ఏపీలో ప్రజారవాణా ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్‌డౌన్ కారణంగా గత 58 రోజులుగా బస్సులన్నీ డిపోలకే పరిమితమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో విజయవాడ, విశాఖ సిటీ సర్వీసులు మినహా ‘రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులు గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ బుకింగ్ నిన్న సాయంత్రం నుంచే మొదలైంది. రాష్ట్రంలోని 436 మార్గాల్లో 1,683 బస్సులు (17 శాతం) నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్టీసీకి మొత్తం 12వేల బస్సులు ఉండగా ప్రస్తుతం 1683 బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి దశలవారీగా బస్సుల సంఖ్య పెంచుతామని చెబుతున్నారు. ఉదయం నుంచే ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికుల సందడి నెలకొంది. విశాఖలోని ద్వారకా బస్ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికులు బారులు తీరారు.
ప్రస్తుతానికి బస్టాండ్ల మధ్య మాత్రమే బస్సులు నడుపుతున్నారు. ప్రస్తుతానికి బస్సుల్లో ఎలాంటి రాయితీలు వర్తించడంలేదు. నగదు రహిత విధానంలోనే టికెట్లు జారీ చేస్తున్నారు. ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులను మాత్రమే బస్సులోకి అనుమతిస్తున్నారు. అన్ని బస్టాండ్లలోనూ కరెంట్ బుకింగ్ సదుపాయం కల్పించారు. కౌంటర్‌లో టికెట్ కొనుగోలు చేసేవారి పేరు, ఫోన్ నంబరు నమోదుచేసుకుంటున్నారు. తప్పనిసరిగా మాస్కులు వినియోగించాలని సూచిస్తున్నారు. దూర ప్రాంతానికి రాత్రి సర్వీసుల్లో వెళ్లాలనుకునేవారు సాయంత్రం 7 గంటల్లోపే బస్టాండ్లకు చేరుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సాయంత్రం 7 గంటల తర్వాత కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 65 ఏళ్లు పైబడినవారు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయొద్దని సూచిస్తున్నారు.