మరపురాని గొప్ప ఉపాధ్యాయుడు త్రిపురనేని.


త్రిపురనేని మధుసూదనరావు పేరు వింటేనే యువతరానికి ఓ ఉత్సాహం. ఉరిమే ఉత్తుంగ తరంగం, విప్లవ భావాల ప్రభంజనం త్రిపురనేని మధుసూదనరావు. అధ్యాత్మిక రాజధానిలో ఎర్రని సింధూరం ఈ అధ్యాపకుడు.
నేను ప్రజాశక్తి పాత్రికేయునిగా, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా అనేక మార్లు త్రిపురనేని గారితో కలిసి మాట్లాడిన అనుభవం నాకుంది. నేను నేరుగా త్రిపురనేనికి విద్యార్ధిని కాలేదన్న బాధకూడా ఉంది. ఎస్‌.వి.ఆర్ట్స్‌ కళాశాలలో నేను చదివాను. త్రిపురనేని ఎస్‌జిఎస్‌ కళాశాలలో పని చేశారు. గత తార్కిక భౌతికవాదం పాఠం చెప్పటంలో అందెవేసిన చెయ్యి.
అనేక మార్లు సదస్సులకు, కళాశాలలో మీటింగులకు త్రిపురనేని గారు వక్తగా వస్తున్నారంటే ఎంతో ఆసక్తిగా వెళ్లేవాళ్లం. మధుసూదన రావు గారు నడిచివచ్చే ఓ విజ్ఞాన సర్వస్వం. ఏ విషయమైనా అడిగితే నిమిషం కూడా అలోచించకుండా అనర్గళంగా వివరించే వారు.
ఒక సందర్భంలో తిరుపతి నెహ్రూ మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో ఓ బహిరంగ సభ జరిగింది. ఆ సభలో వక్తగా పాల్గొన్న… త్రిపురనేని బెంగాల్‌ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ… 25 ఏళ్లు నిరంతరంగా పరిపాలించటం మార్క్సిస్టుల ఘనతగా చెబుతుంటారు… వరుసగా 25 ఈగలు మింగేస్తే కూడా రికార్డే అంటూ తేలిక భావంతో మాట్లాడారు. ఆ సభలో ఉన్న సిపిఎంకు చెందిన మేమంతా త్రిపురనేని గారు ఇలా మాట్లాడట మేమిటని ఆశ్చర్యపోయాం.
ఆ తరువాతి రోజు సిపిఎం యువనాయకులంతా త్రిపురనేని గారి ఇంటికి వెళ్లాము. ఆప్యాయంగా లోనికి ఆహ్వానించారు. ‘టీ’ ఇచ్చారు తాగుతూ ప్రస్తావించాము. నిన్న మీరు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు సర్‌. సైద్దాంతికంగా విభేదాలున్నా 25 ఏళ్ల పాలనని ఈగలని తినేయటంతో పోల్చటం ఏమిటి? మేము ఒక రకంగా ఆశ్చర్యపోయామని వివరించాము. కాసేపు మౌనంగా ఉన్నారు. అవును అలా మాట్లాడి ఉండాల్సిందికాదు అన్నారు. మేము కాసేపు మౌనంగా ఉన్నాము. ఇతర విషయాలపై చర్చ మళ్లింది.
త్రిపురనేని శిష్యులుగా ఉన్నవారు… సిపిఎం, సిపిఐ, మావోయిస్టులు లేదా వ్యక్తులుగా ఎక్కడున్నా వారిని కదిలిస్తే మొదట చెప్పేది. మాలోని చైతన్యాన్ని తట్టిలేపి సమాజాన్ని మరో కోణంలో చూపించిన వ్యక్తి మా మాష్టారు అంటారు. మరిచిపోలేని గొప్ప మాష్టారు త్రిపురనేని గారు.
క్రిష్ణాజిల్లాలోని దివితాలూక అంగలూరు గ్రామంకు చెందిన త్రిపురనేని వృత్తి రీత్యా తెలుగు అధ్యాపకుడుగా తిరుపతికి వచ్చి… తిరుపతిలో విప్లవ చరిత్రగా మారారు.
*తరగతి గదిలో పాఠం చెప్పినా, బహిరంగ సభలో ప్రసంగించినా, వ్యక్తిగతంగా మాట్లాడినా ఆ చైతన్యపు హోరు, విజ్ఞానపు జడిలో ఎదుటివారు తడిసి ముద్ద కావాల్సిందే.*
రెండవ ప్రపంచ యుద్ద కాలంలో త్రిపురనేని ఆరేళ్ల పసిబాలుడు. హిట్లర్‌ను ఓ విలన్‌లా, స్టాలిన్‌ను అభిమాన హీరోగా ఆనాడే భావించారు. కమ్యూనిస్టులంటే మంచి వాళ్లనే బలమైన అభిప్రాయం ఏర్పడింది.
హైస్కూలు రోజుల్లో చిన్నాన్న గోపీచంద్‌ సాహిత్యం, తాతగారి పద్యాలు వంట బట్టాయి. కళాశాల రోజుల్లో నాటి అధ్యాపకుల ప్రభావం త్రిపురనేనిపై ఎంతగానో ఉంది.
ఆంధ్ర యూనివర్శిటీ విప్లవ దృక్పధాన్ని ఏర్పరిచింది. ‘‘నా జీవితంలో పుస్తక జ్ఞానమే నన్ను ముందుకు నడిపించింది’’ అని పలు సందర్భాలో ఆయన చెబుతుంటారు.
తిరుపతిలో 40 సంవత్సరాలపాటు విప్లవభావాలను పెంచి పోషించటంలో ఆయన కృషి అపూర్వమైనది. తిరుపతిలో విప్లవోద్యమానికి ఆయన ఒక చిరునామాగా వ్యవహరించారనటంలో సందేహం లేదు.
వేలాది మంది విద్యార్ధుల చూపును సమాజం వైపు మళ్లించిన గొప్ప ఉపాధ్యాయుడు, మహా వక్త, మేధావి త్రిపురనేని మధుసూదన రావు గారు… ఉపాధ్యాయుడిగా ఆయన జీవితం ఉపాధ్యాయుందరికీ ఆదర్శ ప్రాయమే. ‘తిరుపతి మవో’గా పిలుచుకునే మధుసూదన రావు గారిని మరోసారి స్మరించుకోవటానికి అవకాశం కలిగింది. *చైతన్య మూర్తి త్రిపురనేనికి విప్లవజోహార్లు*.

*కందారపు మురళి*
*సిఐటియు*
*ప్రధాన కార్యదర్శి*
*తిరుపతి*

About The Author