కరోనా: ప్రపంచంలోనే 7వ స్థానానికి భారత్!
*దేశంలో 24గంటల్లో 230 మంది మృత్యువాత*
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో భారత్ విలవిలలాడుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతిరోజూ రికార్డుస్థాయిలో 8వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 8392 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,90,535కి చేరింది. ఇక కొవిడ్ మరణాల సంఖ్య కూడా ప్రతిరోజూ పెరుగుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే 230మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దీంతో సోమవారం ఉదయానికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 5394కి చేరింది. దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 91,819 మంది కోలుకొని డిశ్చార్జి కాగా మరో 93,322 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం ప్రకటించింది.
తాజా కేసులతో భారత్ ప్రపంచంలోనే వైరస్ తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో 7వ స్థానానికి చేరింది. ఈ వరుసలో ఫ్రాన్స్, జర్మనీలను దాటేసింది. మరణాల్లో మాత్రం ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది. 2లక్షల 32వేల కేసులతో ఇటలీ 6వ స్థానంలో ఉండగా, ఫ్రాన్స్ లక్షా 88వేల కేసులతో 8స్థానంలో కొనసాగుతోంది