రూ.10 వేల లోపే రెండు ఫోన్లు.. లాంచ్ చేయనున్న భారతీయ బ్రాండ్
భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కార్బన్ త్వరలో రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేయనుంది. మీకు కార్బన్ మొబైల్స్ గుర్తున్నాయా? కొన్ని సంవత్సరాల క్రితం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో భారతీయ బ్రాండ్. షియోమీ, ఒప్పో, వివో వంటి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల ధాటికి ఈ బ్రాండ్ గురించి అందరూ మర్చిపోయారు. అయితే ఇప్పుడు చైనాకు వ్యతిరేక ఉద్యమం నడుస్తుండటం, ప్రజలు స్వచ్ఛందంగా చైనా ఉత్పత్తులను ఉపయోగించకూడదని నిర్ణయించుకుంటూ ఉండటంతో కార్బన్ మళ్లీ దూసుకురావడానికి సిద్ధం అవుతోంది.కార్బన్ త్వరలో రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. సాఫ్ట్ వేర్ లో కూడా ఇప్పుడు మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు.కార్బన్ మొబైల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సచిన్ దేవ్ సర్రే ‘ది మొబైల్ ఇండియన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలిపారు. ఆగస్టులో ఈ ఫోన్లు లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. వీటి ధర కూడా రూ.10 వేల లోపే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏ భారతీయ బ్రాండ్లూ ఇంతవరకు లాంచ్ చేయని ఉత్పత్తులను కూడా కార్బన్ లాంచ్ చేస్తుందని, తాము త్వరలో స్మార్ట్ వాచ్ ను కూడా లాంచ్ చేయనున్నట్లు తెలిపారు.
గత కొంతకాలంగా కార్బన్ కాస్త నిశ్శబ్దంగా ఉన్నది నిజమేనని, అయితే తాము ఖాళీగా లేమని, సాఫ్ట్ వేర్ ను బలోపేతం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. తమ యూజర్ ఇంటర్ ఫేస్ భారతీయులను దృష్టిలో పెట్టుకుని రూపొందించామని, డేటా లీక్ అవ్వకుండా అదనపు సెక్యూరిటీని కూడా అందించినట్లు తెలిపారు. అంతేకాకుండా తమ యూజర్ ఇంటర్ ఫేస్ లో ఎటువంటి యాడ్లు కూడా ఉండవని తెలిపారు.