చిత్తూరులో కరోనా విజృంభణ
చిత్తూరు జిల్లా కేంద్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం కొత్తగా తొమ్మిది మందికి కొవిడ్ పాజిటివ్ రాగా.. తిరుపతిలో 4, శ్రీకాళహస్తిలో 2, నిండ్రలో 3 చొప్పున ఉన్నాయి. జిల్లా అధికారులు సాయంత్రం మరో నలుగురికి నిర్ధరించగా.. చిత్తూరు, చంద్రగిరిలో ఇద్దరేసి చొప్పున ఉన్నారు. చంద్రగిరిలోని రెండు కేసులకు ముంబయి మూలాలుగా గుర్తించారు. చిత్తూరు గ్రామీణ మండలంలోని సీజీపల్లికి చెందిన ఓ వ్యక్తి స్థానిక కర్మాగారంలో పనిచేస్తూ చెన్నై వాసితో కలిసి తిరగ్గా వైరస్ సోకింది.
ఆ ముందు రోజే తన ఇంట్లో కుమార్తె పుట్టినరోజు వేడుకలకు బంధుమిత్రులను ఆహ్వానించాడు. దశల వారీగా ఆ ఇంట తొమ్మిది మందికి కరోనా సోకింది. ఈ కేసులకు మూలకారణమైన వ్యక్తి గ్రామస్థుల భయంతో సత్యనారాయణపురంలోని ఇంటికి వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించి స్వీయనిర్బంధంలో ఉంచారు. గ్రామంలో 37 మంది నుంచి గళ్ల నమూనాలు సేకరించారు. చిత్తూరు నగరంలో కేసుల సంఖ్య 27కు చేరింది. శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో ఓ అర్చకునికి కరోనా తేలడంతో ఉద్యోగుల నుంచి సోమవారం శాంపిళ్లు సేకరించగా.. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.