నాన్న కోసం డాక్టర్…. ఆత్మ సంతృప్తి కై యాక్టర్…
నేను డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాను… అనే సినీ నటుల గురించి విన్నాం. ఒకవైపు డాక్టర్ గా… మరోవైపు యాక్టర్ గా బహుముఖంగా రెండు రంగాల్లో రాణించిన డాక్టర్ రవీంద్ర గురించి ఈరోజు తెలుసుకుందాం… తిరుమల కొండ మీద పుట్టి, పెరిగిన డాక్టర్ రవీంద్ర తండ్రి టీటీడీ ఆరోగ్య విభాగం లో మేస్త్రి గా పని చేసేవారు.1975-76 ప్రాంతాలలో భక్తిరస నాటకాల శిక్షణ తిరుమలలో చేపట్టేవారు. రవీంద్ర తండ్రి జలదంకి కోటయ్య కూడా నటుడు కావడంతో చూడటానికి రవీంద్ర వెళ్లే వారు. నటులకు కావలసిన ‘టీ’ లు, బీడీ లు అందించేందుకు నాలుగో తరగతి చదివేటప్పటి నుంచే వెళ్లే వాడు. ఆ సమయంలో తిరుమల పాపవినాశం (ప్రస్తుత బస్టాండ్) ప్రాంతంలో టిటిడి వేదిక నిర్మాణం చేసింది.ఈ వేదిక పై నాటకాలు ఆడేవారు. నాటి టిటిడి ఇఓ అన్నారావు తో మాట్లాడి ఈ వేదిక ను కోటయ్య సాధించారు. నాటక దర్శకులు రామకోటేశ్వర్లు… రవీంద్ర ఆసక్తిని గమనించి ఏరా? పాడుతావా? అని అడగడంతో ఓ! పాడుతానని చెప్పి… రామాంజనేయ యుద్ధంలో ఏకబిగిన 60 పద్యాలుపాడేసిన గడుసు పిండం చిన్ననాటి రవీంద్ర. రాగం నేర్పిన మొదటి గురువు రామ కోటేశ్వర్లు గారని అంటారు. రవీంద్ర చిన్నతనంలో స్కూల్ లో (తిరుమలలో) ఏకపాత్రాభినయం, జానపద పాటలు పాడుతూ ప్రత్యేక గుర్తింపు పొందారు. టీచర్లు తనను ఎంతగానో అభిమానించే వారని, కాలేజీ రోజుల్లో (తిరుపతిలో) ఫైన్ ఆర్ట్స్ సెక్రెటరీగా గెలిచి అనేక కార్యక్రమాలు నిర్వహించానని, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలలో సైతం కళారూపాలు ప్రదర్శించానని రవీంద్ర చెబుతారు.1986 లో వామపక్ష ఉద్యమం లోకి ప్రవేశించి ఎర్రజెండా చేతపట్టి, తిరుమలలో సినీ నటుడు మాదాల రంగారావును పిలిపించి హాకర్స్ యూనియన్ ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించానని చెబుతారు. *ప్రజల కోసం ఎర్ర జెండా… భుక్తి కోసం అన్నమాచార్య పాటలు పాడారు*. తండ్రి కోరిక తీర్చడం కోసం ఆయుర్వేదంలో మాస్టర్ డిగ్రీ చేసి 1996 నుంచి 24 ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉన్నారు. నాన్న కోసం వైద్య వృత్తి… తన ఆత్మ సంతృప్తి కొరకు నటనను చేపట్టానని… ఈ రెండు రంగాల్లో విజయవంతమయ్యానని డాక్టర్ జలదంకి రవీంద్ర చెబుతారు. ‘జస్ట్ స్మైల్’ అనే పేరుతో 2001లో నాటకరంగ సంస్థను ప్రారంభించామని… తన పర్యవేక్షణలో 35 మంది నూతన నటీనటులను తయారుచేసినట్టు ఆయన వివరించారు.. 2174 వేదికలపై నాటకాలు ప్రదర్శించి తనకు, తన టీమ్ కు ఒక నంది, రెండు గరుడ, రెండు అశ్వం అవార్డులు సాధించామని, తాను 67 సార్లు ఉత్తమ నటుడిగా, ముప్పై ఎనిమిది సార్లు ఉత్తమ విలన్ గా, 27 సార్లు ఉత్తమ డైరెక్టర్ గా అవార్డులు పొందానని అంటారు. స్వయంగా 46 నాటకాలకు దర్శకత్వం వహించానని వివరించారు. వైద్యునిగా ప్రాణదాత, నటుడిగా కళారత్న, రంగస్థలం నట సింహం, నట చక్రవర్తి, నటరత్న బిరుదులను పొందారు. ఎయిడ్స్, టి.బి రోగులకు ఆత్మవిశ్వాసం పెంచటానికి చేస్తున్న కౌన్సిలింగ్ కారణంగా గుర్తింపు వచ్చిందని రవీంద్ర చెబుతారు. రచయితగా, దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగానే కాకుండా ఇంగ్లీషు, సోషల్ సబ్జెక్ట్ బోధించే ఉపాధ్యాయునిగా కూడా గుర్తింపు పొందారు. *రవీంద్ర డాక్టర్ గా, నటుడిగా తాను సంపాదించుకున్నది ప్రజాభిమానమేనని, డబ్బు సంచులు కాదని వివరిస్తారు. నటన, వైద్య రంగాల్లో ప్రజాభిమానం పొందిన డాక్టర్ రవీంద్ర గారికి అభినందనలు తెలియ జేద్దాం*…
*కందారపు మురళి*
*ప్రధాన కార్యదర్శి*
*సిఐటియు*
*తిరుపతి*