ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మిన సిక్కోలు అధికార పార్టీ నేతలు…
గుడ్డిదర్భార్ వెలగబెడుతున్న జిల్లా రెవెన్యూ అధికారులు
#నిజం పరిశోధనలో విస్తుపోయే నిజాలు…
* సర్కార్ భూముల్లో దొంగలుపడ్డారు.
* పాత్రునివలస కేంద్రంగా కోట్లాది రూపాయల ల్యాండ్ స్కాం
* ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మిన ఘనులు
* రెవెన్యూ,రిజిస్ట్రేషన్ శాఖలు కూడా పాత్రదారులే
* తెరవెనుక కథ నడిపించిన వైకాపా నేతలు
(నిజం ప్రత్యేక ప్రతినిది,శ్రీకాకుళం)
నిరుపేదలకి ఇళ్లపట్టాలు మంజూరు చేసి గూడు కల్పించాలని ప్రభుత్వం సంకల్పిస్తున్న వేళ దానిలో కూడా భారీ స్కాంకి తెగపడే ప్రభుద్దులు పుట్టుకొచ్చారు. అవకాశం దొరికితే చాలు తిమ్మినిబమ్మిని చేసి తమదైన రీతిలో కోట్ల రూపాయలు అడ్డదారుల్లో దోచేందుకు సిద్దమైపోయారు.
పక్కా జిరాయితీ భూములను పేదలకు ఇచ్చేందుకు రైతులు సంసిద్ధంగా ఉన్నా వాటిని కాదని రాజకీయ పరపతితో భూముల కొనుగోళ్ళలో గోల్ మాల్ వ్యవహారాన్ని నడిపించేసారు.గుట్టు చప్పుడు కాకుండా ఎంతో కాలంగా నడుస్తున్న ఈ వ్యవహారం ‘నిజం’ పరిశోధనలో వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక స్థానిక మహిళా ప్రతినిధి భర్త ,అధికార వైకాపాకి చెందిన ప్రతినిధి కీలకంగా వ్యవహరించి కమిషన్లు కొట్టేసినట్లుగా బహిరంగంగానే చర్చ జరుగుతోంది.
రెవెన్యూ విషయాలలో తనకు ఉన్న అపార జ్ఞానాన్ని అడ్డదారిలో ఉపయోగించి అధికారులను ప్రలోభాలకు గురిచేసి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం చేతే కొనిపించిన ఘనకార్యం జిల్లా రెవెన్యూ అధికారుల గుడ్డి దర్భార్ ను వెక్కిరిస్తోంది.
సామాన్యుడు పాస్ బుక్ కోసమో ,టైటిల్ డీడ్ కోసమో రెవెన్యూ కార్యాలయాల గడపతొక్కితే సవాలక్ష ప్రశ్నలు కోడి సందేహాలు వ్యక్తపరిచే అధికారులు ,అధికార పార్టీకి చెందిన నాయకుడు ముఖం చూసి ముచ్చమటలు పోసుకున్నారో…మైమరిచిపోయారో …కాసులకి కక్కుర్తిపడ్డారో…తెలియదుగాని ఫైళ్ళను రాజధాని ఎక్స్ ప్రెస్ లా నడిపించేసి ఉన్నతాధికారులను సైతం ఏ మార్చేసారు.
ఈ వ్యవహారంలో నష్టపరిహారం పేరుతో భారీగా సొమ్ములు ఇప్పటికే అక్రమార్కుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయినట్లుగా తెలుస్తొంది. #శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని #పాత్రునివలస గ్రామంలో జరిగిన ఈ భారీ స్కాం వివరాల్లోకి వెళ్లితే …
శ్రీకాకుళం నగర పేదల కోసం ప్రభుత్వం ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు భారీగా భూసమీకరణ ప్రయత్నాలు గత ఏడాది కాలంగా చేస్తూ వచ్చింది.గత ప్రభుత్వం కాలంలో కూడా కొంత భూ సేకరణ జరిగినా ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన జూలై 8వతేది ముహూర్తానికి భూ వితరణకి పూర్తిగా యంత్రాంగం సర్వసన్నధం అయ్యింది. పాత్రునివలస -2 పరిధిలో ఈ కార్యక్రమం నిమిత్తం సర్వే నంబర్ 7/1,7/2,7/3 లలో భూ సేకరణను సుమారు 10.50 ఎకరాలు జరిగింది.ఇంత వరకూ భాగనే ఉన్నా సదరు సర్వే నంబర్లలో ఉన్న భూమి ప్రభుత్వానికే చెందిన భూమి అయినప్పటికీ దాని పూర్వాపరాలు చూడకుండా శ్రీకాకుళం తహాసిల్థార్ కార్యాలయం పనిచేసిన తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది.
‘నిజం’ పరిశోధనలో 7/1,7/2,7/3 సర్వే నంబర్లలో ఉన్న భూమి ప్రభుత్వ భూమిగా,సర్కారు పోరంబోకు భూమిగా అధికారిక పత్రాలే పేర్కోంటున్నాయి. శ్రీకాకుళం తహాసిల్థార్ 23/07/2008న, 2018న ఇచ్చిన పత్రాలే ఇందుకు ఉదాహరణలు. 7/1,7/2,7/3 సర్వే నంబర్లలో గల భూమి ప్రభుత్వ పొరంబోకని 2006 నుంచి 2011-12 వరకూ అడంగల్/పహాణీలో పేర్కోనడంతో పాటు వాటిని శ్రీకాకుళం తహాసిల్థారే స్వహస్థలాలతో సంతకాలు చేసి సమాచార హక్కు చట్టం క్రింద జారీ చేసారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వ పొరంబోకుగా ఉన్న సదరు భూమి పాత్రునివలసకి చెందిన గోపిశెట్టి ఆనందరావు, ఎం.వెంకటగిరిల పేరుతో పాసుపుస్తకాలను 2007-08లో మంజూరు చేయగా భూమి స్వభావంలో ప్రభుత్వ భూమి అని,భూమి వివరణలో పోరంబోకు అని పేర్కోంటూనే అనుభవ స్వభావంలో మాత్రం వారసత్వం అంటూ అధికారులు పేర్కోనడం విచిత్రమైన ‘నిజం’.
సర్వే నంబర్ 7/2 భూమికి సంబందించి 2006లో ఆరుగురుని ఆక్రమణదారులుగా పేర్కోన్న రెవెన్యూ అధికారులు 2007లో గోపిశెట్టి ఆనందరావు అనే మరో వ్యక్తి ఆక్రమణదారుగా పేర్కొని 2006లో పేర్కొన్న ఆక్రమణదారుల పేర్లను తొలగించడం చూస్తే ఆక్రమణదారుల మద్య భూమి అమ్మకం కొనుగోళ్లు జరిగిందన్నది స్పష్టంగా కనిపించే ‘నిజం ‘.
భూ ఆక్రమణదారులను శిక్షించి వారిని ప్రభుత్వ భూముల నుంచి తొలగించేందుకు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కేసు దాఖలు చేసి విచారించాల్సిన అధికారులు ఆ పనికి పూనుకోకపోగా గతంలో ఉన్న ఆక్రమణదారులు తెరచాటుకు జారుకుని కొత్త ఆక్రమణదారుడుగా గోపిశెట్టి ఆనందరావు రంగం మీదకి వస్తే ఆతడి ఆక్రమణను చూసి చూడనట్లుగా వ్యవహరించడమే కాక ఆక్రమణదారుడుకి సైతం 011900022ఎన్ ఓ17070, 011900022ఎన్ ఓ 19999, నంబర్లతో పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం వారి తెలివితేటలకు అద్దంపడుతున్నాయి.
ఇలా ఆక్రమణదారుడుగా 7/2 భూమిమీదకి వచ్చిన గోపిశెట్టి ఆనందరావు అదే తీరులో సర్వే నంబర్ 7/3 భూమిని కూడా ఆక్రమించుకోగా సదరు వ్యక్తికి ఆ భూమిమీద కూడా 011900022ఎన్ఓ00188 ఖాతా నంబర్ తో పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఇచ్చేసారు. ఇలా ప్రభుత్వ పోరంబోకుకు ఆక్రమణదారుడుగా తెరమీదుకి వచ్చిన గోపిశెట్టి ఆనందరావు 7/1 సర్వే నంబర్ లోని ప్రభుత్వ పొరంబోకు భూమిని వారసత్వంగా పొందారంటూ పహాని అడంగల్ లో శ్రీకాకుళం తహాసిల్థార్ పేర్కొనడం చూస్తే రెవెన్యూ యంత్రాంగం లీలలు ఏ స్థాయిలో సాగుతున్నాయో రికార్డులు ఎలా తారుమారవుతున్నాయో అద్దంపడుతుంది.
అలాగే సర్వే నంబర్ 7/2లోని 3.23 ఎకరాల విస్తీరణం గల ప్రభుత్వ పొరంబోకు భూమి మేలారపు వెంకటగిరి అనే వ్యక్తి కూడా పట్టదారుగా అవతరించారు.ఈయనకు సంబందించి ఏవిదంగా భూమి దక్కించుకున్నారన్న విషయం తహాసిల్థార్ స్పష్టం చేయకుండానే అడంగల్ /పహాణి జారీ చేయడం మరో విచిత్రం.ఈ విధంగా ఆక్రమణదారులుగా భూములు మీద ఉన్న మైలవరపు వెంకటగిరి ,గోపిశెట్టి ఆనందరావు లు అనంతర కాలంలో ప్రభుత్వ పొరంబోకు భూమిని అమ్మకానికి పెట్టగా దానిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఆ పనిని చేయకపోగా ఎన్ ఓసిలు జారీ చేసి మరి రిజిస్ట్రేషన్లకు సహకరించారు. అప్పట్లో ఉన్న రెవెన్యూ అధికారులు సదరు ప్రభుత్వ పొరంబోకు భూమిని రిజిస్ట్రేషన్లు చేసేందుకు నిరంభ్యతర దృవపత్రాలను పైతం జారీ చేసారు.
ఈ విధంగా 2010 నుంచి సదరు సర్వే నంబర్ 7/1,7/2,7/3 భూముల అమ్మకాలు ప్రారంభకాగా ఇప్పటి వరకూ రెండు మూడు చేతులు మారాయి.తాజాగా అదే భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం సేకరించారు.ఈ సందర్భంలో కూడా జిల్లా ఉన్నత రెవెన్యూ అధికారులు భూమి పూర్వాపరాలు వంటివి పూర్తిగా అధ్యయనం చేయకుండా జిరాయితీ భూమికి చెల్లించినట్లుగా భారీ మొత్తంలో నష్టపరిహారం అందజేసినట్లుగా తెలుస్తొంది. చుట్టుప్రక్కల ఉన్న పట్టదారుల కంటే అధిక భారీ స్థాయిలో నష్ట పరిహారం అందజేసి భూ సేకరణ చేసినట్లుగా స్థానిక రైతులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంలో పాత్రునివలస పంచాయితీకి చెందిన ఓ మాజీ మహిళా ప్రజాప్రతినిధి భర్త వైకాపా నేత మొత్తం చక్రం తిప్పి కమిషన్ల రూపంలో సొమ్ములు చేసుకున్నట్లుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. అస్సలు ప్రభుత్వ పొరంబోకు భూమి ఏ విధంగా చేతులు మారింది..రెవెన్యూ అధికారులు పాత్ర ప్రమేయం ఏ మేరకు ఉంది..భూ సేకరణలో జరిగిన లోగుట్టు ఏమిటో తదితర వివరాలతో మళ్ళీ కలుద్దాం….
#YSRCP #APXMYSJagan #TDP #NCBN #Srikakulam