లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు..


కరోనా లాక్‌డౌన్:
మే 31 వరకు పొడగింపు..
బస్సులకు గ్రీన్ సిగ్నల్, రైళ్లకు నో..
కొత్త గైడ్‌లైన్స్ ఇవే..

కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం కంట్రోల్ లోకి రాకపోవడంతో దేశవ్యాప్త లాక్ డౌన్ ను మరో రెండు వారాలకు పొడిడించారు. అపిడమిక్, జాతీయ విపత్తు చట్టాలను అనుసరించి దేశవ్యాప్తంగా మే 31వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లే గతానికి భిన్నంగా లాక్ డౌన్ 4.0లో చాలా సడలింపులు ప్రకటించారు. కాగా, 4.0 ప్రకటన అనుకున్నదానికంటే ఆలస్యంగా వెలువడటం, హోం శాఖ ప్రకటనకు ముందే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ లీకులు ఇవ్వడం, మరోవైపు పలు రాష్ట్రాలు వేటికవే విడివిడిగా వేర్వేరు తేదీలతో ఆదేశాలు జారీచేయడం గందరగోళానికి దారితీసింది.

తగ్గని తీవ్రత..
కొత్త కేసుల విషయంలో ఆదివారం సరికొత్త రికార్డు నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,987 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం సంఖ్య 92వేలకు చేరింది. మరణాల సంఖ్య 3వేలకు దగ్గరైంది. కొవిడ్ బాధిత దేశాల జాబితాలో ఇప్పటికే చైనాను అధిగమించిన భారత్ తాజాగా పెరూను కూడా దాటేసి, టాప్-10 చోటు కోసం ఇరాన్ తో పోటీపడుతుండటం విషాదకరం. సోమవారం నుంచి అమలులోకి రానున్న లాక్ డౌన్ 4.0కు సంబంధించి కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..

ప్రజా రవాణాకు అనుమతి..
లాక్ డౌన్ 4.0 మార్గదర్శకాల ప్రకారం ఇకపై దేశవ్యాప్తంగా నాన్ కంటైన్మెంట్ జోన్లలో ప్రజా రవాణా వ్యవస్థలు పని చేయనున్నాయి. రాష్ట్ర, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు, సరుకు రవాణాలకు కేంద్రం సడలింపులు కల్పించింది. వ్యక్తిగత వాహనాలకు కూడా అనుమతిస్తారు. అయితే రెడ్ జోన్లు(కంటైన్మెంట్) జోన్లలో మాత్రం ఈ సర్వీసులకు నో చెప్పిన కేంద్రం.. జోన్లలో మార్పు నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. స్థానిక అధికారులే రెడ్ జోన్ల పరిధిని నిర్ధారించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

హోటళ్లు, విమానాలు బంద్..
ప్రజారవాణాకు సంబందించి బస్సులకు మాత్రమే అనుమతిచ్చిన కేంద్రం.. విమాన సర్వీసులకు మాత్రం నో చెప్పింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులపై నిషేధం మే 31 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. రైల్వే శాఖకు సంబంధించి ప్రస్తుతం నడుస్తోన్న శ్రామిక్, స్పెషల్ రైల్లు యధావిధిగా తిరుగుతాయని, కొత్తగా ప్యాసింజర్ సర్వీసులను నడపబోమని, మెట్రో రైళ్లు కూడా తిరగబోవని పేర్కొంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర హాస్పిటాలిటీ సేవలపైనా ఆంక్షలు కొనసాగుతాయి. అయితే రెస్టారెంట్ల హోం డెలివరీలకు మాత్రం అనుమతి మంజూరు చేశారు.

రాత్రి పూట కర్ఫ్యూ.. స్టేడియాలకు అనుమతి..
లాక్ డౌన్ 4.0లో భాగంగా దేశవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ మాత్రం యధావిదిగా కొనసాగనుంది. మే 31 దాకా రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు సెక్షన్ 144 అమలులో ఉంటుందని కేంద్ర హోం శాఖ తెలిపింది. అలాగే, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు, పార్కులు, బహిరంగ సభలు, సెమినార్లు, సామూహిక ప్రార్థనలు, అన్ని మతాల ప్రార్థనాలయాలకు సడలింపులు కల్పించలేదు. ఇవన్నీ మే 31 దాకా మూతపడే ఉంటాయి. అయితే స్పోర్ట్స్ కాంప్లెక్సులు, ప్లే గ్రౌండ్లను మాత్రం తెరుచుకోవచ్చన్న కేంద్రం.. అందులోకి ప్రేక్షకులను అనుమతించబోమని చెప్పడం గమనార్హం.

రాష్ట్రాలకే అధికారం..
గతానికి భిన్నంగా లాక్ డౌన్ 4.0 ఉంటుందన్న ప్రధాని మోదీ ప్రకటన మేరకు కేంద్ర హోం శాఖ తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో కీలక నిర్ణయాలను రాష్ట్రాలకే వదిలేయడం గమనార్హం. గతంలో లాక్ డౌన్ రూల్స్ తోపాటు అవి ఎక్కడెక్కడ అమలు చేయాలో కేంద్రమే చెప్పింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలోని జిల్లాల జాబితాను కూడా కేంద్రమే విడుదల చేసేది. ఈసారి మాత్రం రెడ్ జోన్ల నిర్ధారణ ప్రక్రియను స్థానిక అధికారులే చేపట్టాలని, అందుకోసం కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలను ఫాలో కావాలని హోం శాఖ పేర్కొంది.

About The Author