పచ్చి బాలింతను అడ్డుకున్న గ్రామస్థులు…6 రోజులుగా పసిగుడ్డుతో చెట్టుకిందే తల్లి జీవనం…


అదిలాబాద్ – కరోనా భయంతో గ్రామాలలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.. కొత్తవారిని గ్రామంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు.. అలాగే గ్రామాల నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా చూస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాజులగూడవాసులు కరోనా భయంతో మానవత్వాన్నే మరచిపోయి ప్రవర్తించారు.. అప్పుడే పుట్టిన పసిగుడ్డుని తీసుకుని ఇంటికి వస్తున్న మహిళను ఊరి బైటే అడ్డుకున్నారు గ్రామస్తులు. బొప్పరికుంట పంచాయతీలోని రాజులగూడకు చెందిన జైతు, అనసూయలు పొట్టకూటికోసం కరీంనగర్ వలస వెళ్లారు. మే 14న కరీంనగర్ లోనే అనసూయ పాప కు జన్మనిచ్చింది… లాక్ డౌన్ తో ఉపాధి కరువై సొంత ఊరికి చేరుకుందామని బయలుదేరారు. రవాణా సదుపాయం లేకపోవడంతో పసిగుడ్డుని తీసుకుని నడుచుకుంటూ 15కి సొంతూరు చేరుకున్నారు. అయితే స్థానికులు వారిని గ్రామంలోకి రానివ్వలేదు. మీకు కరోనా ఉందేమో..మీ పాపకు కూడా ఉందేమో..మీరిప్పుడు ఊర్లోకి వస్తే మాక్కూడా వస్తుంది. కాబట్టి మీరు ఊర్లోకి రావటానికి వీల్లేదని తెగేసి చెప్పేశారు. దీంతో దంపతులిద్దరు ‘‘పసిబిడ్డతో మళ్లీ వెనక్కి వెళ్లలేం..అలాగని ఇలా ఇక్కడ ఉండలేం .దయచేసి మా ఇంటికి మమ్మల్నిపోనీయండి’’..అంటూ బతిమాలుకున్నారు. కానీ గ్రామస్తులు వినలేదు. రావటానికి వీల్లేదన్నారు. దీంతో ఊరి చివరన ఓ చెట్టు కింద గుడారం వేసుకొని గత ఆరు రోజుల నుంచి ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైద్య సిబ్బంది నేడు రాజులగూడకు చేరుకుని తల్లీబిడ్డకు వైద్యపరీక్షలు చేశారు. వాళ్లు పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని తేల్చారు. తరువాత గ్రామస్థులను ఒప్పించి ఇంట్లోనే క్వారంటైన్లో ఉండే ఏర్పాట్లు చేశారు. అనసూయ, జైతు దంపతులకు క్వారంటైన్ ముద్ర వేసి ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించటం పరిస్థితి చక్కబడింది.

About The Author