తండ్రికి శుభాకాంక్షలు చెప్పిన దిల్‌రాజు కుమార్తె మీరు సంతోషంగా ఉండాలి’


హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 7.23 గంటలకు నిజామాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తేజస్వినితో ఆయన పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘మీరు ఎల్లప్పుడూ నాకు బలంగా ఉన్నారు. నన్ను సంరక్షించినందుకు.. నిరంతరం కుటుంబ సభ్యుల ఆనందానికే ప్రాధాన్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన మీరిద్దరు సంతోషంగా, ప్రేమతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి రోజు మీకు ఓ అద్భుతమైన రోజు కావాలని ఆశిస్తున్నా. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నా.. మీ హన్షు’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. దిల్‌రాజు సతీమణి అనిత 2017లో అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన రెండో వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో దిల్‌రాజుకు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్పారు. DilRaju అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌ టాప్‌లో ఉంది. 2,210 మందికిపైగా ఈ ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు. ఆయన పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

About The Author