికంగా ఆ చానల్ నడుస్తున్నట్టు చెప్పుకునే వీలుంటుంది. ఎవరైనా లీజుకు తీసుకునేవాడు దొరికేదాకా ఇలా నడుపుతూ ఉంటారు. కనీసం ఇంత బాండ్ విడ్త్ లో అప్ లింక్ చేయాలన్న నిబంధన ఉంటే తప్ప ఇలాంటి అడ్దదారులకు అడ్డుకట్ట వేయటం కుదరదు.

మార్గదర్శకాలలో కొత్తదనం ఉందా?

ఈసారి ప్రత్యేకంగా కనిపిస్తున్న విషయమేంటంటే ఇంతకుందు కంపెనీలకు మాత్రమే చానల్ లైసెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు వాటి సరసన ఎల్ ఎల్ పి ( లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్ షిప్ ) కూడా వచ్చి చేరింది. కొత్తగా వచ్చిన డైరెక్టర్ల పూర్తి సమాచారం ఇవ్వాలంటూ గడిచిన పదేళ్ళ కాలంలో సరికొత్త నిబంధనలు విధిస్తూ వచ్చిన మంత్రిత్వశాఖ ఇప్పుడు పూర్తి స్థాయి నిబంధనగా మార్చింది. అదే విధంగా, వాటాలు ఎక్కువగా ఉండి కూడా డైరెక్టర్ పదవి తీసుకోకుండా అనామకుల పేర్లు పెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో 10 శాతం మించి వాటాలున్నవాళ్ళందరి వివరాలూ అడుగుతోంది. కొత్త డైరెక్టర్లను చేర్చుకోవటానికి ముందే ఎమ్ ఐ బి అనుమతి తీసుకొని ఆ తరువాతే చేర్చుకోవాలన్న నిబంధనను సైతం కఠినంగా అమలు చేయబోతోంది.

కొత్త చానల్స్ పెట్టేవాళ్ళు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే హోంశాఖ, ఆర్థికశాఖలో రెవెన్యూ విభాగం పరిశీలించి క్లియరెన్స్ ఇచ్చిన మీదట ఆమోదం తెలియజేస్తామని చెబుతున్న సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అందుకు ఎంత సమయం పడుతుందో మాత్రం చెప్పటం లేదు. ఆరు నెలలనుంచి ఏడాది పట్టే అవకాశం ఉండటం వల్లనే లీజు ఒప్పందాలకు మొగ్గు చూపుతున్నారని గ్రహించకపోవటం దారుణం. 20 కోట్ల నెట్ వర్త్ అడుగుతున్నారు గాని లైసెన్స్ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు మాత్రం ఇరవయ్యేళ్ళుగా పది వేల దగ్గరే ఉండిపోయింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే హోంశాఖ దర్యాప్తు గాని, ఆర్థికశాఖ పరిశీలనగాని అవసరం లేని ఎమ్మెస్వో లైసెన్స్ కు మాత్రం లక్ష రూపాయల ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది.

శిక్షలు, జరిమానాలు

బ్రాడ్ కాస్టర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలుంటాయని కూడా ఈ కొత్త మార్గదర్శకాలలో ప్రభుత్వం స్పష్టం చేసింది. లోగోలో ఏ మాత్రం మార్పు ఉన్నా, ఊరుకునే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పింది. గతంలో కపిల్ సిబల్ సారధ్యంలోని తిరంగా టీవీ ని ఈ విషయంలో ముప్పు తిప్పలు పెట్టటం తెలిసిందే. రెండు లోగోలు వాడటం, నాన్-న్యూస్ చానల్స్ చేసే ప్రత్యక్ష ప్రసారాలకు ముందస్తుగా రిజిస్టర్ చేసుకోకపోవటం లాంటి తప్పిదాలకు నెలనుంచి ఆరు నెలలపాటు చానల్ ప్రసారాలు నిలిపివేస్తామని చెప్పటం గమనార్హం. అయితే ఏది న్యూస్, ఏది న్యూస్ కాదని ఎలా నిర్ణయించేదీ మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఒక మంత్రిగారు ఒక పూజా కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తే అది న్యూస్ అవుతుందా కాదా అనే అనుమానాలకు ఈ అస్పష్టమైన నిబంధన తావిస్తుంది. పది సంవత్సరాలు అమలులో ఉండే లైసెన్సును హోంశాఖ ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. లైసెన్స్ గడువు పూర్తికావటానికి ఆరు నెలలముందే రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

అయితే, హోం మంత్రిత్వశాఖ ఎప్పుడైనా లైసెన్స్ ను ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వటం మాత్రం చాలా తీవ్రమైన అంశం. అదే సమయంలో మూడేళ్ళుగా లైసెన్స్ కోసం ఎదురు చూస్తున్న క్వింటిలియాన్ బిజినెస్ మీడియా ఒకవైపు, కొద్ది నెలల్లోనే లైసెన్స్ తెచ్చుకోగలిగిన రిపబ్లిక్ టీవీ ఉన్నప్పుడు లైసెన్స్ ఎప్పుడు వస్తుందో సూత్రప్రాయంగా కూడా తెలియకపోవటం రాజకీయాల పాత్రను కచ్చితంగా సూచిస్తోంది. ఈ మార్గదర్శకాలలో కూడా దరఖాస్తు ప్రాసెసింగ్ కి ఎంత సమయం పట్టవచ్చునో చెప్పలేదు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, హోం శాఖ, ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం, అంతరిక్ష విభాగం, టెలికమ్యూనికేషన్ల విభాగం ..ఇలా ఒక్కొక్కటీ అనుమతి ఇవ్వటం పూర్తి కావాలి. సింగిల్ విండో క్లియరెన్స్ కు అవకాశమే లేదు. అయినా సరే వ్యాపారం చేసుకోవడాన్ని సులభతరం చేస్తున్నామని చెప్పుకోవటం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకే చెల్లింది.

లైసెన్స్ ఫీజు గాను, లైసెన్స్ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు పెంచకపోవటం మాత్రం సహజంగానే బ్రాడ్ కాస్టర్లను సంతోషపెట్టే విషయాలు. అదే విధంగా నాన్-న్యూస్ చానల్స్ చేసే ప్రత్యక్షప్రసారాలకు అంతకుముందు 15 రోజులముందే దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఇప్పుడు కేవలం ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుందనటం ఒక ఊరట.

ఈ మార్గదర్శకాల మీద అభిప్రాయాలు తెలియజేయాలన్నా, అభ్యంతరాలున్నా సంబంధిత వ్యక్తులు, సంస్థలు ఈ నెల 15 లోగా తెలియజేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కోరుతోంది. అండర్ సెక్రెటరీ, ఎ వింగ్, రూమ్ నెంబర్.625A, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్, శాస్త్రి భవన్, న్యూ ఢిల్లీ -110001 చిరునామాకు లేఖద్వారా గాని usi.inb@nic.in కి మెయిల్ ద్వారాగాని తెలియజేయాలి.

ముసాయిదా మార్గదర్శకాల పూర్తి పాఠం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి:
https://mib.gov.in/sites/default/files/Draft%20Policy%20Guidelines%20%281%29.pdf

– తోట భావనారాయణ, 9959940194

About The Author