2022 మహిళల ఫుట్‌బాల్ ఆసియాకప్ కు ఆతిధ్యం – భారత్
న్యూఢిల్లీ: 2022లో జరగనున్న మహిళల ఫుట్‌బాల్ ఆసియా కప్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకుంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీల ఆతిథ్యం కోసం గత కొన్నాళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్న అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ఎట్టకేలకు ఫలితం సాధించింది. 1979లో చివరిసారి ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన భారత్ .. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలుగా తిరిగి చాన్స్ దక్కించుకోలేకపోయింది. మెగాటోర్నీ నిర్వహణకు భారత్ అనువైన వేదిక అని ఆసియా ఫుట్‌బాల్ కమిటీ (ఏఎఫ్‌సీ) శుక్రవారం తెలిపింది. దీంతో ఏఐఎఫ్‌ఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. ‘మా ఆతిథ్యంపై నమ్మకముంచి ఈ అవకాశం ఇచ్చిన ఏఎఫ్‌సీకి ధన్యవాదాలు. టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తాం’ అని ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు.