ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం పై నిరసన
చిత్తూరు జిల్లా:వాల్మీకిపురం ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల వైద్యుల పనితీరుపై వాల్మీకిపురం యువత బుధవారం వైద్యశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వైద్యశాలలో వైద్యులు సరైన సమయ పాలన పాటించడం లేదని నిండు గర్భిణీ లకు మదనపల్లె, తిరుపతి ఆసుపత్రులకు రెఫర్ చేయడం వలన ఆర్థిక స్తోమత లేని వారు పలు ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి రాత్రి సమయాలలో వచ్చే రోగులకు సరైన వైద్యం అందించక వారిని మదనపల్లి, తిరుపతి వైద్యశాలకు సిఫారసు చేస్తూ పంపించి వేస్తున్నారు. నిండు గర్భిణులకు ఉదయం 9 గంటల నుండి 11.30 నిమిషాల వరకు బయట ఎండలో కూర్చో బెడు తున్నారు. ఆసుపత్రిలోని ల్యాబ్ లో రక్త పరీక్షలు చేసి రిపోర్టులు సక్రమంగా ఇవ్వడం లేదు అని అన్నారు. ఇక్కడి ప్రజలు ఆసుపత్రిలో సరైన వైద్యం అందించడం లేదని మదనపల్లి మరియు ఇతర ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేసుకుంటున్నారు. ఆసుపత్రి లో పనిచేసే డాక్టర్లు తమ సొంత ఆసుపత్రుల నుండి ఫోన్ వస్తే హాస్పిటల్ పని సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా తమ ప్రైవేటు క్లినిక్ లకు వెళ్ళిపోతున్నారు. దీనిపై వాల్మీకిపురం లోని యువకులు అందరూ కలిసి ఆసుపత్రి ఆవరణలో బుధవారం ధర్నాకు దిగారు. ఆసుపత్రి సిబ్బంది తో యువకులు మాట్లాడుతూ సరైన చికిత్స అందించకపోతే పై అధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిపురం యువత సాదిక్ అహమద్,తోటవీది పెద్ద, షాహేద్, శివ, చందు, ఇర్ఫాన్, ఆర్.యం. ఆశర్, నవీన్, లోకేష్ , అశోక్ తదితరులు పాల్గొన్నారు.