విశాఖ దివ్య హత్య కేసులో వీడిన మిస్టరీ
అందమే ఆమెకు శాపమైంది. నిండు నూరేళ్లు బతకాల్సిన ఆమె దుర్మార్గుల చేతుల్లో బలైపోయింది. అందాన్ని పెట్టుబడిగా పెట్టి కాసులు సంపాదించాలనుకుంది ఓ దుర్మార్గురాలు. అందుకు సహకరించనందుకు ఆమె ప్రాణాలను గాల్లో కలిపేసింది. గ్రేటర్ విశాఖ నగరంలో రెండు రోజుల క్రితం అక్కయ్యపాలెం చెక్కులురాయి బిల్డింగ్ వద్ద అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన దివ్య కేసులో వెలుగుచూసిన దారుణమైన విషయాలు.
అసలేం జరిగిందంటే..
దివ్య అనే యువతి అందాన్ని అడ్డుపెట్టుకుని ఆమెతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించాలని వివాహిత వసంత, ఆమె సోదరి ప్లాన్ వేసుకున్నారు. దివ్యను పెట్టుబడిగా పెట్టి వసంత గ్యాంగ్ డబ్బులు సంపాదిస్తోంది. ఇలా జరుగుతున్న క్రమంలో డబ్బులు పంపకం విషయంలో దివ్య, వసంత గ్యాంగ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో దివ్యను అంతమొందించాలని వసంత గ్యాంగ్ స్కెచ్ వేసింది. అంతే తడువుగా కుట్ర ప్లాన్‌ను అమలు చేశారు. దివ్యకు గుండు గీసి, కనుబొమ్మలు కత్తిరించి, వాతలు పెట్టి ప్రాణాలు తీశారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. రెండో రోజుల్లోనే మిస్టరీని ఛేదించారు. దివ్య స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాగా గుర్తించారు. నిందితులు వసంత, ఆమె సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరు కోసం గాలింపు చేపట్టారు.