మదనపల్లె డిఎస్పీ రవిమనోహరచారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలలో ఆత్మస్థైర్యం…
మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ రామాచర్లపల్లె, మదనపల్లె మున్సిపాలిటీలోని రెడ్డెప్పనాయుడు కాలనీలో కరోన పాజిటివ్ కేసులు నమోదు అయిన నేపథ్యంలో గురువారం మదనపల్లె డిఎస్పీ రవిమనోహరచారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలలో ఆత్మస్థైర్యం, కరోనపై అవగాహన కల్పించేందుకు సబ్ డివిజన్ పోలీసులు ర్యాలీ నిర్వహించారు. టూ టౌన్ పోలీసు స్టేషను నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎస్బీఐ కాలనీ, నీరుగుట్టువారిపల్లి, కదిరి రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, ఇందిరానగర్, అప్పారావు వీధి,సంత బజార్, రాగిమను సర్కిల్, చిత్తూరు బస్టాండు సర్కిల్, బసినికొండ, పుంగనూరు రోడ్డు తదితర ప్రాంతాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ రవిమనోహరచారి మాట్లాడుతూ ప్రజలు ఆత్మస్థైర్యంతో వుండాలని, కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడి పోవడం తగదని ప్రభుత్వం అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతోందని వెల్లడించారు. ప్రజలు లాక్ డౌన్ ఖచ్చితంగా పాటించాలని, పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో కట్టడి ప్రాంతాల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నామని, ఆ ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, కఠిన ఆంక్షలు అమలు చేయడం జరుగుతోందని, వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపి, కరోనా బాధితులకు ప్రైమరీ కాంటాక్టులుగా ఉన్న వారందరినీ క్వారంటైన్‌కు తరలించి, రెడ్డెప్పనాయుడు కాలనీ చుట్టు బారికేడ్లు ఏర్పాటు చేసి బ్లీచింగ్ పౌడర్, రపాయనాలను పిచికారి చేయించడం జరిగిందని వెల్లడించారు. నిత్యావసరాలు, కూరగాయలు, పండ్ల సరఫరాకు వార్డు వాలంటీర్లును అందుబాటులో వున్నారని, కట్టడి ప్రాంతాల్లో ఉన్న కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ర్యాలీలో సిఐలు తమీమ్ అహమ్మద్, రాజేంద్రనాధ్ యాదవ్, శ్రీనివాసులు,అశోక్ కుమార్, ట్రాఫిక్ సిఐ శ్రీనివాసులు చౌదరి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.