ఆరుగాలం.. అగ్గిపాలు…


*శాయంపేట:* వరి కోసిన పంటచేలలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 500 ఎకరాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. పంటచేలలో నిల్వచేసిన సుమారు 900 బస్తాల వడ్లు బూడిదయ్యాయి. ఈ ఘటన బుధవారం వరంగల్ రూరల్ జిల్లా, శాయంపేట మండలంలోని, మైలారం గ్రామ శివారులో జరిగింది. కొందరు రైతులు తేమ ఉన్న ధాన్యాన్ని పంటచేలల్లో ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తరలించడానికి బస్తాల్లో నింపి నిల్వ చేసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం 11 గంటలకు ప్రాంతంలో జోగంపల్లి శివారులో కోసిన పంటచేలలో ఎవరో నిప్పు వేయడంతో మంటలు దట్టంగా రాజుకున్నాయి. గమనించిన రైతులు 100కి డయల్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరకాల ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చినప్పటికీ వాళ్లు రాలేదు.
మంటల ఉధృతి పెరగడంతో రైతులు మంటను చల్లార్చే ప్రయత్నం చేసినప్పటికీ అదుపులోకి రాలేదు. పంటచేలలో నిల్వ చేసుకున్న మైలారం గ్రామానికి చెందిన జూపాక మొగిలికి చెందిన 400 బస్తాల ధాన్యం, అల్లం కుమార్ స్వామి 100 బస్తాలు, గడిపే సాంబయ్య 80, గడిపే సమ్మయ్య80, గడిపే విజయ్ 80, గడిపే కుమారస్వామి 80బస్తాలతో పాటు పేర్లు తెలియని రైతుల బస్తాలు పూర్తిగా కాలిపోయాయి. అలాగే 20 విద్యుత్ మోటార్లు, వైర్లు, పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి అక్కడికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. ప్రభుత్వ పరిహారం అందేలా కృషి చేస్తామన్నారు.

*చంద్రుతండాలో..*
స్టేషన్ ఘన్ పూర్ : వ్యవసాయ బావి వద్ద కరెంట్ తీగలు రాపిడితో మంటలు లేచి నలుగురు రైతులకు చెందిన 8 గడ్డివాములు, నాలుగు
పశువుల కొట్టాలు కాలిపోయాయి. ఒక గేదె మృతిచెంది. ఈ సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం చంద్రుతండా శివారులో
జరిగింది. రూ. 3 లక్షలు ఆర్థిక నష్టం సంభవించినట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
*గోపాల్ పూర్ లో..*
ఎల్కతుర్తి: ప్రమాదవశాత్తు నిప్పంటుకుని అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ కు చెందిన తక్కళ్లపల్లి సంపత్ రావుకు చెందిన 10 క్వింటాళ్ల ధాన్యం అగ్నికి ఆహుతైంది. అలాగే పక్కనే ఉన్న కర్రె మురళీధర్ కు చెందిన షేడ్ నెట్ కు సంబంధించిన రూ. 10వేల విలువైన పైపులు కాలిపోయాయి.

About The Author