హైదరాబాద్ గల్లీల్లోనూ వాహనాల తనిఖీ…
హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా పోలీసులు గల్లీలలోనూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా మాస్క్లు, హెల్మెట్లతో పాటు వాహనాలకు సైడ్ మిర్రర్ లేనిపక్షంలో మోటార్ వెహికిల్ యాక్ట్ 117 (14) కింద కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నారు. లాక్డౌన్ సడలింపు కారణంగా వాహనాల రద్దీ అధికం కావడంతో ప్రమాదాలను నివారించే దృష్టా పోలీసులు సరికొత్త నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు.
ఇందులో భాగంగా కార్లకు, ద్విచక్ర, ఆటోలకు సైడ్ మిర్రర్ లేని కారణంగా ప్రమదాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసు బాసులు వివరిస్తున్నారు. రహదారులపై సంచరించే వాహనానికి అద్దం లేకపోతే రూ.135 రూపాయల చలాన్ వేస్తున్నారు. గత మార్చి 7వ తేదీ నుంచి మే 19 వరకు మాస్క్ లేకపోతే రూ. 1000, హెల్మెట్ రూ. 200 నుంచి 500 వరకు జరిమానాలు విధిస్తున్నారు. అలాగే సైడ్ మిర్రర్ లేని కారణంగానూ వందలాది కేసులు నమోదు చేస్తున్నారు. వెరసి 43 రోజుల్లో 1,06,120 కేసులను నమోదు చేసి చలాన్లను జారీ చేసినట్లు నగర పోలీసులు పేర్కొన్నారు.
నగరంలో రోడ్డెక్కుతున్న వాహనదారులకు బాటసారులు, వాహన చోదకులు మాస్కులు ధరించకపోవడం, రోడ్డుపై ఉమ్మేయడం ఇలాంటి వాటితో పాటు వాహనదారులు తమ వాహనంకు సైడ్ మిర్రర్ తప్పకుండా ఉండాలని నిబంధనలు విధించారు. వాహనదారుడు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు వాహనానికి అద్దం ఉండాల్సిందేనని పోలీసులు పేర్కొంటున్నారు. వాహనానికి అద్దం ఉంటే రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు మరోలేన్ కు వెళ్లేటప్పుడు, రోడ్డుపై టర్నింగ్ తీసుకునే సమయంలో వెనకాల వచ్చే వాహనాలను గుర్తించి ఎలాంటి గందరగోళం లేకుండా సులభంగా ప్రయాణించవచ్చుని పోలీసు బాసులు వివరిస్తున్నారు.
వాహనానికి అద్దం లేకపోతే వెనకాల నుంచే వచ్చే వాహనాలను గుర్తించలేమని దీంతో ప్రమాదాలు చోటు చేసుకున అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోడ్డుపై మలుపులు తిప్పినా పక్క లేన్ కు వెళ్తున్నా అకస్మాత్తుగా వెళ్లినా వెనకాల వచ్చే వాహనదారుడు గందరగోళానికి గురై వాహనదారుడి వాహనాన్ని ఢీకొట్టే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ విభాగం పోలీసు అధికారులు వివరిస్తున్నారు.