హైదరాబాద్‌లో భారీ వర్షం…కొన్నిచోట్ల భయంకరమైన గాలులు…


హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. కొన్నిచోట్ల భయంకరమైన గాలులు కూడా వీస్తున్నాయి. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, నాంపల్లి, కాచిగూడ, నల్లకుంట, అంబర్ పేట, మెహిదీపట్నం, పంజగుట్ట, టోలిచౌకి, దర్గా, గోల్కొండ, యూసుఫ్ గూడ, ఎర్రగడ్డ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, తార్నాక, కూకట్ పల్లి, మియాపూర్, ఫిల్మ్ నగర్, కొండాపూర్, బోరబండ, కొత్తగూడ, మాసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల ఈదురుగాలులకు ఫ్లెక్సీలు కూలిపడ్డాయి. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే ప్రమాదం ఉంది. ఈ తుపాన్ మే 18 నుంచి మే 20వ తేదీలోపు పశ్చిమ బెంగాల్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు, ఎల్లుండి కూడా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

*ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.*

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశాలోని పారాదీప్‌కు 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సాయంత్రానికి తుపానుగా బలపడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, ఒడిశా తీరం వెంబడి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

About The Author